ఈ ఆధునిక కాలంలో ఆడవారిపై పలు విధాలుగా వేధింపులు జరుగుతున్నాయి.. ఇవన్నీ ఒకెత్తయితే సోషల్ మీడియా వేదికగా జరిగే వేధింపులు మరో ఎత్తు. జుగుప్సాకరంగా, ఆడవారి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కొందరి ఆకతాయిల పని..
సామాన్యులకు జరిగే వేధింపులతో పోలిస్తే సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై జరిగే వేధింపులు మరీ ఎక్కువ.. వారి వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ అనేకమంది అసభ్య పదజాలం వాడుతూ సెలెబ్రిటీల గురించి పోస్టులు పెడతారు కొందరు ఆకతాయిలు.. కాగా ఇప్పుడు అలా తన గురించి అసభ్యకరమైన రీతిలో ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన కొందరిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ప్రముఖ యాంకర్ అనసూయ ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు అనసూయ భరద్వాజ్ కి సమాధానం ఇచ్చారు.. తన ట్వీట్ కి స్పందించిన పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు.. కాగా అనసూయపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ట్వీట్ ని ట్విట్టర్ నుండి తొలగించారు.. ఇలా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసే ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.