Idream media
Idream media
చిన్నప్పుడు మూడో తరగతిలో అల్లూరి సీతారామరాజు పాఠం ఉండేది. ఆయన బొమ్మని చూస్తే పిల్లలకి ఏదో ఆరాధన. తర్వాత ఎన్టీఆర్. ఆ సినిమా తీస్తున్నాడని చెప్పుకునేవాళ్లు. కానీ కృష్ణ తీయడం విచిత్రం. 1974లో నేను సెవెన్త్ క్లాస్. ఆంధ్రప్రభలో సీతారామరాజు సినిమా యాడ్స్ చూసి ఒకటే ఉత్సాహం.
రాయదుర్గానికి ఆ సినిమా రావాలంటే కనీసం ఆరు నెలలు ఎదురు చూడాలి. కొంత మంది డబ్బున్న వాళ్ల పిల్లలు బళ్లారిలో చూసి వచ్చారు. కానీ మనకి అంత సీన్ లేదు. మల్లికార్జున అనేవాడు కనీసం నెలరోజుల పాటు సినిమా కథని చెప్పిందే చెప్పేవాడు. దానికి తోడు ఒక పాటల పుస్తకం, పాంప్లేట్ కూడా తెచ్చి చూపించాడు. అసూయ, ఉక్రోశం. వాడు చెప్పే కథను వినకుండా దూరంగా వెళ్లేవాన్ని. వాడు నాకు చాక్లెట్, బిస్కెట్ లంచంగా ఇచ్చి మరీ కథ చెప్పేవాడు. రేడియోలో పాటలు విని మనకి సినిమా యోగం ఎప్పుడో కదా అనుకునేవాన్ని.
తర్వాత కొద్ది రోజులకి మా నాన్న ధర్మవరం తీసుకెళ్లాడు. రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్లి బస్సు దిగాం. బస్టాండ్‌లో నాలుగైదు కటౌట్లు. సీతారామరాజుగా కృష్ణ, రూథర్‌ఫర్డ్‌గా జగ్గయ్య, గంటం దొరగా గుమ్మడి. హీరోకి కాకుండా మిగతా యాక్టర్లకి కూడా ప్రత్యేకంగా కటౌట్లు పెట్టడం అదే మొదలనుకుంటా. అనంతపురం నుంచి ధర్మవరానికి ఇంకో బస్సు ఎక్కాలి.
అల్లూరి సీతారామరాజు సినిమాకి పోదాం నాన్న అని అడిగాను. పళ్లు రాలుతాయ్ అన్నాడు. నోర్మూసుకున్నాను. నా అలుగుడు చూసి నన్ను కూల్ చేయడానికి “పాముగా మారిన ఆడది” అని మైక్‌లో ఎవరో అరుస్తూ ఉంటే చెరో పావలా ఇచ్చి ఆ టెంట్‌లోకి తీసుకెళ్లాడు. ఒకావిడ శరీరం మొత్తాన్ని వేపాకులతో కప్పేసుకుని ఒక గుంతలో కూచుని తల బయటికి పెట్టింది. ఒక కొండ చిలువ ఆమె పక్కన కదులుతోంది. చూడ్డానికి ఆమె శరీరం కొండ చిలువలాగా ఉందనిపిస్తుంది. అంత చిన్నప్పుడే అది ట్రిక్ అని నాకర్థమైంది. మా నాన్న మాత్రం ఆవిడ నిజంగా నాగకన్యేనని నమ్మాడు. ఆ అమాయకత్వం వల్లే ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆయన 73 ఏళ్లు బతికాడు. తెలివి ఎక్కువై నాకు 35 ఏళ్లకే షుగర్ వచ్చింది.
