iDreamPost
android-app
ios-app

సెప్టెంబ‌ర్ 11 న్యూయార్క్‌లో ఒక తెలుగు కుటుంబం

సెప్టెంబ‌ర్ 11 న్యూయార్క్‌లో ఒక తెలుగు కుటుంబం

కాలిఫోర్నియాలో ఓ హైద‌రాబాద్ అమ్మాయి. మా అబ్బాయి స్నేహితురాలు. వాడిలాగే న‌న్ను డాడీ అని పిలుస్తుంది. అదో అనుబంధం. ఈ మ‌ధ్య US వెళ్లినపుడు ఓ విష‌యం చెప్పింది.

న్యూయార్క్‌లో ఆమె మేన‌మామ ఉన్నారు. ఆయ‌న్ని చూడ‌డానికి ఏడాది క్రితం వెళ్లింది. రెండు రోజుల త‌ర్వాత న్యూయార్క్‌లోని స్నేహితుల్ని క‌ల‌వ‌డానికి సిటీలోకి వెళ్లింది. రాత్రి 10 గంట‌ల‌కు తిరిగొస్తాన‌ని మామ‌తో చెప్పింది. ఆయ‌న మెట్రో స్టేష‌న్ వ‌ద్ద Wait చేస్తూ వుంటాన‌ని చెప్పారు.

రాత్రి 10కి ఆమె బ‌య‌ల్దేరింది. కానీ పొర‌పాటున దిగాల్సిన స్టేష‌న్‌లో దిగ‌లేక‌పోయింది. ఈ విష‌యం చెబుతామంటే చార్జింగ్ అయిపోయింది. మ‌ళ్లీ ఆమె వెన‌క్కి రావ‌డానికి రెండు గంట‌లు ప‌ట్టింది. అప్ప‌టి వ‌ర‌కు మామ‌య్య Wait చేస్తూనే వున్నారు. ఇద్దరూ ఇంటికెళ్లిపోయారు.

అంతా విన్న త‌ర్వాత “ఫోన్ చార్జింగ్‌లో పెట్టుకోనందుకు మీ మామయ్య‌కు కోపం రాలేదా? నిన్నేమీ అన‌లేదా?” అని అడిగాను.

అదేం లేద‌ని చెప్పింది.

25 ఏళ్ల క్రితం హైద‌రాబాద్ నుంచి ఆయ‌న న్యూయార్క్ వ‌చ్చారు. అమెరికాలో అమ్మాయిల‌కి భ‌ద్ర‌త ఎక్కువ కావ‌చ్చు. క్షేమంగా వ‌చ్చేస్తుంద‌ని ధైర్యం కావ‌చ్చు.

ఆయ‌న ప్లేస్‌లో నేనుంటే? చాలా టెన్ష‌న్ ప‌డేవాన్ని.

కార‌ణం నేనో ప‌ల్లెటూరు నుంచి వ‌చ్చాను. అమ్మాయిల‌కు భ‌ద్ర‌త లేని స‌మాజాన్ని చూశాను. జ‌ర్న‌లిజంలో ప‌ని చేయ‌డం వ‌ల్ల అతిగా ఆలోచించ‌డం కావ‌చ్చు.

దేశం కాని దేశంలో, న‌గ‌రంకాని న‌గ‌రంలో అమ్మాయి ఫోన్ ప‌నిచేయ‌క వ‌స్తాన‌న్న టైంకి రాక‌పోతే చాలా భ‌య‌ప‌డేవాన్నేమో!

“మా మామ‌య్య జీవితంలో చాలా టెన్ష‌న్లు చూశాడు. బ‌హుశా ఇది చాలా చిన్న‌దేమో?” అంది.

ఆయ‌న‌కు , వైఫ్‌కి న్యూయార్క్‌లో మంచి ఉద్యోగాలు. మూడేళ్ల బాబు. సంతోష‌మైన జీవితం, నెలలో ఒక‌ట్రెండు రోజులు ఆమెకి చాలా ప‌ని ఒత్తిడి. ఆ రోజుల్లో ఆమె ఇంటికి రాకుండా ఆఫీస్‌లోనే వుండిపోతారు. ఆ రోజు కూడా అలాగే ఉన్నారు.

ఉద‌యం 8 గంట‌ల‌కి బాబుని కేర్ సెంట‌ర్‌లో ఇచ్చి ఆయ‌న ఆఫీస్‌కి వెళ్లాడు. 11 గంట‌ల‌కి అమెరికా అంతా అల్ల‌క‌ల్లోలం. వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై దాడి. ఆమె జాబ్ అక్క‌డే. ఆ రోజు సెప్టెంబ‌ర్ 11, 2001.

పిచ్చివాడిలా ప‌రిగెత్తాడు. ఎదురుగా శిథిలాల కుప్ప‌. న్యూయార్క్‌లోని ఆస్ప‌త్రుల‌న్నీ తిరిగాడు. ఒక‌టి కాదు, రెండు కాదు నెల‌రోజులు వెతికాడు. చివ‌రికి స్మార‌క స్థూపంలో ఆమె పేరు నిలిచింది.

త‌ల్లి క‌న‌ప‌డ‌క పిల్ల‌వాడి ఏడుపు. బాబు కోసం ఉద్యోగం మానేసి ఇంటి నుంచే Outsourcing . మ‌ళ్లీ పెళ్లి చేసుకోలేదు. చాలా కాలం త‌ల్లి కోసం దిగులు పెట్టుకున్న పిల్ల‌వాడికి మెల్లిగా వాస్త‌వం అర్థ‌మైంది. అత‌ను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు.

ఇది విని నేను చాలా సేపు షాక్‌లో వుండిపోయా.

అత‌నెవ‌రో తెలియ‌దు, ఎప్పుడూ చూడ‌లేదు. కానీ అలా జ‌రిగి వుండ‌కూడ‌ద‌ని ఆశ‌.

ఆ ఒక్క‌రోజు ఆమె ఏదో అనారోగ్యంతో సెల‌వు పెట్ట‌కూడ‌దా? ఆఫీస్‌కి వెళుతున్న కారుకి చిన్న యాక్సిడెంట్ జ‌రిగి ఆస్ప‌త్రిలో చేరి వుండ‌కూడ‌దా? ఏమీ జ‌ర‌గ‌లేదు.

జీవిత‌మ‌నే రేసులో అదృష్టం కంటే దుర‌దృష్ట‌మే చాంఫియ‌న్‌.

ఎక్క‌డో ఆప్ఘ‌న్‌లో జ‌రిగిన కుట్ర‌, అమెరికా ప్ర‌పంచ దురాశ‌, ఆ కుటుంబం ఆనందాన్ని శాశ్వ‌తంగా ఆవిరి చేసింది. వీళ్లు తెలుసు. తెలియ‌ని వాళ్లు కొన్ని వేలు.

నెత్తి మీద ఉన్న ఆకాశం కుప్ప‌కూలుతున్న‌ప్పుడు , ఆమె ఎంత బాధ అనుభ‌వించిందో!

ఆల్‌ఖైదా , తాలిబ‌న్‌, ఐసిస్ ఎక్క‌డో వుంటాయ‌నుకుంటాం.

ప్ర‌పంచం చాలా చిన్న‌దై పోయింది. మ‌న ఇంటి త‌లుపు కూడా త‌ట్టొచ్చు.

Also Read : WTC ట్విన్ టవర్స్,లాడెన్,సద్దాం,ఐసిస్ ,మళ్ళీ తాలిబన్- 20 ఏళ్ళలో జరిగింది ఇదే