iDreamPost
iDreamPost
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో అధికారం కోసం పొత్తులు పెట్టుకున్న మహా కూటమిని ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ ఓటర్లు అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అధికార వైఎస్సార్‌సీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు వార్డులు పంచుకోవడంతో ఇక్కడ పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. కాని ఓటర్లు మాత్రం అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు.
20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచి స్పష్టమైన మెజార్టీ సాధించింది. టీడీపీ నాలుగు చోట్ల, జనసేన మూడు చోట్ల గెలవగా, ఒక చోట ఇతర పార్టీ గెలిచింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ 13 వార్డుల్లో మాత్రమే పోటీ చేసింది. జనసేన 5, సీపీఎం 2, బీజేపీ మద్దతుతో ఒకరు చొప్పున పోటీ పడ్డారు. 14 వార్డులో మాత్రమే టీడీపీ, సీపీఎం అభ్యర్థులు ఉన్నారు.
ఇలా వార్డులు పంచుకున్నా, పార్టీల నాయకులు వీధివీధికీ జెండాలు మార్చి ప్రచారం చేసినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన ఫలితం దక్కలేదు. టీడీపీ ఒంటిరిగా పోటీ చేసి గెలవడం అసాధ్యమని గుర్తించిన ఎమ్మెల్యే మహా కూటమి ఏర్పాటు చేసినా గెలుపు సాధించలేకపోయారు. అయితే మహాకూటమిగా ఏర్పడడం వల్లే ప్రతిపక్షాలకు ఈ మాత్రమైనా సీట్లు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.