iDreamPost
android-app
ios-app

Anasuya Counter To Kota : అనసూయ మీద కామెంట్స్.. ‘కోటా’కి అనసూయ ఘాటు కౌంటర్

Anasuya Counter To Kota : అనసూయ మీద కామెంట్స్.. ‘కోటా’కి అనసూయ ఘాటు కౌంటర్

టాలీవుడ్ లో లీడింగ్ యాంకర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ ఆమె బట్టల గురించి ఒక్క మాట అన్నా తీసుకోదు. గతంలో ఇదే విషయం చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా ఎంతో మందికి ఆమె ఘాటు సమాధానాలు ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మీద కూడా ఆమె అదేవిధంగా ఘాటుగా స్పందించడంతో ఆసక్తికరంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాను అని ప్రకటించి కోటశ్రీనివాసరావు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో ఆయనతో యూట్యూబ్ ఛానల్స్ వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ టివి షో మీద మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగడంతో అలాంటి షోలు ఎల్లకాలం ఉండవని ఏదో అలా నడుస్తుందని కోట శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. అంతే కాక షోలో నాలుగు పంచ్ డైలాగులు, పొట్టి బ‌ట్ట‌లు వేసుకోవ‌డం త‌ప్ప ఏమి ఉండ‌దని అన్నారు.అనసూయ ఎంతో అందంగా ఉంటుందని, మంచి నటి, కానీ అలాంటి బట్టలను వేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. అనసూయ ఎలా వచ్చినా చూస్తారని చెప్పుకొచ్చిన ఆయన రోజా చక్కగా రెడీ అవుతుందని ఈమెకు ఏమైంది? అని ప్రశ్నించారు.

ఈ కామెంట్స్ మీద అనసూయ ఘాటుగా స్పందించింది. ఇప్పుడే ఒక సీనియర్ నటుడు నా బట్టల గురించి చేసిన కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి, నా బట్టల గురించి ఆయనకు అంత ఆలోచన ఎందుకో నాకు అర్థం కావడం లేదని అనుసూయ పేర్కొంది. అంతటి సీనియర్ నటుడు ఇలా వేరే వాళ్ల బట్టల గురించి కామెంట్ చేయడం చాలా చిన్నతనంగా ఉందని పేర్కొన్న ఆమె బట్టలు అనేది వాళ్ల వాళ్ల పర్సనల్ ఒపీనియన్ అని అలాగే వృత్తి పరంగా కూడా ఒక్కోసారి వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది.

అసలు సోషల్ మీడియా ఇలాంటి పనికిరాని కంటెంట్ ని ఎందుకు ప్రోత్సహిస్తుంది అని ప్రశ్నించిన ఆమె గతంలో కూడా సోషల్ మీడియా ఉండి ఉంటే సదరు సీనియర్ నటుడిని మీరు ఎందుకు తాగుతున్నారు? మీరు ఎందుకు చిరిగిన బట్టలు వేసుకుంటున్నారు? తెరమీద మహిళలను ఎందుకు కించపరుస్తున్నారు? అని ప్రశ్నించేదా? అని అనసూయ అభిప్రాయపడింది. అలాగే పెళ్లయి పిల్లలున్నా కూడా నటీమణులతో చొక్కాలు లేకుండా రొమాన్స్ లు చేసే హీరోలను ఎందుకు ప్రశ్నించరు అని అనసూయ ప్రశ్నించింది.

ఇద్దరు పిల్లలు ఉండి కూడా ఏదో సాధించాలని తాపత్రయపడుతూ, పితృస్వామ్య పద్ధతులను ప్రశ్నించే నాలాంటి వాళ్ల మీద ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తారని ఆమె ప్రశ్నించింది. దయచేసి ఇకమీదట వేరే వాళ్ల గురించి ఆలోచించే ముందు మన గురించి మనం ఆలోచించుకుందామని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read : Squid Game : రికార్డుల ప్రకంపనలు సృష్టిస్తున్న కొరియన్ డ్రామా