iDreamPost
iDreamPost
ఇప్పుడు థియేటర్లలోనే కాక హీరోల పోటీ ఓటిటి మధ్య కూడా ఉంటోంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ చేసేటప్పుడు దాని టైమింగ్ చాలా కీలకం. గుంపులో గోవిందా లాగా వదిలామంటే వ్యూస్ కు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఓటిటి సంస్థలు డేట్ ఫిక్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. నిన్న పుష్ప రావడంతో సోషల్ మీడియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటోంది. క్రికెటర్లు, పుష్పని మిస్ అయిన సెలెబ్రిటీలు ప్రైమ్ లో చూసి మరీ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఒకపక్క హాళ్లలో మంచి కలెక్షన్స్ తో ఆడుతుండగానే ఇలా డిజిటల్ లో రావడం కరెక్ట్ కాకపోయినా ముందస్తు ఒప్పందాలు కాబట్టి ఎవరూ ఏమి అనలేని పరిస్థితి.
ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల ఓటిటి ప్రీమియర్స్ లో మంచి ఆసక్తికరమైన పోటీ నెలకొంది. బాలయ్య అఖండ, నాని శ్యామ్ సింగ రాయ్ ఒకే రోజు జనవరి 21న హోమ్ థియేటర్స్ కు రాబోతున్నాయి. మొదటిది డిస్నీ హాట్ స్టార్ కాగా రెండోది నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది. టైమింగ్స్ చెప్పలేదు కానీ ఒకే సమయంలో ఉండకపోవచ్చు. ఒకటి అర్ధరాత్రి మరొకటి అదే రోజు మధ్యాన్నం నుంచి స్ట్రీమింగ్ కావొచ్చు. అయినా ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉన్నప్పుడు పోటీ ఏముందనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి సమాధానం ఉంది. నిర్మాతలకు థియేటర్లలో ఓపెనింగ్స్ ఎంత కీలకమో మనకు తెలిసిందే. ఇప్పుడు ట్రెండ్ అంతా వీటి చుట్టే తిరుగుతోంది
అదే తరహాలో ఎదైనా సినిమా ఓటిటిలో వచ్చినప్పుడు దానికి ఫస్ట్ డే వ్యూస్ చాలా కీలకం. పైరసీ రాజ్యమేలుతున్న రోజుల్లో హెచ్డి క్వాలిటీతో ప్రింట్లు క్షణాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని తట్టుకుంటూ మరీ సబ్స్క్రైబర్స్ ని ఆకట్టుకోవడం చిన్న విషయం కాదు. అందుకే మార్కెటింగ్ చేసే విషయంలో ఇవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. ఉదాహరణకు 21న అఖండ చూద్దామా శ్యామ్ సింగ రాయ్ కు ఓటేద్దామా అనే సందిగ్ధం వ్యూస్ ని ప్రభావితం చేస్తుంది. కొత్త చందాదారులు ఆకట్టుకునేందుకు వీటిని ఎంతగా పబ్లిసిటీ చేస్తామన్నది కీలకం. మొత్తానికి బాలయ్య నానికి ఆసక్తికరమైన డిజిటల్ పోటీని చూసేందుకు రెడీ కావాలన్న మాట
Also Read : KGF Chapter 2 : పాన్ ఇండియాల కన్ను ఏప్రిల్ మీదే కానీ