iDreamPost
android-app
ios-app

పరువునష్టం దావా కేసులో సంచలన తీర్పు.. బోరున ఏడ్చిన హీరోయిన్

  • Published Jun 02, 2022 | 10:51 AM Updated Updated Jun 02, 2022 | 10:51 AM
పరువునష్టం దావా కేసులో సంచలన తీర్పు.. బోరున ఏడ్చిన హీరోయిన్

పరువునష్టం దావా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించగా.. హీరోయిన్ బోరున ఏడ్చింది. ఇది జరిగింది మన తెలుగు ఇండస్ట్రీలో కాదులెండి. హాలీవుడ్ లో. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్ – అంబర్ హర్డ్ పరువునష్టం దావా వ్యవహారంలో జానీకి కోర్టు అనుకూల తీర్పిచ్చింది. అంబర్ హర్డ్ కు జరిమానా విధించడంతో పాటు.. జానీపై ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది.

హాలీవుడ్ జంటైన జానీ డెప్ – అంబర్ హర్డ్ లు 2015లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2017లో విడాకులు తీసుకున్నారు. కానీ.. కొద్దిరోజుల తర్వాత ఇరువురూ ఒకరిపై ఒకరు జుగుప్సాకరంగా ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకెక్కారు. 2018లో అంబర్ రాసిన సెక్సువల్ వయోలెన్స్ అనే ఆర్టికల్.. జానీ పరువుకి భంగం కలిగించేదిగా ఉందని, దాని ఆధారంగానే అంబర్ జానీ పై వేధింపులకు, పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిందన్న అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. దాని ఆధారంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2019 ఫిబ్రవరిలో కోర్టుకు ఎక్కాడు పైరెట్స్‌ ఆఫ్‌ కరేబియన్ నటుడు‌. బుధవారం వర్జీనియాలోని ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

నటుడు జానీ డెప్‌(58), అతని మాజీ భార్య అంబర్‌ హర్డ్‌(36) ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనని పేర్కొంటూనే.. జానీకి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆరువారాల పాటు జరిగిన విచారణను పరిగణలోకి తీసుకుని.. నటి అంబర్‌ హర్డ్‌ తన మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తెలిపింది. ఈ తీర్పుతో కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జానీ తన పరపతితోనే ఈ కేసులో నెగ్గాడని.. కోర్టు తీర్పుతో తన గుండె బద్దలైందంటూ అంబర్ బోరున విలపించింది. జానీ డెప్ ఈ తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.