iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు మరోసారి స్టే పొడిగింపు

చంద్రబాబుకు మరోసారి స్టే పొడిగింపు

రాజధాని పేరుతో అమరావతిలో భూ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగాలతోపాటు.. అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు మరోసారి పొడిగించింది.

ఈ వ్యవహారంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. దర్యాప్తు జరుగుతున్న తరుణంలో.. సీఐడీ విచారణను నిలిపివేయాలని, తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. చంద్రబాబు, నారాయణలు ఇద్దరూ వేర్వేరుగా ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటీషన్లు దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు.. బాబు, నారాయణలపై నమోదైన కేసుల్లో తదుపరి చర్యలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయం ముగియడంతో మరోసారి మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తాజాగా రెండోసారి స్టేను ఆరువారాలపాటు పొడిగిస్తూ జస్టిస్‌ చీకటి మానవేంద్రరాయ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే.. అక్కడ చంద్రబాబు సన్నిహితులు, బంధువులు, మంత్రి నారాయణ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు 2015లో వెల్లువెత్తాయి. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోలేదు. కొంటే తప్పేంటంటూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ వ్యవహారంపై తాము అధికారంలోకి వస్తే.. విచారణ జరుపుతామని ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

రాజదానికి రైతులు ఇచ్చారంటున్న 33 వేల ఎకరాల్లో.. 7 వేల ఎకరాలు బయట వ్యక్తులు రైతుల వద్ద కొనుగోలు చేసి ఇచ్చారు. సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోనే బయట వ్యక్తులు ఏడు వేల ఎకరాలు కొనుగోలు చేయగా.. సీఆర్‌డీఏ బయట ఇంకా ఎన్ని వేల ఎకరాలు కొనుగోలు చేసి ఉంటారనే చర్చ సాగింది. తన వద్ద ఉన్న ఆధారాలతో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సీఐడీకి ఫిర్యాదు చేయడంతో బాబు, నారాయణల భూ దందాపై దర్యాప్తు మొదలైంది.

ఫిర్యాదుల సమయంలో.. మేము ఏ తప్పు చేయలేదు.. దమ్ముంటే నిరూపించండి.. దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ.. శాసన సభలోనూ, మీడియా సమావేశాల్లోనూ చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత.. చంద్రబాబు, నారాయణలు.. దర్యాప్తును నిలిపివేయాలని, కేసులు కొట్టివేయాలని, తమపై కక్షతోనే ఈ కేసులు పెట్టారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు… సీఐడీ కేసులో స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ముగుస్తున్న సమయంలో.. మరోమారు స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది.