Idream media
Idream media
అవినీతి నిరోధక శాఖ అంటే ACB,దీన్ని ప్రక్షాళన చేయాలని జగన్ అనుకోవడం మంచి పరిణామమే. అయితే జబ్బు ఎక్కడుందో తెలుసుకోకుండా మందు వేస్తే, జ్వరం వచ్చినప్పుడు ఆయింట్‌మెంట్ రాసుకున్నట్టు ఉంటుంది.
పోలీస్ శాఖలో అవినీతి ఉందని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. జగన్‌కి తెలుసో లేదో కానీ, ప్రతి పోలీస్ స్టేషన్‌కి ఒక రేటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ చాలా Castly. లక్షల్లో మామూళ్లు వస్తాయి. ఇక్కడ SI కానీ, CI కానీ కావాలంటే రాజకీయ పలుకుబడితో పాటు , నాయకులకి భారీగా సమర్పించుకోవాలి. అసలు డిమాండ్ లేని స్టేషన్ యూనివర్సిటీ స్టేషన్. తిరుపతి సిటీలో కాపురం ఉండొచ్చు అంతే. ఇంకో రకంగా ఆదాయం ఉండదు. ఇలాగే డబ్బులు రాని స్టేషన్లు చాలా ఉంటాయి.
విషయం ఏంటంటే పోలీస్ శాఖలో నుంచి ACBకి బదిలీ చేస్తారు. అంతే తప్ప ACBకి ప్రత్యేకమైన సిబ్బంది ఉండరు. అంటే డిపార్ట్‌మెంట్‌లో బాగా డబ్బులు సంపాదించిన అధికారి తాత్కాలికంగా ACBకి వెళ్తారు. అక్కడికి వెళ్లి ACB పేరుతో వసూళ్లు చేస్తారు.
మరి పట్టుబడే వాళ్ల సంగతేంటి? దానికి రెండు కారణాలు ACB కూడా పనిచేస్తూ ఉందని తెలియడం అవసరం కాబట్టి టార్గెట్ రీచ్ కావడానికి కొన్ని కేసులు పట్టుకుంటారు. ఇది కాకుండా రాజకీయ కారణాలతో కూడా దాడులు జరుగుతాయి. ఒక అధికారి , మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడని అనుకోండి. అతని మీద దాడులు జరుగుతాయి. క్షేత్రస్థాయి వాస్తవం ఇది. పోలీస్‌శాఖని ప్రక్షాళన చేయకుండా ACBని ప్రక్షాళన చేయాలనుకోవడం తాత్కాలికమే తప్ప పరిష్కారం కాదు.
ప్రభుత్వ శాఖలు తమ పని తాము కరెక్ట్‌గా చేస్తే ఏ సమస్యా ఉండదు. రెవెన్యూ ఆఫీస్‌లో డైరెక్ట్‌గా ఏ పనీ జరగదు. డబ్బులు ఇవ్వాల్సిందే. ఇది పల్లెటూర్లో చదువురాని వాళ్లకు కూడా తెలుసు.
RTO కార్యాలయంలో డబ్బులు ఇవ్వకుండా పనులు జరుగుతాయా? అప్పులు చేసి ఒక సామాన్యుడు ఇల్లు కొంటే దాన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి ఎంత డబ్బు ఇవ్వాలో అక్కడున్న బ్రోకర్లే చెబుతారు.
ప్రైవేట్ డాక్టర్లకి ఫీజులు కట్టే స్తోమత లేక కాన్పు కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తే , మగ పిల్లాడికింత, ఆడపిల్ల అయితే ఇంత అని వసూలు చేస్తున్నారు.
తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రిలో అయితే ప్రతి రెండేళ్లకు ఒక సారి ధరల పట్టిక మారుతుంది. ఆర్థికమాంధ్యం గురించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు.