జామియా విద్యార్ధులపై కాల్పుల కలకలం

  • Published - 12:48 PM, Thu - 30 January 20
జామియా విద్యార్ధులపై కాల్పుల కలకలం

ఢిల్లీలోని జామియా ప్రాంతంలో సిఎఎ ( పౌరసత్వ సవరణ చట్టం) కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డ స్టూడెంట్ ని వెంటనే ఆసుపత్రి లో చేర్చారు. కాగా ఆందోళనకారులపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే ఈరోజు మధ్యాహ్నం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌కు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు రాజ్‌ఘాట్ వైపు ర్యాలీగా నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భంగా ఉన్నట్టుండి హఠాత్తుగా నల్ల జాకెట్ వేసుకున్న ఒక వ్యక్తి పోలీసుల వలయాన్ని దాటుకొని వచ్చి “కిస్కో చాహియే అజాది?.. మెయిన్ దుంగా ఆజాది.. (ఎవరికి స్వేచ్ఛ కావాలి.. నేను వారికి స్వేచ్ఛ ఇస్తాను) అని పెద్ద పెట్టున కేకలు వేస్తూ తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో నిరసనకారులపై కాల్పులు జరిపాడు. జామియా ప్రాంతంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన జరిగింది.

వెంటనే తేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుడిని విద్యార్థుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి తన పేరు రామ్ భగత్ గోపాల్ గా, తానూ జీవర్ ప్రాంతానికి చెందినవాడిగా చెప్తున్నప్పటికీ పోలీసులు ఆ వార్తని ఇంకా పూర్తిగా ధ్రువీకరించలేదు. దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని జామియా మిలియా మాస్ కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థి షాదాబ్ నజీర్ గా గుర్తించారు. అతన్ని వెంటనే జామియా ప్రాంతంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు.

పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు, మీడియా సమక్షంలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తుంది. అయితే నిందుతుడు దాడి చెయ్యడానికి ఒక గంట ముందే తన ఫెస్ బుక్ అకౌంట్ లో తానూ నిరసనకారులపై దాడి చేయబోతున్నట్టు పోస్ట్ పెట్టాడని పోలీసుల విచారణ లో తేలింది. గత వారం షాహిన్ భాగ్ లో జరిగిన సంఘటనని మరువకముందే మరలా ఇలాంటి సంఘటన జరగడం పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన విద్యార్థులు పోలీస్ బారికేడ్లను సైతం ఎక్కి తమ నిరసనను తెలిపారు.

Show comments