iDreamPost
android-app
ios-app

బెల్లం.. బౌద్ధం.. నేడు జిల్లా కేంద్రం -నెరవేరిన అనకాపల్లి చిరకాల కోరిక

  • Published Apr 04, 2022 | 8:27 PM Updated Updated Apr 04, 2022 | 8:43 PM
బెల్లం.. బౌద్ధం.. నేడు జిల్లా కేంద్రం  -నెరవేరిన అనకాపల్లి చిరకాల కోరిక

శతాబ్దాల ఘనమైన చరిత్ర.. బౌద్ధమతం విరాజిల్లిన ఖ్యాతి.. బెల్లం వ్యాపారంలో దేశవ్యాప్త ఘనత.. పురాతన కాలం నుంచే పట్టణీకరణ వైపు అడుగులు వేసిన అనకాపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. విశాఖ జిల్లాలో మహావిశాఖ నగరం తర్వాత ఏకైక పెద్ద పట్టణంగా, వ్యాపార వ్యవసాయ కేంద్రంగా విరాజిల్లుతున్నా వటవృక్షం నీడలో మరుగున పడిపోయే చిన్న చెట్టు మాదిరిగా విశాఖ మహానగరం ముందు మసకబారిపోతూ.. చివరికి పురాతన మున్సిపాలిటీ అయినప్పటికీ మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో విలీనమైపోయి ఉనికే కోల్పోయే ప్రమాదంలో పడిన అనకాపల్లి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే గ్రామీణ విశాఖ జిల్లా కేంద్రంగా అనధికారికంగా చెలామణీ అవుతున్న ఈ పట్టణం పూర్తిస్థాయిలో సాధికారికంగా జిల్లా రూపు దాల్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు విశాఖ వెళ్లే అవసరం లేకుండా పాలనను చేరువ చేసింది. కొన్ని శతాబ్దాల క్రితం నుంచే అనకాపల్లి ఉనికి, ప్రత్యేకత చరిత్రలో కనిపిస్తుంది. అప్పటినుంచీ అనేక రాజవంశాలు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు, జమీందారీల పాలనను చూసిన ఈ ప్రాంతం సరికొత్త పాలను కేంద్రంగా అవతరించింది.

దంతపురం పేరుతో బౌద్ధక్షేత్రం

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన బ్రహ్మదత్తుడు అనే రాజు గౌతమ బుద్ధుడి దంతాన్ని తెచ్చి బౌద్ధ స్థూపం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అందువల్లే అప్పట్లో దంతపురం పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండపై బౌద్ధ ఆరామాలు, స్థూపం నిర్మించి అనేకమంది బౌద్ధులు అక్కడి గుహల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేసేవారు. ఇప్పటికీ ఏటా సంక్రాంతి మరునాడు బొజ్జన్న కొండపై బౌద్దులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా తూర్పు కళింగులు, మహమ్మదీయుల పాలనలో ఇక్కడ బౌద్ధం క్షీణదశకు చేరుకుని.. వారంతా వెళ్లిపోయారు. తిరిగి 1906లో బొజ్జన్నకొండపై బౌద్ధ ఆరామాలు ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొనడంతో మళ్లీ దానికి వెలుగు వచ్చింది.

ప్రముఖ వాణిజ్యకేంద్రం

12వ శతాబ్దం వరకు కళింగ రాజ్యంలోని ముఖ్యపట్టణాల్లో ఒకటిగా అనకాపల్లి విరాజిల్లింది. పక్కనే శారదా నది, సారవంతమైన భూములతో చెరుకు పంటకు ప్రసిద్ధి పొందింది. అప్పట్లోనే చెరుకు నుంచి బెల్లం తయారు చేసి పూడిమడక రేవు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తర్వాత కాలంలో నీటిపారుదల వసతులు పెరగడంతో చెరుకు సాగు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించింది. దాంతోపాటు అనకాపల్లి కేంద్రంగా బెల్లం మార్కెట్ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం అనకాపల్లి దేశంలోనే రెండో పెద్ద బెల్లం మార్కెట్ గా కొనసాగుతోంది.

పురాతన మున్సిపాలిటీ

మహమ్మదీయుల పాలనలో దీనావస్థకు చేరుకున్న అనకాపల్లి 1652 తర్వాత విజయనగరం పూసపాటి గజపతుల హయాంలో మళ్లీ ఉచ్ఛ స్థితికి చేరుకుంది. బ్రిటిష్ పాలనలో 1877లో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. దేశంలోని పురాతన మున్సిపాలిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 136 ఏళ్ల ప్రస్థానం తర్వాత 2013లో మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో ఈ మున్సిపాలిటీని విలీనం చేసి ఆరో జోన్ గా మార్చడంతో ఉనికి కోల్పోయింది.

దశాబ్దాల డిమాండ్

ఉమ్మడి విశాఖ జిల్లాకు విశాఖ నగరం ఇంతవరకు పరిపాలన కేంద్రంగా ఉంది. నగరం శరవేగంగా ఎదుగుతూ ఆధునికత సంతరించుకోవడం, చాలా గ్రామాల నుంచి ఆ నగరానికి మధ్య 100 కి.మీ.పైగా దూరాభారం ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడేవారు. దాంతో అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దానికి తగట్టే ఆ పట్టణాన్ని గ్రామీణ జిల్లా కేంద్రంగా పరిగణిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి జిల్లాల పునర్విభజనలో దానికి చోటు కల్పించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు మున్సిపాలిటీలు, 24 మండలాలతో కొత్త జిల్లా అవతరించింది. వ్యవసాయ ప్రధానమైన ఈ కొత్త జిల్లాలో తుమ్మపాల, చోడవరం, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలు, అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్), రాంబిల్లిలో తూర్పు నౌకాదళం నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ నౌకాదళ కేంద్రం (ఐఎన్ఎస్ వర్ష) వంటివి చేరడంతో పారిశ్రామికంగానూ కొత్త జిల్లా పరుగులు తీయనుంది.