iDreamPost
android-app
ios-app

ఎందుకంత ఉలికిపాటు..?

ఎందుకంత ఉలికిపాటు..?

అమరావతి భూ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణను, మంత్రివర్గ ఉపసంఘం చర్యలపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ అంశం రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పేరుతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు.. మాపై కక్ష సాధించాలని చూస్తున్నారు. దమ్ముంటే నిరూపించండి. ఏ విచారణ అయినా చేసుకోండంటూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు.. తాజాగా వారి చేతలకు ఏ మాత్రం పొంతనకుదరడం లేదు. విచారణకు సిద్దమని చెప్పిన బాబు.. తన పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో విచారణను ఆపాలని హైకోర్టులో పిటిషన్లు వేయడం, వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిపోయింది.

అయితే అసలు అమరావతి భూకుంభకోణం పేరు ఎత్తితేనే టీడీపీ నేతలకు ఎందుకు అంత ఉలికిపాటుకు గురవుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. మేము ఏ తప్పూ చేయలేదని చెబుతున్నప్పుడు విచారణ చేస్తే ఏమైందన్న భావనలో వారిలో లేకపోవడం ఆశ్చర్యం, అనుమానాలు కలిగిస్తోంది. నిన్న లోక్‌సభలో అమరావతి భూ కుంభకోణంపై వైసీపీ సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి మాట్లాడుతున్న తరుణంలోనూ టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే… అమరావతి భూ కుంభకోణంపై ఎలాంటి విచారణ జరగకూడదు, ఎవరూ మాట్లాడకూడదనేలా ఉంది.

‘‘అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ప్రాథమిక ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్, ఏసీబీ విచారణ జరుపుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌ దర్యాప్తు చేస్తే… దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుందనే భావన ప్రతిపక్షాల్లో ఉంటుంది. అందుకనే సీబీఐ తో విచారణ చేయించండి. సీబీఐ విచారణకు సమ్మతిని తెలుపుతూ రాష్ట్ర హోం శాఖ కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది…’’ అంటూ మిథున్‌ రెడ్డి మాట్లాడిన సమయంలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌లు అడ్డుకోబోయారు.

సాధారణంగా రాజకీయ నేతలపై ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపణలు చేస్తే.. దమ్ముంటే నిరూపించండి.. రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా.. అనే సవాళ్లు ఆరోపణలు ఎదుర్కొనే వారు చేయడం ఇప్పటి వరకూ చూశాం. కానీ అమరావతి విషయంలో టీడీపీ నేతలపై వస్తున్న ఆరోపణల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఆరోపణలపై సవాళ్లు విసరడం అటుంచితే.. కనీసం వాటిని వినేందుకు కూడా టీడీపీ నేతలు ఇష్టపడడం లేదు.

ఇలాంటి పరిస్థితితో.. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందా..? లేదా..? అనే అంశంపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ నిజా నిజాలు తేల్చాలిన పని విచారణ సంస్థలదే. మరి అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న అభియోగాలపై విచారణ జరుగుతుందా..? లేదా..? చూడాలి. ఒక వేళ జరిగితే ఇప్పుడే ఉలిక్కిపడుతున్న టీడీపీ నేతల పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేం.