Krishna Kowshik
Krishna Kowshik
పెళ్లి చేసుకుంటే.. వధువు, వరుడు తరుఫున అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు పెద్దలు. ఏడు తరాలు సంగతి ఏమో కానీ.. కనీసం అమ్మాయి, అబ్బాయి ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు..ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకుని పెళ్లి చేస్తుంటారు. కానీ ఈ వ్యక్తి కేవలం ఓ పెళ్లి వేడుకలో పరిచమైన మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఘోల్లుమంటున్నాడు. దానికి కారణం ఆమె విదేశీయురాలు అని తెలియడమే. కొన్నాళ్ల కాపురం తర్వాత ఇది బయట పడగా.. భారత పౌరసత్వం పొందేందుకు తనను పావుగా వినియోగించుకుందని ఆరోపిస్తూ.. సదరు వ్యక్తి తన భార్యపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాడు.
వివరాల్లోకి వెళితే.. కోల్ కతాకు చెందిన వ్యాపార వేత్త తబీష్ ఎహ్సాన్ బెంగాల్‌లోని అసన్ సోల్‌లో నివసిస్తున్నారు. 2009లో నజియా అంబ్రీన్ ఖురైషీని వివాహం చేసుకున్నారు. కాగా, నజియాను తబీష్ ఓ వివాహ వేడుకలో చూసి ఇష్టపడ్డాడు. నజియా తనది ఉత్తరప్రదేశ్ అని చెప్పడంతో.. ఆ అమ్మాయి గురించి ఇంట్లో చెప్పడంతో , అటు నజియా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2022 వరకు వీరి కాపురం సజావుగా సాగిపోయింది. రెండో బిడ్డ కడుపులో పడిన దగ్గర నుండి వీరి మధ్య విబేధాలు రావడం మొదలయ్యాయి. దీంతో నజియా తన కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో మాటలు కట్ చేసేసింది. ఇక తమ బిడ్డను మీ వద్దకు పంపేది లేదని అత్తమామాలు తెగేసి చెప్పారు.
ఆ తర్వాత నజియా కుటుంబం తబీష్‌పై కేసు దాఖలు చేయగా.. కోల్ కతాలోని అలీపూర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలోనే తన భార్య విదేశీయురాలని భర్త తబీష్‌కు తెలిసింది. బంధువుల ద్వారా ఆమె బంగ్లాదేశ్ మహిళ అని తెలుసుకున్నాడు. అయితే ఆమె తనలా మరొకరిని కూడా మోసం చేసిందని తెలుసుకున్నాడు. బంగ్లాదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడిని వివాహం చేసుకుని, తప్పుడు ఆరోపణలు చేసి విడాకులు తీసుకుందని తెలిసింది. ఆ తర్వాత ఎలాంటి వీసా లేకుండా భారత్‌కు తరలి వచ్చి, ఈ దేశ గుర్తింపు కోసం తనను పావుగా వాడుకుని పెళ్లి చేసుకుందని తబీష్ వాదన. తమ పెళ్లి కూడా ఈ కుట్రలో భాగమని చెప్పారు. తబీష్..తన భార్య నజియా, ఆమె కుటుంబ సభ్యులపై కోల్ కతా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఫిర్యాదు ఆధారంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు.
కాగా, అధికారులకు ఆధారాలు సమర్పించినా.. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తబీష్. 2007-09 మధ్య కెనడా వెళ్లినట్లు తనకు తెలిసిందని, కానీ ఆమెకు 2020లో తొలిసారిగా భారతీయ పాస్ పోర్టుకు ఆమోదం పొందిందని చెప్పారు. పాస్ పోర్టు లేకుండా కెనడాకు ఎలా ప్రయాణించిందని, కెనడా ఆమెకు వీసాను ఎలా ఆమోదించిందని ప్రశ్నించారు. తబీష్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, వైజెన్సీ కమిషన్, కోల్‌కతాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలు ప్రభుత్వ శాఖలకు పలు లేఖలు పంపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది.