నమ్మకం ఒక న్యాయమూర్తిపైనేనా..? న్యాయవ్యవస్థపైన లేదా..?

మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ కీలక దశలో ఉన్నందున.. ఆ విచారణ పూర్తయి, తుది తీర్పు వచ్చే వరకూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె. మహేశ్వరి బదిలీని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య రాసిన లేఖ ఎన్నో ప్రశ్నలకు, ఆరోపణలకు సమాధానాన్ని ఇస్తోంది. ఇదే సమయంలో సరికొత్త ప్రశ్నలకు, సందేహాలకు ఆస్కారం కలిగిస్తోంది.

ఇటీవల దేశ వ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టుల్లో బదిలీలు జరిగాయి. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారల్లో భాగంగా ఇవి చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా 9 హైకోర్టులకు నూతన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇందులో నలుగురు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ కాగా, మరో ఐదుగురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి ద్వారా వెళ్లారు. బదిలీ అయిన వారిలో తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె. మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ మొత్తం ప్రక్రియను సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం నిర్వహించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

అయితే తమ పిటిషన్లపై విచారణ పూర్తయి, తుది తీర్పు వెలువడే వరకూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జె.కె.మహేశ్వరినే కొనసాగించాలని రాజధాని సమీకరణ రైతు సమాఖ్య కోరడం న్యాయ కోవిదులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకూ ఇలాంటి ప్రతిపాదన, విజ్ఞప్తి ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. రైతు సమాఖ్య రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాసిన లేఖతో న్యాయ వ్యవస్థపై రాజధాని రైతు సమాఖ్యకు ఉన్న నమ్మకం ఎలాంటిదో తేటతెల్లం చేస్తోంది. అదే సమయంలో ఇప్పటి వరకూ ఏపీ హైకోర్టుపై జరుగుతున్న ప్రచారం, ఆరోపణలకు బలం చేకూరుతోంది.

Read Also : వైసీపీ ఎమ్మెల్యేలకు భలే ఛాన్స్‌..!

9 మంది ప్రధాన న్యాయమూర్తులు ఆయా హైకోర్టుల్లో కొత్తగా ఆశీనులయ్యారు. జస్టిస్‌ జె.కె. మహేశ్వరినే ఏపీలో కొనసాగించాలంటున్న వారికి ఆయనపై మాత్రమే నమ్మకం ఉందా..? ఇతర న్యాయమూర్తులపై నమ్మకం లేదా..? అనే ప్రశ్నలు కొత్తగా ఉద్భవిస్తున్నాయి. విచారణ పూర్తయి, తీర్పు ఇచ్చే వరకూ జస్టిస్‌ జె.కె.మహేశ్వరినే ఉండాలంటున్న రాజధాని సమీకరణ రైతు సమాఖ్యకు కొత్తగా వచ్చిన ప్రధాన న్యాయమూర్తిపై నమ్మకం లేదా..? జస్టిస్‌ జె.కె మహేశ్వరిలేని ఏపీ హైకోర్టు, న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తులను ప్రభావితం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు, ఆదేశాలు వచ్చేలా చేస్తున్నారని, అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో ఎన్‌వీ రమణ పాత్ర ఉందంటూ.. సీఎం వైఎస్‌ జగన్‌ సుప్రిం చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి రాజధాని ఉద్యమ నేతలు, పలువురు న్యాయకోవిదులు తప్పుబట్టారు. కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేసి వైఎస్‌ జగన్‌ను మఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్‌ చేశారు. అయితే నేడు జగన్‌ లేఖను బలపరిచేలా.. జస్టిస్‌ జె.కె. మహేశ్వరినే ఏపీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా కొనసాగించాలని లేఖ రాయడం గమనార్హం.

ఏపీ హైకోర్టు తీర్పులపై అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తే.. కోర్టులపై నమ్ముకం లేదా..? అనే ప్రశ్నలు టీడీపీ నేతలు, రాజధాని ఉద్యమకారుల నుంచి వినిపించాయి. ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కోర్టు ఏమైనా వ్యాఖ్యలు చేసినా.. మొట్టికాయలంటూ పత్రికల్లో వార్తలు వచ్చినా.. వెంటనే బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించారు. ఇప్పుడు ఇదే ప్రశ్నకు వారు ఎదుర్కొనాల్సి వస్తోంది. వారి వాజ్యాలతోపాటు ఇతర వ్యాజ్యాలను కొత్తగా వచ్చే ప్రధాన న్యాయమూర్తి విచారిస్తారు. న్యాయమూర్తి ఎవరైనా ఇరువైపు వాదనలు విని తీర్పు ఇస్తారు. న్యాయం మాత్రం మారదు. అయితే అమరావతి సమీకరణ రైతు సమాఖ్య రైతులు మాత్రం జస్టిస్‌ జె.కె మహేశ్వరి బదిలీ ఆపాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాయడం వల్ల న్యాయస్థానాలను ప్రభావితం చేయొచ్చనే భావనను రేకెత్తించడం గమనార్హం.

Read Also : రూపు మార్చుకున్న ఫ్యాక్షన్‌.. కర్నూలు జిల్లాలో దంపతులు ఆత్మహత్య..

Show comments