రోడ్డు ప్రమాదంలో వలస కూలీలను మింగేసిన మృత్యువు..

  • Published - 02:29 AM, Sat - 28 March 20
రోడ్డు ప్రమాదంలో వలస కూలీలను మింగేసిన మృత్యువు..

వలస కూలీలను మృత్యువు లారీ రూపంలో మింగేసింది. కరోనా కారణంగా బ్రతుకుదెరువు లేక పనులు దొరక్క సొంతూరుకు బొలెరోలో బయల్దేరిన కూలీలకు లారీ రూపంలో ప్రమాదం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే కర్ణాటక రాయచూర్ ప్రాంతానికి చెందిన కూలీలు కరోనా కారణంగా పనులు లేక స్వస్థలానికి బొలెరో ట్రక్ లో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న ట్రక్‌ను రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో అవుట్ రింగ్ రోడ్ మీద వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో ఒక చిన్నారి,బాలిక ఉన్నారు.

కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడికాయలు తీసుకెళుతున్న లారీ బొలెరో ట్రక్ ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో దాదాపు 30 మంది కూలీలు బొలెరో ట్రక్ లో ప్రయాణిస్తున్నారు.వీరంతా రోడ్డు కాంట్రాక్ట్‌ పనులు చేసేవారిగా గుర్తించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ సిబ్బంది మృత దేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఔటర్ రింగ్ రోడ్డు మార్గాన్ని మూసి ఉంచిన నేపథ్యంలో వీరి వాహనానికి అనుమతి ఎలా లభించిదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Show comments