iDreamPost
android-app
ios-app

అల్లూరి రిపోర్ట్

  • Published Sep 24, 2022 | 11:43 AM Updated Updated Sep 24, 2022 | 11:43 AM
అల్లూరి రిపోర్ట్

నిన్న విడుదలైన మూడు చిన్న సినిమాల్లో శ్రీవిష్ణు అల్లూరి ఒకటి. ఏవో ఆర్థిక లావాదేవీల వల్ల ఉదయం ఆటలు క్యాన్సిల్ అయినప్పటికీ మధ్యాహ్నం పన్నెండు తర్వాత షోలు మొదలుపెట్టారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఆటలు స్టార్టయ్యాయి. కెరీర్ లోనే మొదటిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ వేషం వేయడం, పెద్ద బడ్జెట్ తో తీయడం లాంటి కారణాల వల్ల శ్రీవిష్ణు దీన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకున్నాడు. మాములుగా బయట వాళ్ళ ఫంక్షన్లకు వచ్చేందుకు అంత సుముఖత చూపని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా తీసుకొచ్చి బజ్ పెంచే ప్రయత్నం చేశాడు. ఓపెనింగ్స్ వీక్ గానే ఉన్నాయి కానీ అతని కష్టానికి తగ్గ ఫలితం దక్కిందో లేదో చూద్దాం.

ఇది కొత్త కథేం కాదు. చాలాసార్లు చూసిందే. ఎందరో దర్శకులు వాడిందే. అనగనగా ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. అతనికో చక్కని కుటుంబం. ఎలాంటి అన్యాయం జరిగినా, దానికి ఎంత పెద్దవాళ్ళు బాధ్యులైనా విడిచిపెట్టని మనస్తత్వం అతనిది. ఈ కారణంగా ఇరవైకి పైగా ఊళ్ళకు ట్రాన్స్ ఫర్ అవ్వాల్సి వచ్చినా తన ధోరణి మార్చుకోడు. ఆఖరికి నక్సలైట్లు, టెర్రరిస్టులను సైతం దుమ్ము దులిపేసే క్లాసు మాసు కలగలిసిన ఖాకీ అధికారి. ఇలాంటి అల్లూరి సీతారామరాజు బయోపిక్ లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ప్రత్యర్థులను ఎలా ఎదురుకున్నాడనేదే ఫైనల్ స్టోరీ. గతంలో చూసినట్టు అనిపించే ఎన్నో ఎపిసోడ్లను కలగలిపి మూడు గంటల ప్యాకేజీగా మార్చారు

శ్రీవిష్ణు తనవంతుగా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. ఈ మూవీలో గొప్పగా చెప్పుకునే పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే. కానీ దర్శకుడు ప్రదీప్ వర్మ ఈ కాప్ డ్రామాని డిటైల్డ్ గా చెప్పాలన్న ఉద్దేశంతో చేసిన సాగతీత అసహనానికి గురి చేస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగా వచ్చినప్పటికీ మిగిలిన బలహీనతలు వాటిని కూడా కప్పేశాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ల్యాగ్ అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. హీరోయిన్ కయ్యదు లోహర్ సెలక్షన్ తో పాటు మిగిలిన క్యాస్టింగ్ ని బాగానే సెట్ చేసుకున్నప్పటికీ అసలైన కథా కథనాల విషయంలో సరైన కసరత్తు చేయలేకపోయాడు. రొటీన్ స్టఫ్ ని ఇష్టపడే వాళ్ళకే కొంచెం కష్టమనిపించే అల్లూరిని కేవలం శ్రీవిష్ణు కోసమే చూస్తామంటే ఓకే కానీ అంతకు మించి ఇంకే రీజన్ లేదు