Idream media
Idream media
సీతారామాంజనేయులు.. ప్రస్తుతం ఈ పేరు అవినీతి పరులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. లంచగొండి అధికారులకు ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు సింహస్వప్నంలా మారారు. బాధ్యతులు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తూ అవినీతి అధికారులను హడలెత్తిస్తున్నారు. గత నెల 6వ తేదీన ఏసీబీ డీజీగా బాధ్యతులు స్వీకరించిన సీతారామాంజనేయులు ఏసీబీలో తనదైన ముద్ర వేస్తున్నారు.
అవినీతి వ్యవహారాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రి నంబర్‌కు వచ్చే సమాచారమే ప్రాతిపదికగా సీతారామాంజనేయులు తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అవినీతి ఎక్కువగా ఉండే ప్రభుత్వ శాఖలను ముందుగా టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గత నెలలో దాడులు నిర్వహించారు. ఆ తర్వాత పక్షం రోజులకు రెవెన్యూ శాఖపై నిఘా నేత్రం వేశారు. జిల్లాకొక తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా ఈ రోజు మంగళవారం అవినీతిలో అగ్రస్థానాల్లో ఉండే విభాగాల్లో ఒకటైన మున్సిపల్ శాఖలోని టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఏకకాలంలో దాడులు చేసి అవినీతిపరులను హడలెత్తించారు.
విజయనగరం, విశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, ప్రొద్దుటూరు మునిసిపల్ కార్పొరేషన్లలో ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో.. కట్టడాలు, అనుమతులకు సంబంధించిన రికార్డుల్ని పరిశీలించారు. కొన్ని ఆఫీసుల్లో నగదు సీజ్ చేసినట్లు సమాచారం.