iDreamPost
android-app
ios-app

తమిళనాడు రాజధాని మార్పు యోచన..! ఈ సారి జరుగుతుందా..?

తమిళనాడు రాజధాని మార్పు యోచన..! ఈ సారి జరుగుతుందా..?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజధాని చెన్నైలో వైరస్‌ బారిన పడే వారి సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం రాజధానిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తమిళనాడులో 2.07 లక్షల మంది వైరస్‌ బారిన పడగా.. అందులో రాజధాని చెన్నైలోనే దాదాపు లక్ష మందికి వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత మళ్లీ రాష్ట్ర రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చింది.

శతాబ్ధాల చరిత్ర కలిగిన చెన్నై.. మహానగరంగా విస్తరించింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. జనాభా సాంద్రత పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాల కల్పన మృగ్యమైంది. ఫలితంగా 1981లో తొలిసారి రాజధానిని మార్చాలనే ఆలోచన జరిగింది. అన్నా డీఎంకే ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ ఈ ఆలోచన చేశారు. తిరుచ్చి, తంజావూరులకు మధ్య నూతన రాజధాని ఏర్పాటు చేయాలని తలచారు. అయితే ఆర్థిక పరమైన సమస్యలతోపాటు ప్రతిపక్షం వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు.

20 ఏళ్ల కిత్రం ఎంజీ రామచంద్రన్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకించిన డీఎంకే అధినేత కరుణానిధి.. 2001లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో ప్రతిపాదన చేశారు. ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు, ఓల్ట్‌ మహాబలిపురం మధ్యన గ్రామాల్లో పరిపాలన రాజధాని నిర్మించాలని యోచించారు. అసెంబ్లీ, సచివాలయం, ప్రభుత్వ భవనాలు 200 ఎకరాల్లో నిర్మించాలని ఆలోచన చేశారు. మరో 1500 ఎకరాల్లో నివాస భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఇది కూడా ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది.

మళ్లీ 20 ఏళ్లకు ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం రాజధాని మార్పుపై సమాలోచనలు జరుపుతోంది. జనాభా అధికంగా ఉండడం వల్లే చెన్నైలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉందని నిపుణులు విమర్శస్తున్నారు. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ పళనిస్వామి ప్రభుత్వం చేస్తున్న నూతన రాజధాని ప్రతిపాదనలు ఏ మేరకు ఫలిస్తాయన్నది గత చరిత్ర దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంజీ రామచంద్రన్, కరుణానిధి ప్రభుత్వాల మాదిరిగా ఆలోచన ప్రారంభంలోనే ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదన ఆగిపోతుందా..? లేదా నూతన రాజధాని ఏర్పాటు చేస్తారా..? వేచి చూడాలి.