iDreamPost
android-app
ios-app

మేడారం జాత‌ర‌ చూసొద్దామా…

మేడారం జాత‌ర‌ చూసొద్దామా…

అక్క‌డ ఆల‌యం ఉండ‌దు. విగ్ర‌హాలూ ఉండ‌వు.. కానీ ద‌ర్శ‌నానికి తండోప‌తండాలుగా జ‌నం త‌ర‌లివ‌స్తారు. తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి దారులన్నీ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కుగ్రామమైన మేడారం వైపే క‌దులుతాయి. మాఘ మాసంలో పౌర్ణమి వ‌స్తోందంటే.. మ‌హా జాత‌ర ఏర్పాట్ల‌లో తెలంగాణ స‌ర్కారు, అధికార యంత్రాంగం నిమ‌గ్న‌మ‌వుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం గుర్తింపు పొందింది. రేప‌టి నుంచి ఈ నెల 19 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు సాగే మ‌హా జాత‌ర విశిష్ఠ‌త ఏంటంటే..

రెండేళ్ల‌కోసారి..

ప్రతీ రెండేళ్లకోసారి మేడారం జాతరను మాఘ మాసంలో పౌర్ణమి సమయాన జరుపుతారు. ఈ మహాజాతర గిరిజన సంస్కృతీ సంప్రదాయల మధ్య జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజులు ప్రధాన దేవతలు. ఈ ఆదివాసీ దేవతలకు వేర్వేరు ప్రదేశాల్లో గుడులున్నాయి. జాతర సందర్భంగా వీరంతా మేడారానికి చేరుకుంటారు. సమ్మక్క ప్రధాన ఆలయం మేడారంలోనే ఉంది. 1946కు పూర్వం సమ్మక్క ప్రధానాలయం ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో ఉండేది. ప్రతి రెండేళ్లకోసారి అక్కడ జాతర జరిగేది. కరువు కారణంగా జాతర నిర్వహించలేని పరిస్థితి ఎదురైతే జాతరను మేడారానికి తరలించారు. ఇక్కడే సమ్మక్కకు ఆలయం నిర్మించారు. బయ్యక్కపేటకు చెందిన చందా వంశీయులు సమ్మక్కను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు.

మేడారానికి సార‌ల‌మ్మ‌..

ప్రస్తుతం సిద్ధబోయిన, కొక్కెర వంశాలకు చెందిన వారు సమ్మక్క ప్రధాన పూజారులుగా కొనసాగుతున్నారు. సమ్మక్కకు సంబంధించిన ప్రధాన పూజలన్నీ ఆదివాసీ పద్ధతిలో సిద్ధబోయిన మునీందర్‌ నిర్వహిస్తారు. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకొచ్చే కీలకమైన బాధ్యతను సమ్మక్క వడ్డెగా ఉన్న కొక్కెర కృష్ణయ్య నిర్వర్తిస్తారు. సారలమ్మ ప్రధాన ఆలయం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం కన్నెపల్లిలో ఉంది. మేడారం-కన్నెపల్లి మధ్య మూడున్నర కిలోమీటర్ల దూరం. కాకాసారయ్య సారలమ్మ ప్రధాన పూజారి. జాతర సందర్భంగా తొలిరోజు జరిగే వేడుకల్లో సారలమ్మ మేడారం ప్రయాణం ముఖ్యమైనది. హనుమంతుడి జెండా తోడుగా రాగా సారలమ్మ మేడారం బయల్దేరుతుంది. మార్గమధ్యంలో జంపన్నవాగు మీదుగా కాలినడకన నడుస్తూ సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు.

అట‌వీ మార్గంలో..

సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజు ఆలయం మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉంది. పెనక బుచ్చిరాములు పగిడిద్దరాజు ప్రధాన పూజారి. పగిడిద్దరాజు తమ్ముడైన గోవిందరాజులు ఆలయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో ఉంది. గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్‌. మేడారం- కొండాయి మధ్య 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా అటవీ మార్గం. జాతర జరిగే మొదటి రోజు ఉదయం నుంచి కొండాయిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం పడిగే రూపంలోని గోవిందరాజులను తీసుకుని మేడారం బయల్దేరుతారు.

మ‌హాజాత‌ర ప్రారంభం ఆరోజే.,

జాతరలో నాలుగు రోజులే కీలకమైనవి. ప్రస్తుత జాతర ఫిబ్రవరి 16వ తేదీన బుధవారం ప్రారంభం అవుతుంది. మొదటి రోజు బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. అదే రోజు రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఇక రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. మూడో రోజు శుక్రవారం గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. చివరి నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులకు మొక్కులు అనంతరం సాయంత్రం 6గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.

