Idream media
Idream media
చిన్నప్పుడు రేడియో అంటే చాలా ఇష్టం. ఎంత అంటే దాన్ని పగలగొట్టి, దాని లోపల పాడుతున్న వాళ్లని చూడాలనిపించేంత. మా ఇంట్లో ఒక కరెంట్ రేడియో ఉండేది. దీర్ఘచతురస్రాకారంలో , చిన్నిచిన్న చక్రాలాంటి వాటిని ముఖానికి తగిలించుకుని గంభీరంగా ఉండేది. ఆన్ చేస్తే గురగుర గుర్రో అని అరిచి మాట్లాడ్డం స్టార్ట్ చేసేది. రేడియోలో వెలిగే ఎర్ర లైట్ , తిరిగే ఎర్రముల్లు చూడ్డం సరదా. అదో మంత్రాల పెట్టెలా ఉండేది.
ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు సమయం…అన్నప్పుడు చాలా మంది వాచీలోని ముల్లు సర్దుకునేవాళ్లు. రేడియో టైం అంటే అదో పర్‌ఫెక్ట్ అని అందరి అభిప్రాయం. హైదరాబాద్, విజయవాడ స్టేషన్లు వచ్చినా , మాకు కడపతోనే అనుబంధం. పైగా కడప కాకుండా ఇంకే స్టేషన్ పెట్టినా కుయ్యోమని సౌండ్ పది నిమిషాలు వచ్చిన తర్వాతే వినపడేది.
ఇక రేడియో సిలోన్ చాలా ఇష్టం. మధ్యాహ్నం పూట తెలుగు ప్రోగ్రామ్స్ వచ్చేవి. అరగంట పాటలు, అరగంట క్రైస్తవ కార్యక్రమాలు వచ్చేవి. మీ మీనాక్షి పొన్నుదురై అనే ఆవిడ గొంతు మధురంగా ఉండేది. ఆ రోజుల్లో రేడియోలకి లైసెన్స్ ఫీజు కూడా ఉండేది. పోస్టాఫీసుల్లో జమ చేసేవాళ్లు.
వార్తలను చదువుతున్నది అద్దంకి మన్నార్ …ఈ గొంతు బాగా పరిచయం. కార్మికుల కార్యక్రమం అని వచ్చేది. అర్థం కాకపోయినా వినేవాళ్లం. ఎందుకంటే దీని తర్వాత సినిమా పాటలు వస్తాయి కాబట్టి.
కరెంట్ రేడియో మూలపడిన తర్వాత బుష్ ట్రాన్సిస్టర్ వచ్చింది. ఈ కరెంట్ రేడియోని మోసుకెళ్లి ఒక మెకానిక్‌కి ఇచ్చాం. గది నిండా అనేక రకాల ముసలి రేడియోలతో , ఒక చెక్క కుర్చీలో కూర్చొని శాస్త్రజ్ఞుడిలా కనిపించాడు ఆ మెకానిక్. ఆయనకి రిపేర్‌కిస్తే, తిరిగి ఎప్పటికి వస్తుందో ఎవరికీ తెలియదు. అన్నింటికి డొప్పలు ఊడబీకి, వాటి అంతర్భాలు బయటికి తీసి ఎప్పుడూ పరిశీలించడమే తప్ప , వాటి గొంతుకి అంత సులభంగా ప్రాణం పోసేవాడు కాదు. ఆ రకంగా ఆయన చేతిలో మా కరెంట్ రేడియో అంతరించిపోయింది.
మా ఇంట్లో ఉన్న రేడియోకి రెండింతల సైజులో , ఒక ట్రంకు పెట్టెలా ఇంకో రేడియో ఉండేది. అది నారాయణరావు హోటల్‌లో కస్టమర్లను అలరించడమే కాదు, ఆ రోడ్డు మొత్తం అన్ని ఇళ్లలోకి ఉచితంగా వినిపించేది. పాకిస్తాన్‌తో యుద్ధ కాలంలో శ్రోతలంతా యుద్ధ ప్రాతిపదికన చెవులు వ్యాకోచింపజేసి వినేవాళ్లు.
ఆ రోజుల్లో ప్రతి హోటల్‌లో ఈ సైజు రేడియో ఉండాల్సిందే. పాటలకు చెవులు కోసుకుంటూ , నాలుగు ఇడ్లీలు ఎక్కువ తిని బకెట్ సాంబారు తాగేవాళ్లు. నారాయణరావు రేడియో మోగలేదంటే అర్థం కరెంట్ పోయిందని.
ట్రాన్సిస్టర్ రేడియోతో రిస్క్ ఏమంటే ఆరు పెద్ద బ్యాటరీలు వేయాలి. ఆ రోజుల్లో అవి ఖరీదు. చార్జ్ అయిపోయినా ఎండలో ఎండించి ఎలాగో పాడించేవాళ్లం.
హిందీ సినిమాలపై ఆసక్తి కలిగిన తర్వాత బినాకా గీత్ మాలా అంటే పడిచచ్చేవాళ్లం. శ్రోతల లిస్ట్ చదివేవాళ్లు. నేను కూడా ఒకట్రెండు సార్లు పంపాను కానీ, నా పేరు చదివారో లేదో తెలియదు.
ఆదివారం మధ్యాహ్నం సంక్షిప్త శబ్ద చలన చిత్రం అని వేసేవాళ్లు. అది వింటే సినిమా చూసిన ఫీలింగ్ ఉండేది. ఇవి కాకుండా నాటకాలు కూడా వినిపించేవాళ్లు. టేప్ రికార్డర్ వచ్చి రేడియోని హత్య చేసింది. పాటల కోసం వినేవాళ్లు లేకుండా పోయారు. టీవీ వచ్చి , వార్తలు కూడా వినకుండా చేసింది.
ఒకప్పుడు రేడియోలో నా గొంతు వినపడాలనే కోరిక ఉండేది. చిన్నప్పుడు బాలానందం ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని ఆశ. కానీ హైదరాబాద్ ఏ దిక్కున ఉందో కూడా తెలియని అమాయకత్వం.
రేడియో అంతరించి పోతున్నప్పుడు రెండు కథలు చదివాను. అది విన్నవాళ్లెవరూ తారసపడలేదు.
పాటల కోసం మొహం వాచినట్టు ఎదురు చూసిన రోజులు, కామెంట్రీని చెవుల్లో ఇరికించుకుని విన్న రోజులు , ఇందిరాగాంధీ కూడా చనిపోతుందా అని ఆశ్చర్యపోయిన రోజులు…అన్నీ జ్ఞాపకాలే!
ఇప్పటికీ రేడియో బతికే ఉండొచ్చు…కానీ అందమైన తీపి గుర్తులు ఇవ్వలేదు. అవన్నీ ఇచ్చిన రేడియో ఇప్పుడు లేదు.
(ఫిబ్రవరి 13…ప్రపంచ రేడియో దినోత్సవం)