సినిమా నాకు దక్కలేదు. నాలుగు నెలలు గడిచిన తర్వాత మా ఊళ్లో అజిజియా అనే టాకీస్‌లో వేశారు. సినిమా స్కోప్ కాబట్టి స్క్రీన్‌ని పెంచారు. అదో డకోటా థియేటర్. నల్లుల ఫ్యాక్టరీ. ఆ థియేటర్ బాల్కనీలో దెయ్యం ఉందని ఒక పుకారు. అజిజియా మేడ మీద అందగత్తెను రా అని ప్రేక్షకుల ముందు డ్యాన్స్ చేసేదట. దీన్ని గాఢంగా నమ్మడం వల్ల నేను ఒక్క సినిమా కూడా బాల్కనీలో చూడలేదు. ఇప్పుడు చూద్దామన్నా అది లేదు. కూల్చేశారు.
గర్ల్స్ స్కూల్ గోడకి పెద్ద పోస్టర్ చూసి ఒళ్లు పులకించి పోయింది. మార్నింగ్ షో వెళ్దామంటే స్కూల్. భూమి బద్దలైపోయినా సరే మ్యాట్నీకి వెళ్లాలనుకున్నా. బ్యాగ్ భుజానికి వేసుకుని స్కూల్‌కి వెళ్లా. ఫస్ట్ పీరియడ్ వరకూ ఉగ్గ పట్టుకుని కూచుని , సంచి ఫ్రెండ్‌కు అప్పగించి థియేటర్‌కి పరుగు తీశా. కనీసం కిలో మీటర్ దూరం. చెమట్లు కక్కుతూ థియేటర్‌లోకి వెళితే సినిమా స్కోప్ స్క్రీన్ చూసి కళ్లు తిరిగాయి. అప్పటికే పిక్చర్ స్టార్ట్ అయింది. విజయనిర్మల వస్తాడు నారాజు అంటోంది. కృష్ణ కనపడగానే విజిల్ వేసా. సౌండ్ వచ్చింది కానీ, విజిల్ రాలేదు. సాయంత్రం ఇంట్లో ఏర్పడే ఉత్పాతాలు, ఉపద్రవాలు గుర్తు లేవు. స్నేహితుల వల్ల సౌలభ్యం ఏమంటే మనకు మొదట హాని చేసేది వాళ్లే. నా మిత్రుడు సంచితో పాటు నా రహస్యాన్ని కూడా ఇంట్లో అప్పగించాడు. ఇంట్లో పూజ చేశారు. చెడిపోతావురా అన్నాడు మానాన్న. సీతారామరాజు సినిమా చూసిన తర్వాత చెడిపోయినా తప్పు లేదు. అయినా నేను దేశం కోసం విప్లవంలో చేరాలని సినిమా చూస్తూ ఉండగానే అనుకున్నా. స్వాతంత్ర్యం లేదు కాబట్టి బ్రిటీష్ వాళ్లతో పోరాడాడు కృష్ణ. మరి నేను ఎవరితో పోరాడాలి? బ‌్రిటీషోళ్ల కంటే ఇంట్లో వాళ్లు ప్రమాదకారులు. వాళ్లతో తెచ్చుకున్నంత ఈజీ కాదు వీళ్లతో స్వాతంత్ర్యం తెచ్చుకోవడం.
మరుసటి రోజు మళ్లీ వెళ్లా. ఈసారి కూడా విజయనిర్మలే వస్తాడు నారాజు అని స్టార్ట్ అయింది. అసలు ఈ సినిమాని మొదటి నుంచి చూసే అదృష్టమే లేదా? నాలుగైదు సార్లు ఇలాగే చూసి చివరికి ఒక రోజు టైటిల్స్ దగ్గరి నుంచి చూశాను. అల్లూరి సీతారామరాజు వచ్చి 46 ఏళ్లైంది. ఇపుడు చూసినా అద్భుతంగా ఉంటుంది.
కృష్ణ కూడా తన జీవిత కాలంలో అలాంటి అద్భుతాన్ని తీయలేకపోయాడు.
కురుక్షేత్రంతో మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుని తానే గాయపడ్డాడు.