Idream media
Idream media
బాలీవుడ్ నటి కంగన నాకు భలే నచ్చేసింది. క్వీన్ సినిమా చూసి ఆమె అభిమానిగా మారిన వాళ్లలో నేనూ ఒకన్ని. నటనే కాదు, జ్ఞానం కూడా ఆమెకి ఎక్కువే. పద్మశ్రీ ఇచ్చిన మోడీ ప్రభుత్వానికి అభినందనలు. చరిత్రని కొత్తగా అర్థం చేసుకున్న వాళ్లే పద్మశ్రీకి అర్హులు. నిజానికి చరిత్ర అనేది భ్రాంతి. మనం ఎక్కడ నుంచి మొదలు పెడితే అదే చరిత్ర. తనకి పద్మశ్రీ ఇచ్చిన వాళ్లే కంగనాకి చరిత్ర. మనకి ఒకరు ఇచ్చినపుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి కదా.
స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని కంగన అభిప్రాయం. స్వాతంత్ర్యం ఇంత వరకూ రానే లేదని నా అభిప్రాయం. నేను సెలబ్రిటీని కాదు కాబట్టి నా అభిప్రాయానికి విలువ లేదు. మనం ఇంత కాలం 1947లో వచ్చిందని అనుకుంటూ సంబరాలు చేసుకున్నాం. దేశ ప్రజలందరి మీద రికవరీ యాక్ట్ ప్రయోగించాలని నా విన్నపం.
ఎందుకంటే నేను స్కూల్ దశలో కనీసం 10 సంవత్సరాల పాటు స్వాతంత్ర్యం అని పాటలు పాడుతూ ప్రభుత్వం వారు ఇచ్చిన చాక్లెట్లు తిన్నాను. కొంత మంది అమాయకులు డ్యాన్స్‌లు చేసి నాటకాలు ఆడి దేశభక్తిని ప్రకటించారు. జర్నలిస్టు అయిన తర్వాత వేడుకలు మానేశాను. జర్నలిజం, బానిసత్వం రెండూ ఒకటే. కంగనా ప్రకారం దేశానికి 2014లో అయినా స్వాతంత్ర్యం వచ్చింది. జర్నలిస్టులకి ఎప్పటికీ రాదు.
పాయింట్ ఏంటంటే 1947 నుంచి ఇప్పటి వరకూ స్వాతంత్ర్య వేడుకల పేరుతో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో అదంతా లెక్కలు తీయండి. ఇండిపెండెన్స్ రికవరీ చట్టం తెచ్చి , ఒక శాఖను ఏర్పాటు చేస్తే కొంత మందికి ఉపాధి లభిస్తుంది. అదనంగా ఒక కేంద్రమంత్రి వస్తాడు.
నోట్ల రద్దు, కరోనా, పెట్రోల్ ధరల్ని తట్టుకున్న జనానికి ఇదేమి లెక్క కాదు. జన్‌ధన్ ఖాతాలో డబ్బులు పడతాయని ఆశ పడుతున్న జనానికి అకౌంట్‌లోని డబ్బు మాయం చేస్తే తప్ప బుద్ధి రాదు. నాలాంటి మంచి వాళ్లు స్వచ్ఛందంగానే లెక్కలు చెబుతారు. పదేళ్ల పాటు ఎన్ని చాక్లెట్లు తిన్నానో నాకు గుర్తుంది. చాక్లెట్స్ అంటే ఇప్పటిలా క్యాడ్‌బరీస్ కాదు, గులకరాళ్లు. పంటి కింద కటకటమని సంగీతం పలికేది. చిన్నప్పుడు ఈ చాక్లెట్ల వల్ల ఆగస్టు 15 నాడు రెండు పళ్లు ఊడిపోయాయి. స్వాతంత్ర్యం అంటే ఉన్నది ఊడగొట్టడమే.
కంగనా బంగారం చెప్పిన ముత్యపు పలుకుల్లో స్వాతంత్ర్యం భిక్ష అని. మనది బుద్ధుడు పుట్టిన దేశం. భవిష్యత్‌లో చైనా, బర్మా వాళ్లతో గొడవలు లేకుండా ఉండడానికి బుద్ధున్ని కూడా దశావతారాల్లో మన పెద్దలు చేర్చేశారు. కంగనాకి ఇష్టమైతే మోడీని 11వ అవతారంగా చేర్చుకోవచ్చు. అపుడు దాదాసాహెబ్ ఇచ్చినా ఇస్తారు.
