ఆఫ్జల్ ఖాన్ శిబిరంలోనే అతన్ని మట్టుబెట్టిన శివాజీ వీరత్వం

1659 సంవత్సరం, బీజాపూర్ సైన్యం ఆఫ్జల్ ఖాన్ నాయకత్వంలో శివాజీకి చెందిన మరాఠా సైన్యం మీద మెరుపు దాడులు చేసి చీకాకు కలిగిస్తూ ఉన్నది. సంఖ్యాపరంగా, ఆయుధ సంపత్తిలో మెరుగైన సైన్యానికి ఆఫ్జల్ నాయకత్వ పటిమ తోడవడంతో మరాఠా సైన్యం చాలా నష్టాలు చవి చూసింది. పూనా లోని శివాజీ నివాసం మీద దాడి చేసి మరాఠా ప్రాబల్యం అంతం చేయాలని ఆఫ్జల్ ఖాన్ ఆలోచన.

బలమైన బీజాపూర్ సెన్యాన్ని మైదాన ప్రాంతాల్లో ఎదుర్కోవడం కష్టమని భావించిన శివాజీ తన మకాం ప్రతాపగఢ్ కి మార్చాడు. కొండ మీద ఉన్న ఆ కోట మీద దాడి చేయడం కష్టం. అంతేగాక ఆ ప్రాంతం మరాఠా సైన్యానికి అలవాటైన గెరిల్లా యుద్ధం చేయడానికి బాగా అనువుగా ఉంటుంది.

ఆఫ్జల్ ఖాన్ తన సైన్యంతో ప్రతాపగఢ్ మీద తరచుగా దాడులు చేసినా ప్రతిసారీ నష్టాలని ఎదుర్కొన్నాడు. అతని ఫిరంగులు, అశ్వాలు, ఏనుగులు, ఒంటెలు ఏమాత్రం ఉపయోగపడలేదు. మరోవైపు కోటలో సరుకులు నిండుకోవచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆఫ్జల్ ఖాన్ మరాఠాలకు ఓ ప్రతిపాదన పంపించాడు. ప్రాణ నష్టం లేకుండా కలిసి కూర్చుని సంధి చేసుకుందాం అన్నది ఆ ప్రతిపాదన.

అయితే శివాజీకి అతని ఉద్ధేశం మీద అనుమానమే. ఇదే ఆఫ్జల్ ఖాన్ లోగడ రాజా కస్తూరి రంగ అనే రాజుని చర్చలకు పిలిచి హతమార్చి ఉన్నాడు. ఆఫ్జల్ ఖాన్ పంపిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే రాయబారికి హిందూ మతం పట్ల అతడి బాధ్యత గుర్తు చేసి శత్రువు ఉద్ధేశం ఏదో చెప్పమని అడిగాడు శివాజీ. ఆఫ్జల్ ఖాన్ సంధి ప్రతిపాదన కుట్రతో కూడుకున్నదని ఆ రాయబారి అన్యాపదేశంగా చెప్పాడు. ఆ ప్రతిపాదన తనకు ఇష్టమే అని వర్తమానం పంపి, తన వైపు నుంచి రాయబారిగా గోపీనాథ్ పంటాజీని పంపాడు శివాజీ.

సమావేశ స్థలం ఆఫ్జల్ ఖాన్ సూచించిన వాయి కాకుండా ప్రతాపగఢ్ దగ్గర అని ఖరారు చేశారు. అయితే పంటాజీ కేవలం దీని కోసమే రాలేదు. బీజాపూర్ సైన్యం యొక్క బలాబలాలు కూడా పరిశీలించాడు పంటాజీ. ఇద్దరూ నిరాయుధులుగా సమావేశానికి రావాలి. తోడుగా ఒక రాయబారి, ఇద్దరు అంగరక్షకులూ ఉండాలని అనుకున్నారు. నవంబరు 10 అని ముహూర్తం నిర్ణయించారు.

ఆఫ్జల్ ఖాన్ బాగా పొడవు అందుకు తగ్గ లావుతో బలిష్టమైన వ్యక్తి. ఒకసారి ఫిరంగి గోతిలో పడితే పది మంది కలిసి ఎత్తలేని దానిని ఒక్కడే ఎత్తాడని అతని గురించి చెప్తారు.

సమావేశం
ఆఫ్జల్ ఖాన్ కుట్ర గురించి ముందే తెలుసుకున్న శివాజీ దానికి సన్నద్ధమై వెళ్లాడు. బయటకు కనిపించకుండా ఉక్కు కవచం, తలపాగా కింద ఉక్కు శిరస్త్రాణం, దుస్తుల లోపల చేతికి అందేలా పిడిబాకు, లోహపు గోళ్లు దాచుకుని వెళ్ళాడు. తోడుగా జీవ మహల, శంభాజీ కావజీ అని తనకోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చే ఇద్దరు అంగరక్షకులు ఉన్నారు.

శివాజీని చూడగానే ఎదురొచ్చి కౌగిలించుకొన్నాడు ఆఫ్జల్ ఖాన్. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఉన్నట్టుండి తన చేతులు శివాజీ గొంతు చుట్టూ జరిపి గట్టిగా బిగించాడు. ఆ పట్టుకు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయినా ముందుగా ఊహించినదే కాబట్టి చేతులు దుస్తులలో పెట్టి లోహపు గోళ్లు బయటకు తీశాడు. ఈ లోపల ఆఫ్జల్ ఖాన్ కత్తి అందుకని ఒక వేటు వేశాడు కానీ కవచం ఉండడంతో శివాజీకి ఏమీ కాలేదు. ఇంతలో తనచేతికున్న గోళ్ళతో ఆఫ్జల్ ఖాన్ కడుపులో పొడిచి పేగులు బయటకు లాగాడు శివాజీ.

ఈ గొడవకు గుడారం బయట ఉన్న సయీద్ బండా అనే సైనికుడు లోపలకొచ్చి కత్తితో శివాజీ తలమీద దెబ్బ వేశాడు. తలపాగా చినిగిపోయింది కానీ లోపల ఉన్న శిరస్త్రాణం వల్ల హాని జరగలేదు. ఇంతలో జీవ మహల అతడి చేతిని నరికి క్షణంలో మట్టుబెట్టాడు. పక్కనే ఉన్న శంభాజీ పేగులు బయటకొచ్చి కింద పడివున్న ఆఫ్జల్ ఖాన్ తల వేరు చేసి చేతిలో పట్టుకున్నాడు.

ముగ్గురు కలిసి వేగంగా బయటకొచ్చి ప్రతాపగఢ్ కోట చేరుకున్నారు. అందుకోసం వేచి ఉన్న మరాఠా సైన్యం బీజాపూర్ సైన్యం మీద దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో మరాఠాలకు ఎదురు లేకుండా పోయింది.

ఆఫ్జల్ ఖాన్ శిరస్సును శివాజీ తల్లి జిజియా బాయికి సమర్పించాడు శంభాజీ. తరువాత శివాజీ ఆదేశంతో ఆఫ్జల్ ఖాన్ దేహాన్ని సైనిక మర్యాదలతో ఖననం చేశారు.
(ఛత్రపతీ శివాజీ జయంతి సందర్భంగా)

Show comments