iDreamPost
android-app
ios-app

ఏ.బి వెంకటేశ్వరరావు వ్యవహారంలో మరో ముందడుగు

  • Published Apr 08, 2020 | 5:03 AM Updated Updated Apr 08, 2020 | 5:03 AM
ఏ.బి వెంకటేశ్వరరావు వ్యవహారంలో మరో ముందడుగు

తెలుగుదేశం పాలనలో అనేక అక్రమాలకు, నిబందనల ఉల్లంఘనకు పాల్పడారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ ఇంటిలిజన్స్ డి.జీ ఏ.బి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ని ఆగస్టు నెల 5వరకు పొడిగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పాలనలో ఇంటిలిజన్స్ డి.జీ గా పనిచెసిన ఏ.బి వెంకటేశ్వర రావు చంద్రబాబు రాజకీయ ప్రయొజనాలు కాపాడటం కోసమే పనిచేశారన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు స్వప్రయజనాల కోసం నిబందనలు సైతం పక్కన పెట్టి దూకుడుగా వ్యవహరించిన వెంకటేశ్వరరావు వ్యవహారశైలి ఆనాడే రాజకీయ వర్గాల్లో సైతం విస్మయానికి గురి చేసింది. ఒక దశలో ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకుని ఏకంగా తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం కూడా జరిగింది . దీన్ని బట్టి ఆయన తెలుగుదేశానికి ఎంత నమ్మకస్తుడో అవగతం అవుతుంది.

తెలంగాణ శాసన మండలి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు కోట్లు ఇస్తూ అడియో , వీడియో టేపుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో ఆంద్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ ఏడీజీగా ఉన్న ఏఆర్‌ అనురాధపై ఇంటిలిజన్స్ వైఫల్యం నెపం మోపి విధులనుండి తప్పించి, అప్పటివరకు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన 1989 బ్యాచ్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ డి.జీ గా నియమించారు చంద్రాబాబు. ఇంటిలిజన్స్ డి.జీ స్థానంలో కూర్చున్న రోజునుంచే వెంకటేశ్వరరావు నిబందనలు గాలికి వదిలి చంద్రబాబు వ్యక్తిగత సేవలో మునిగిపోయారు.

ఓటుకు నోటు కేసులో మత్తయ్య నిందితుడన్న విషయం నాకు తెలియదు అని చెప్పడంతో మొదలైన ఆయన ఇంటిలిజన్స్ డి.జీ ప్రస్థానం అనేక అడ్డదారుల వెంట నడిచింది. నాడు ప్రతిపక్షంగా ఉన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టిని, అందులోని ముఖ్యనాయకులని టార్గెట్ చేసి మరీ వేదించారు. ఒక దశలో మరింత ముందుకు వెళ్ళి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన శాసన సభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో దగ్గరుండి మరీ బేరసారాలు నడిపారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో జరిగిన నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌(ఎన్జీవో) ఎన్నికల్లో సైతం వేలు పెట్టి ఉద్యోగులను బెదిరించి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్ది వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులని ఒక పధకం ప్రకారం బెదిరింపులకు దిగుతూ, బైండోవర్ కేసులు పెడుతూ పూర్తిగా టీడీపీ సేవలో మునిగిన వెంకటేశ్వర రావు వ్యవహార శైలితో విసిగిపోయిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి పలు దఫాలుగా ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించింది. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం పైన అంతెత్తు ఎగిరారు. ఏ.బి వెంకటేశ్వర రావును బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఎక్కడిదని ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని హైకోర్టులో పిటిషన్‌ వేసి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేసే దాక చంద్రబాబు వెళ్ళారంటే ఎంత కుట్రకు ప్రణాళిక రచించారో అర్ధం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు వాదనకు కోర్టు సైతం నో చెప్పడంతో చేసేది లేక ఏ.బి వెంకటేశ్వర రావును విదుల నుండి తప్పించి ఎన్నికలు ముగియగానే ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా గవర్నర్ ఉత్తర్వుల మేరకు జీవో నెంబర్‌ 882ను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది.