సమ్మక్క, పగిడిద్దరాజుల వివాహం..

జాతర సందర్భంగా సమ్మక్క, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. ఈ వేడుకలకు పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. జాతరకు ఒక రోజు ముందు వరుడు పగిడిద్దరాజును ఆయన స్వస్థలమైన పూనుగొండ్లలో పెళ్లికొడుకుగా తయారుచేసి వేడుకను నిర్వహిస్తారు. మరుసటిరోజు ఉదయం పగిడిద్దరాజు ప్రధాన వడ్డె లక్ష్మయ్య ఇంట్లో పసుపు, కుంకుమలు సిద్ధం చేస్తారు. పూనుగొండ్ల ఆలయంలో ఉన్న పగిడిద్దరాజు పడిగెను సిద్దం చేస్తారు. మధ్యాహ్నం కల్లా వడ్డె ఇంటి నుంచి పసుపు, కుంకుమ, కొత్త బట్టలతో ఆలయానికి చేరుకుంటారు. అక్కడ యాటను బలిస్తారు. ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొత్తబట్టలు తొడిగి పడిగె రూపంలో వివాహానికి సిద్ధమైన పగిడిద్దరాజును కాలినడకన మేడారానికి తోడ్కొని వెళ్తారు. రాత్రి సమయానికి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని అక్కడ పెనక వంశీయుల ఇంటిలో బస చేస్తారు.

కాలిన‌డ‌క‌నే..

మరుసటి రోజు ఉదయం తిరిగి కాలినడకన మేడారానికి బయలుదేరి సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. తాము వచ్చినట్లు సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. మరుసటిరోజు ఉదయం మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెళ్లి కొడుకు వచ్చాడనే కబురు అందగానే సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెల్లి ఆహ్వానం పలుకుతారు. సంపద్రాయ ఆదివాసీ వాయిద్యాలను మోగిస్తూ సమ్మక్క ఆలయానికి పగిడిద్దరాజును తీసుకువస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. ఆ తర్వాత వడ్డెరాల కుండల రూపంలో సమ్మక్క పడిగె రూపంలో పగిడిద్దరాజులను ఎదురెదురుగా ఉంచుతారు. ఇరువైపుల పూజారులు మాటా ముచ్చట మాట్లాడుకుని వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో కళ్యాణం పూర్తవుతుంది.

జాతర వెనుక…

సమ్మక్క, సారలమ్మల చరిత్రపై అనేక మంది పరిశోధనలు చేశారు. ఒక్కొక్కరి పరిశోధనల్లో ఒక్కోరకమైన వివరాలు ఉన్నాయి. సమ్మక్క, సారలమ్మలకు సంబందించిన వివరాల్లో ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం వర్ధిల్లిన కాలంలో గోదావరి తీరాన ఉన్న దట్టమైన అటవి ప్రాంతాన్ని పగిడిద్దరాజు, సమ్మక్కలు సామంతరాజులుగా ఉన్నారు. వీరికి సారలమ్మ, జంపయ్య, గంటయ్య, మూగయ్యలు సంతానంగా పేర్కొన్నారు. కరువు కాటకాల వల్ల కాకతీయులకు కప్పం కట్టలేని పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఈ రాజ్యంపై ప్రతాపరుద్రుడి కాలంలో మంత్రి యుగేంద్రుని ఆదేశాల మేరకు యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపయ్యలు వీరమరణం పొందారు. సారలమ్మ, పగిడిద్దరాజులు యుద్ధ క్షేత్రంలో నేలకొరగగా, సమీపంలో ఉన్న సంపెంగ వాగులో జంపయ్య గాయపడగా, సమ్మక్క చిలుకల గట్టుపైకి నెమలినార చెట్టు దగ్గర వీరమరణం పొందినట్లు చెబుతారు.

సుమారు కోటిన్న‌ర‌కు పైగా…

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సుమారు కోటిన్నర మంది భక్తులు మేడారం జాతరకు వస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది. మేడారంలోని జంపన్నవాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి ఏటు ఐదారు కిలో మీటర్ల వరకు భక్తులతో జంపన్నవాగు జనసముద్రం అవుతుంది. మేడారం, నార్లాపూర్‌, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, రెడ్డిగూడెం ప్రాంతాలన్ని కూడా జంపన్నవాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కడతారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున నదిల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో తెలంగాణ కుంభమేళాగా పిలుస్తున్నారు. ఒక గిరిజన జాతరకు కోట్లాది మంది భక్తులు రావటం కూడా ప్రపంచంలోనే అరుదైన జాతరగా గుర్తింపు పొందుతోంది. గిరిజన కుంభమేళా భళా అంటూ మేడారం జాతరపై ప్రశంసలు కురుస్తున్నాయి. 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.