iDreamPost
android-app
ios-app

మారుతీరావు అంత్యక్రియల్లో అమృతను అడ్డుకున్న బంధువులు …

మారుతీరావు అంత్యక్రియల్లో అమృతను అడ్డుకున్న బంధువులు …

ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద రీతిలో హైదరాబాద్ ఆర్య వైశ్య భవన్ లో మృతి చెందారు. గారెల్లో విషం కలుపుకుని తిన్నందునే మారుతీరావు శరీరం రంగు మారిందని వైద్యులు తెలిపారు.మారుతీరావు అంత్యక్రియలు అతని స్వస్థలమైన మిర్యాలగూడలో జరగనున్నాయి. కాగా తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని కడసారి తండ్రిని చూసేందుకు మారుతీరావు కుమార్తె అమృత ప్రయత్నించారు.

కానీ ఆమె రాకను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ అమృత రాకకు అంగీకరించడం లేదు. అమృత వల్లనే మారుతీరావుకు ఈ గతి పట్టిందని ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని చూడటానికి వెళ్తే తనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున పోలీసుల సహాయంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రయత్నించారు. తండ్రిని కడసారి చూసేందుకు అమృత వస్తుండడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

పోలీసుల సహాయంతో తండ్రి భౌతికకాయాన్ని కడసారిగా చూడటానికి శ్మశానవాటికకు చేరుకున్న అమృతకు చేదు అనుభవం ఎదురైంది. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ భద్రత నడుమ శ్మశానవాటికకు చేరుకున్నఅమృతను చూడగానే “అమృత గో బ్యాక్” అంటూ ఆమె కుటుంబ సభ్యులు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున తన తండ్రిని చూడకుండానే అమృత వెనుదిరగాల్సి వచ్చింది.

గతంలో తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైంది.ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష తప్పదనే ఆందోళనతోపాటు తన ఆస్తుల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో గొడవల వల్ల మారుతిరావు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.