Gold Price on Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రాధాన్యత.. ఇవాళ బంగారం రేటెంతో తెలుసా?

Gold Price on Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రాధాన్యత.. ఇవాళ బంగారం రేటెంతో తెలుసా?

 

అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని అంతా అంటుంటారు. అసలు అక్షయతృతీయ ఎలా ఏర్పడిందో తెలుసా? ఆ రోజు ఏం చేస్తారో తెలుసా?.. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని అక్షయతృతీయగా చేసుకుంటారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడం వల్ల ఈ తిథికి అంతటి విశిష్టత ఏర్పడింది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు శివుణ్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఈ రోజే ఇచ్చినట్టు శివపురాణం చెబుతోంది. మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజున అక్షయపాత్ర దక్కడం, గంగానది శివుడి జటాజూటం నుంచి భూమి పైకి వచ్చింది కూడా అక్షయతృతీయ రోజే కావడం, శ్రీ మహావిష్ణువు పరుశురాముడిగా ఈ రోజే అవతరించడం లాంటి విశిష్టతలు ఉన్నందువల్ల అక్షయతృతీయను ఘనంగా జరుపుకొంటారు.

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి వినే ఉంటాం. ఈ పాత్ర ఉన్న వాళ్ళ ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవి అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు బంగారం కొంటే ఏడాదంతా తమ వద్ద సంపద ఉంటుంది అని భక్తులు భావిస్తారు. అందుకే భారతదేశంలో అక్షయతృతీయ నాడు బంగారం భారీగా అమ్ముడవుతుంది.

 

అక్షయ తృతీయ మే 3న మంగళవారం రావడంతో ఉదయం నుంచే కొనుగోలుదారులు బంగారపు షాపులవద్ద బారులు తీరారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం రేటు, అమ్మకాల గురించి ‘అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి’ వైస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ మెహ్రా మాట్లాడుతూ.. గత 10-15 రోజులుగా బంగారంలో పెట్టుబడులు పెరిగాయి. అది ఇవాళ కూడా కొనసాగుతోంది. మా అంచనా ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున దాదాపు 25-30 టన్నుల బంగారం అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక బంగారం రేట్ల గురించి మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.55,000-58,000కు చేరినా ఇప్పుడు కాస్త తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,510గా ఉంది. రానున్న రోజుల్లో ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

 

ఇవాళ సెలవురోజు కావడం, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ఈసారి బంగారం అమ్మకాలు బాగున్నాయని, గత రెండేళ్లుగా లాక్‌డౌన్‌ల ప్రభావంతో అమ్మకాలు తగ్గినా, ఈసారి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని బంగారపు షాపుల యజమానులు తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం లాంటి పలు ప్రముఖ నగరాల్లో అక్షయతృతీయ రోజున 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.51,510గా ఉంది. ఇక 10 గ్రాముల వెండి ధర రూ.676గా ఉంది.

 

Show comments