అనుకూలురికి ఇచ్చుకోడానికి కాకపోతే అవార్డులున్నది ఎందుకు? బుద్ధిజంలో భిక్ష అనే పదానికి చాలా విలువ ఉంది. ఉచితంగా వచ్చే వాటిని మనం ఎక్కువగా ఇష్టపడడం వెనుక ఒక భౌద్ధిక దృష్టి వుంది.
స్వాతంత్ర్యం పోరాడి తెచ్చుకున్నది కాదు- గాంధీ తాత ఈ మాటలు వింటే సమాధిలోంచి లేచి వచ్చి కంగనాకి దండం పెట్టి మళ్లీ వెళ్లిపోయేవాడు. కంగనా లాగే నాకు ఈ అనుమానం వుంది. గాంధీ తాత , సినిమాల్లో రైతులా ఎప్పుడూ కర్ర పట్టుకుని తిరిగే వాడు కదా, మరి అదే కర్రతో బ్రిటీష్ వాడి నెత్తిన నాలుగు తగిలిస్తే వాడే భయంతో ఓడ ఎక్కి లండన్ పారిపోయేవాడు కదా! ఈ విషయం తెలియక కర్ర పట్టుకుని వేగంగా నడుస్తూ ఉప్పు సత్యాగ్రహం చేయడం దండగ కదా! ఈ కాలం పిల్లలు వింటే నవ్వుతారు. ఉప్పు ప్యాకెట్లలో దొరుకుతున్నప్పుడు సముద్రం దగ్గర దీక్ష చేయడం ఎందుకు?
గాంధీ తాత కర్రసాము చేయకుండా దీక్షలు చేయడం వల్ల తర్వాతి తరం నాయకులకి కష్టాలు తెచ్చాడు. వీళ్లు తినకుండా వుండలేరు, దీక్షలు మానలేరు.
ఇండియా , పాకిస్తాన్ మధ్య రేఖని గీయడానికి తెల్లవాడు ఎందుకు? మన వాళ్లు లేరా అని కంగనా ప్రశ్న. మనల్ని పాకిస్తాన్ నమ్మదు. పాక్‌ని మనం నమ్మం. ఇద్దరూ నమ్మేది తెల్లవాన్నే కదా. వాడైతే న్యాయంగా కోస్తాడు.
అయినా ఇద్దరి రైతుల భూమిని సర్వే చేయడమే మనవాళ్లకి సరిగా రాదు. గొడవలు పెడతారు. మరి రెండు దేశాల గట్టు తగాదా చేతనవుతుందా? విభజన రేఖ తెల్లవాడు గీసాడు కాబట్టి తక్కువ యుద్ధాలు జరిగాయి. మనం గీసి వుంటే ఎండా కాలం , వానా కాలంలా యుద్ధకాలం వుండేది.
కంగనా 1857 తిరుగుబాటే అసలు పోరాటమని చెప్పింది. సినిమా వాళ్లు కూడా పుస్తకాలు చదువుతారంటే నాకు కళ్లు చెమర్చి ఆనంద భాష్పాలు వచ్చాయి. గూస్‌బంప్స్ అంటారే అవి కూడా. 1857లో జరిగింది రాజులు, సంస్థానాదీశుల పోరాటం. ప్రజల ప్రమేయం లేదు. ప్రజలకి సంబంధం లేనిదే నిజమైన పోరాటమని నేను నమ్ముతాను.
నీ మాటలు నిజం కాకపోతే పద్మశ్రీ వెనక్కి ఇస్తాను అన్నావు. ఎందుకు తల్లీ, వెనక్కి ఇస్తేనేం, ఉంచుకుంటేనేం, విలువ నీకు కానీ, పద్మశ్రీకి కాదు కదా! నీకు తెలుసో లేదో 1961లో అధికారులు పొరపాటు పడి లాజరస్ అనే పేరున్న ఇద్దరికి పద్మశ్రీ ఇచ్చారు. పేరు తెచ్చుకుంటేనే పద్మశ్రీ రాదు. పేరు పొరపాటు పడినా వస్తుంది. ఏమైనా కంగనమ్మా కళ్లు తెరిపించావు. నీదే నిజమైన దేశభక్తి.
Also Read : Taathamma Kala : రెండు నెలలు నిషేధానికి గురైన NTR సినిమా – Nostalgia