iDreamPost
iDreamPost
థియేటర్లు తెరుచుకోవడం మీద అసందిగ్దత కొనసాగుతున్న తరుణంలో తమ సినిమాలను అప్పటిదాకా నిలబెట్టుకోవాలా లేదా పెట్టుబడులు సేఫ్ కావడం కోసం ఓటిటికి ఇవ్వాలా అనే అయోమయంలో చాలా నిర్మాతలు ఉన్న మాట వాస్తవం. దిల్ రాజు అంతటి అగ్ర నిర్మాతే ‘వి’ని డిజిటల్ రిలీజ్ చేశాక మిగిలినవాళ్లు అదే దారి పట్టేందుకు అటుఇటు ఆలోచిస్తున్నారు. కొందరు ఖరాఖండిగా ఎంత ఆలస్యమైనా వేచి చూస్తామనే ధోరణిలో ఉండగా మరికొందరు మాత్రం స్ట్రీమింగ్ సంస్థల నుంచి వస్తున్న ఆఫర్స్ కు చలించకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు నితిన్ రంగ్ దే కూడా ఈ దిశగానే వెళ్తున్నట్టు ఫిలిం నగర్లో హాట్ టాపిక్.
సుమారు 35 నుంచి 40 కోట్ల మధ్యలో అమెజాన్ ప్రైమ్, జీ5 రెండు పోటీ పడి మరీ ధరను కోట్ చేస్తున్నాయని సితార సంస్థ ఈ విషయాన్నీ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టు వినికిడి. కొన్ని సినీ పరిశీలకుల ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఏకంగా ఫైనల్ అయ్యిందని ట్వీట్ చేయడం గమనార్హం. అయితే రంగ్ దే టీమ్ నుంచి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు. నిజానికి రంగ్ దేని ఈ ఏడాది చివర్లో కానీ లేదా సంక్రాంతికి విడుదల చేసిన పైన చెప్పినంత భారీ షేర్ కలెక్షన్ రూపంలో వస్తుందన్న గ్యారెంటీ లేదు. పైగా కొంతకాలం పాటు సగం కెపాసిటీతోనే హాళ్లు నడపాల్సి రావొచ్చు. ప్రభుత్వం అలా అయితేనే అనుమతులు ఇస్తుంది. అదే కనక జరిగితే నితిన్ మార్కెట్ కు అంత మొత్తాన్ని రాబట్టడం కష్టం.
అందులోనూ పబ్లిక్ ముందు లాగా థియేటర్లకు వస్తారా రారా అనే డౌట్లు అందరికీ ఉన్నాయి. అందుకే ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటే ఓటిటికి ఓటు వేయొచ్చు. భీష్మ తర్వాత చేస్తున్న నితిన్ సినిమా, కీర్తి సురేష్ హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వెంకీ అట్లూరి డైరెక్షన్ ఇవన్నీ రంగ్ దే మీద భారీ అంచనాలు పెంచేశాయి. దానికి తోడు టీజర్ కూడా కలర్ ఫుల్ గా కనిపించడంతో హైప్ రెట్టింపయ్యింది. మరి రంగ్ దే కూడా వి, ఒరేయ్ బుజ్జిగా తరహాలో చిన్ని తెరలకే సిద్ధమంటుందా లేక వెయిట్ చేస్తామని తేల్చి చెబుతుందా వేచి చూడాలి. ఏ నిర్ణయమైనా ఫైనల్ గా నిర్మాత పరిధిలో ఉంటుంది. డెసిషన్ మేకర్ తనే అవుతాడు. మరి రంగ్ దే విషయంలో ఏం జరగబోతోందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం ఏం జరుగుతుందా అనే ఆసక్తితో ఉన్నారు.