iDreamPost
android-app
ios-app

అద్వానీ.. అమిత్ షా.. అయోధ్య‌…

అద్వానీ.. అమిత్ షా.. అయోధ్య‌…

భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉద్దండుడు.. అత్యంత సీనియర్ అయిన అద్వానీతో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కావ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌వైపు.. ఆగ‌స్టు 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూజ.. మ‌రోవైపు.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 24న సీబీఐ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ హాజరుకానుండ‌డం… ఈ రెండింటి మ‌ధ్య అమిత్ షా భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది.

న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి వెళ్లిన అమిత్ షా సుమారు 30 నిమిషాలకు పైగా అద్వానీ తో మాట్లాడారు. వారిద్దరి మ‌ధ్య అయోధ్య‌కు సంబంధించిన చర్చలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 5న అయోధ్యలో జ‌రిగ‌బోయే.. రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నట్లు సమాచారం. కార్యక్రమానికి అద్వానీని ఆహ్వానించ‌డానికే అమిత్ షా వెళ్లార‌ని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ 150 మందిని మాత్రమే ఆహ్వానిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు చెందిన ప్ర‌ధాన నేత‌ల‌తో పాటు.. ఇత‌ర పార్టీల‌కు చెందిన మ‌రి కొంద‌రు ముఖ్యులు కూడా భూమి పూజ‌కు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

కూల్చివేత కేసుకు సంబంధించి…

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనుంది. ఈ మేరకు మసీదు కూల్చివేత కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ ప్రత్యేకంగా తేదీలను నిర్ణయించారు. సీఆర్పీ పీసీ సెక్షన్‌ 313 కిందట ఆయన స్టేట్‌మెంట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 24న రికార్డు చేయనున్నారు. బీజేపీ నేత మురళీ మనోహ‌ర్ జోషి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు 23న రికార్డు చేయనుంది. అలాగే 22న శివసేన మాజీ ఎంపీ సతీశ్‌ ప్రధాన్‌ నుంచి కూడా వీడియో లింక్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ తీసుకోనుంది.

గ‌తంలో సుప్రీం ఏం చెప్పిందంటే…

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ తొమ్మిది నెలల్లో పూర్తి కావాలని, అంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతేడాది జూలైలో ఆదేశించింది. మే8 న, ట్రయల్ కోర్టు తన తీర్పును ఆగస్టు 31 వరకు ప్రకటించడానికి గడువును పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి, కొత్త గడువును ఉల్లంఘించకుండా చూసుకోవాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్‌, సూర్యకాంత్‌ ద్విసభ్య ధర్మాసనం మే8న తెలిపింది. సాక్ష్యాల రికార్డింగ్‌ ఇంకా పూర్తి కానందున సమయం పొడగించాలని న్యాయమూర్తి మే6న సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. తమ నిర్దోషిత్వాన్ని కోరేందుకు వీలుగా సీఆర్ పీసీ సెక్షన్ 313 కింద కోర్టు వాంగ్మూలం తీసుకుంటున్నది.