సూర్యకు ఆస్కార్ అరుదైన గౌరవం

థియేటర్లలో విడుదల కాకపోయినా ఆకాశం నీ హద్దురా, జైభీమ్ సినిమాలు సూర్యకు అంతర్జాతీయంగా ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చాయో చూస్తున్నాం. ఆస్కార్ అవార్డులు గెలవకపోయినా దానికి సమానమైన గౌరవాన్ని అందిస్తున్నాయి. ఈ పురస్కారాన్ని అందజేసే ది అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో ప్యానెల్ సభ్యుడిగా ఉండాల్సిందిగా సూర్యకు అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఇన్విటేషన్ అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ సూర్యనే. 1987లో మెగాస్టార్ చిరంజీవికి వేడుకలకు రావాల్సిందిగా పిలిచారు కానీ ఇలా ప్యానెల్ మెంబెర్ గా కాదు. ఇది తెలియక సోషల్ మీడియాలో కొంత అయోమయం నెలకొన్నప్పటికీ వాస్తవం ఇది.

సూర్యతో పాటు నిన్నటి తరం హీరోయిన్ కాజోల్ కు సైతం ఈ బృందంలో చోటు దక్కింది. ఈ ఎంపిక సదరు నటీనటుల ప్రస్తుత కమిట్మెంట్లు, వృత్తిపరమైన ప్రాధాన్యతల ఆధారంగా జరుగుతుంది. అకాడమీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 44 శాతం మహిళలు, అందులో 37 శాతం జాతి వర్ణ కారణాల వల్ల వెనుకబడిన వర్గాల నుంచి, 50 శాతం సభ్యులను అమెరికా కాకుండా 55 దేశాల నుంచి ఎంచుకుంటారు. ఈసారి మహోత్సవానికి 397 మందిని పిలిచారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, విద్యా బాలన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలీ అఫ్జల్, గునీత్ మోంగా, ఏక్తా కపూర్, శోభా కపూర్, ఆదిత్య చోప్రా తదితరులు ఇప్పటికే ఆస్కార్ లో మెంబెర్స్ గా ఉన్నారు

సౌత్ సినిమా సత్తా నలుదిశలా వ్యాపిస్తున్న తరుణంలో సూర్యకు పిలుపు రావడం ముదావహం. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే సందేశం స్ఫూర్తి కలగలిసిన కథలను ఎంచుకుంటూ రిస్క్ చేస్తున్న ఈ వర్సటైల్ యాక్టర్ కు ఇటీవలే విడుదలైన బ్లాక్ బస్టర్ విక్రమ్ లో చిన్న పాత్రకు సైతం ఎంత గొప్ప అప్లాజ్ వచ్చిందో చూస్తున్నాం. ఇటు నిర్మాతగానూ భార్య జ్యోతికతో కలిసి కంటెంట్ మూవీస్ నిర్మిస్తున్న సూర్యకు లేటెస్ట్ రిలీజ్ ఈటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వెట్రిమారన్ తో చేస్తున్న వడివాసల్ మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుకు సంబంధించిన టైటిల్ ఇంకా నిర్ణయం కాలేదు. సూర్య ప్రస్తుతం విదేశాల్లో సెలవు మీదున్నారు

Show comments