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పోస్టులో ఉన్న వెంకటేశ్వరరావుని తప్పించడంతో పాటు తెలుగుదేశం పాలనలో జరిగిన అవకతవకలపై ముగ్గురు ఐ.ఏ.యస్ అధికారుల నేతృత్వంలో అంతర్గతంగా దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అనంతరం అధికారులు ఇచ్చిన నివేదికలో ఏ.బి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పాలనా హయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్టు, దేశ భద్రతకు సంభందించిన పలు కీలక విషయాలు బహిర్గతం చేసినట్టు పూర్తిస్థాయిలో ఆదారాలు ఉండటంతో, ఆల్ ఇండియా సర్వీస్ ( క్రమశిక్షణ , అపీల్) నిభందనల నియమం 3(1) క్రింద ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగే ఏ.బి వెంకటేశ్వరరావు తెలంగాణలో 171.39 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌ మండలం పస్పూల్‌ గ్రామంలో 57.19 ఎకరాలు, చిట్యాలలో 64.20 ఎకరాలు బినామీల పేరిట కొనుగోలు చేసి రైతు బంధు కింద ఖరీఫ్‌లో దాదాపు రూ.55 లక్షల ఆదాయం ఆర్జించినట్టు. జడ్చెర్ల వద్ద 50 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేసి అందులో ఓ అధునాతన గెస్ట్‌ హౌస్‌ను నిర్మించినట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఏ.బి వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను తెలుగుదేశం నేత అయిన కేశినేని నాని సైతం హర్షించడం గమనార్హం.

2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017లోనే కుట్రకు తెరలేపినట్టు ప్రాధమిక విచారణ లో తేలింది. రక్షణ ఉత్పత్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరైనా సదరు నిబంధనలేవీ పాటించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఆ నిబంధనలను తుంగలో తొక్కి క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్‌ పరికరాలకు 25 కోట్ల 50 లక్షల వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ‘ఆర్‌టీ ఇన్‌ఫ్లేటబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారని. ఈ కాంట్రాక్టును కట్టబెట్టెందుకు ఇజ్రాయెల్‌ కంపెనీకి భారతదేశంలో ఫ్రాంచైజీగా ‘ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’అనే షెల్‌ కంపెనీని ఏర్పాటు చేశారని. అయితే ఈ కంపెనీ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్‌ సాయి కృష్ణకు చెందినదని ఈ కంపెనీ సి.ఈ.ఒ గా ఏ.బి కుమారుడే వ్యవహరిస్తున్నారని. విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ అడ్రస్‌తో ఈ కంపెనీని నెలకొల్పారని ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్‌ చేసినట్టయ్యిందని.

చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటం కోసం ఏకంగా దేశ రక్షణకే ముప్పు తెచ్చిపెట్టేలా వ్యవహరించారని, రక్షణ, హోం, విమాన యాన శాఖల నుంచి లైసెన్స్‌ లేని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం, దేశ రక్షణ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌కు విరుద్ధంగా విదేశీ ప్రైవేట్‌ కంపెనీకి చేరవేయడం లాంటి తీవ్రమైన నేరాలు ప్రాధమికంగా నిర్ధారణ అవ్వడంతో ఆయనని సస్పెండ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ప్రాధమిక సమాచారం మేరకు ఏబీపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తును చేపట్టేందుకు అనుమతిస్తు ఉత్తరువులు జారీ చేసింది. ఈ మేరకు గతంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నిగమ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. అయితే తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో ఏబీవీ పిటిషన్‌ వేయగా విచారణ చేపట్టిన క్యాట్ ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని క్యాట్‌ తేల్చిచెప్పింది.

ఇక తాజాగా వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం నుండి, క్యాట్ నుండి కీలకమైన ఆదేశాలు రావడంతో ఇక ఈ వ్యవహారంలో మరింత దూకుడు పెంచే ఆలోచన చేస్తునట్టు సమాచారం . దేశ భద్రతకు భంగం కలిగేలా నిబందనలు ఉల్లంఘించడం , అక్రమాస్తులు కూడపెట్టడం లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపద్యంలో ఈ కేసుని అవినీతి నిరోధక శాఖ, సీబీఐ, ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకోనుంది, ఈ వ్యవహారంలో ఏబీవి తో పాటు తెలుగుదేశం పార్టీలోని పెద్ద తలకాయలకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు..