iDreamPost
iDreamPost
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ గత వారం ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది ఇంకా మరచిపోలేదు. తమ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన జగన్ ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారన్నది చినబాబు ఉవాచ. ఆయన మాట చెప్పిన వారం గడవకముందే జగన్ ప్రభుత్వం పావులు కదిపింది. ఈఎస్ఐ కుంభకోణంలో చట్ట ప్రకారం చర్యలకు పూనుకుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా చంద్రబాబు సన్నిహితుడు అచ్చెన్నాయుడి మెడకు అది చుట్టుకుంది. దాంతో టీడీపీ నానా హైరానా పడుతోంది.
నిన్నటి వరకూ దమ్ముంటే విచారణ జరపండి, అవినీతి నిరూపించండి, ఎలాంటి శిక్షకయినా సిద్ధం అంటూ సవాళ్లు, ఛాలెంజులు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు తల్లడిల్లిపోతున్నారన్నది అంతుబట్టడం లేదు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్న ఏసీబీని కూడా బద్నాం చేయాలని చూడడం విచిత్రంగా కనిపిస్తోంది. విచారణ చేయాలని చంద్రబాబు చెప్పారు..ఏడాది గడిచినా దర్యాప్తు చేయలేకపోయారని చినబాబు అన్నారు. అలాంటిది ఇప్పుడు ఏసీబీ చేస్తుండడం మాత్రం సహించలేకపోతున్నారు. సవాళ్లు విసిరిన వాళ్లే ఇప్పుడు విచారణకు సహకరించకపోగా, కక్ష సాధింపు అంటూ ఇంకా ఏవేవో మాట్లాడుతుండడం విచిత్రంగా తోస్తోంది.
ప్రతిపక్షం ఇలాంటి సమయంలో హుందాగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ కులం కోణంలో అచ్చెన్న అరెస్ట్ ని సమర్థించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా అరెస్టు ని కూడా కిడ్నాప్ అంటూ బాబు ఓ లేఖ కూడా విడుదల చేయడం మరో విస్మయకర అంశంగా మారింది. చంద్రబాబు తన స్థాయిని మరచి వ్యవహరిస్తున్నారనడానికి తాజా ఎపిసోడ్ ఓ ఉదాహరణగా మారుతోంది. కేవలం బుదరజల్లే ప్రయత్నం తప్ప వాస్తవాలు ఆయనకు పట్టడం లేదని అంతా భావించే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేసిన దానిని ఆయన కిడ్నాప్ అనడమే కాకుండా, ఆ తర్వాత వెంటనే బీసీ నేతను అరెస్ట్ చేశారని అనడం బాబు స్థాయిని బజారను పడేలా చేస్తోంది.
అదే సమయంలో జగన్ దూకుడు కారణంగానే బాబు బేజారెత్తిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. క్యాబినెట్ ఆమెదంతో సీబీఐని రంగంలో దింపి నేరుగా హెరిటేజ్ తో ముడిపెట్టడంతో అటు కుటుంబ, ఇటు పార్టీ వ్యవహారాల్లో బాబు కలవరపడుతున్నారు. ఆ వెంటనే కొన్ని గంటల్లో అచ్చెన్న ను అరెస్ట్ చేయడం ఆయనలో అలజడి రేపింది. దాంతో చివరకు బీసీలంతా రోడ్డు మీదకు వచ్చి అరెస్ట్ ని అడ్డుకోవాలని పిలుపునిచ్చేందుకు ఆయన సాహసించాల్సి వచ్చింది. అయినా గానీ బాబు పిలుపుని టీడీపీ నేతలు కూడా ఖాతరు చేసినట్టు కనిపించలేదు. కొంతలో కొంత చింతమనేని మినహా శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ ఏకంగా 600 కిలోమీటర్ల పొడవునా ఎక్కడా ఆందోళన గానీ, అడ్డంకి గానీ లేకపోవడం గమనిస్తే బాబు ని ప్రజలు పట్టించుకోవడం లేదని, ప్రజల ఆలోచనలు చంద్రబాబుకి పట్టడం లేదని స్పష్టం అవుతోంది. ఏమయినా విపక్ష నేతలు కోరింది చేస్తున్నప్పటికీ కలవరపడడం విశేషమే.