iDreamPost
android-app
ios-app

గణపతి లడ్డూను వేలం పాటలో కొన్న ముస్లిం సోదరుడు

గణపతి లడ్డూను వేలం పాటలో కొన్న ముస్లిం సోదరుడు

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం సందడి సందడిగా సాగిపోతుంది. ట్యాంక్ బండ్ వద్దకు గణపతి విగ్రహాలు క్యూ కడుతున్నాయి. డప్పుల మోత, డీజీల హోరులతో యువతీ, యువకులు ఊగిపోతున్నారు. కుల, మత, జాతి బేధాలను మరచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గణేశుని శోభయాత్ర శోభయామానంగా కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ నిమజ్జనానికి కదిలి వెళుతున్న వినాయక విగ్రహాలే కనిపిస్తున్నాయి. పోలీసులు గట్టి బందో బస్తు ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మరో వైపు గణపతి లడ్డూలు కూడా రికార్డు స్థాయి ధరలు పలికాయి. బండ్లగూడ జాగీర్‌లోని రిచ్ మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం లడ్డూను కోటి 26 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన లడ్డూగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఇక బాలాపూర్ లడ్డూ సైతం రూ. 27 లక్షలు పలికింది. అలాగే మాదాపూర్ మై హోం భుజాలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డు కూడా 25.50 లక్షలకు పలకడం విశేషం. అయితే లడ్డూ వేలంలో మత సామరస్యానికి వేదికగా నిలిచింది శంకర్ పల్లి. ఈ మున్సిపాలిటీ పరిధిలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన ఓ ముస్లిం సోదరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాహేర్ అలీ.. అక్కడి వినాయక విగ్రహానికి చెందిన లడ్డూను వేలంలో రూ. 23,100కు దక్కించుకున్నాడు. తాహేర్ అలీ మాట్లాడుతూ.. వినాయకుని కృప దేశ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి మెలిస ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.