iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల క్రితం ఎసిబి పనితీరుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక శాఖ సిబ్బంది వ్యవహార శైలి మార్చుకోవాలని ఆదేశించారు. క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ఎవరినీ ఉపెక్షించకుండా సమర్ధవంతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఇప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా ఎసిబి డిజి ని బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపిఎస్ సీతారామాంజనేయులు ని నియమించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పి.సీతారామాంజనేయులుకు అదనపు బాద్యతలు అప్పగించారు. రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్ప గిస్తూ ఉత్తర్వుల్లో పేర్కన్నారు.
ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సిన్సియర్ అధికారిగా పేరున్న సీతారామాంజనేయులు గత ప్రభుత్వం కాలంలో తెరమరుగయ్యారు. జగన్ పాలనలో ఆయనకు రవాణా శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా ఎసిబి డిజి చేయడంతో అవినీతి విషయంలో జగన్ ఎంత సీరియస్ గా ఉన్నారనడానికి సంకేతం అని కొందరు చెబుతున్నారు. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరం అవినీతి సహా పలు అంశాలు ఇటీవల కాబినెట్ సబ్ కమిటీ సీఎం కి రిపోర్ట్ ఇచ్చింది. వాటిపై ఎసిబి ని రంగంలో దించే ఆలోచనలో సీఎం ఉన్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని కీలక కేసులు మాత్రం ఎసిబి చేతుల్లో పెట్టే సంకేతాలు తాజా బదిలీ వ్యవహారాల్లో స్పష్టం అవుతోంది. దాంతో సీతారామాంజనేయులు మరోసారి ప్రధాన భూమిక పోషించే అవకాశం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేసిన జగన్ అవినీతి అదుపు చేసే యత్నంలో తీసుకున్న నిర్ణయం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుందన్నది చూడాలి.