iDreamPost
android-app
ios-app

దోమలను మూటగట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యాపారి.. ఎందుకంటే..?

దోమలను మూటగట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యాపారి.. ఎందుకంటే..?

ఇంతే ఉంటాయి కానీ.. రాత్రుళ్లు, పగలు అని తేడా లేకుండా నిత్యం మానవులపై దాడి చేస్తుంటాయి. గుయ్ గుయ్ మని తిరుగుతూ.. రక్తం పీల్చుకోవడమే కాదూ.. మానవ జీవితాలను ప్రమాదంలోకి పడేస్తుంటాయి. వీటి కోసం ఎన్ని మందులు తయారు చేసినా, ఎన్ని మిషన్లు వాడినా వీటి సంతతికి తిరుగు ఉండదు. ఇంత ఎలివేషన్ ఇస్తున్న జీవులేంటో ఈ పాటికి మీకు అర్థమైందనుకుంటా. అవే దోమలండీ బాబు దోమలు. నిరంతర శ్రామికుల్లా పనిచేస్తూనే ఉంటాయి. మనమైనా నిద్రపోతాం కానీ అవి నిద్రపోతాయా అని అనుమానం కలగక మానదు. ఇక దోమ కుడితే చివుక్కుమనిపిస్తుందీ కానీ.. ఆ తర్వాత ఎదుర్కొనే పరిణామాలే ఎక్కువ. మానవుల్ని కుట్టే క్రమంలో రక్తాన్ని తాగేయడమే కాకుండా.. మన శరీరంలోకి కొన్ని క్రిములు విడుదల చేస్తాయి. దీంతో రోగాలు, వ్యాధులు వస్తుంటాయి.

దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా వైరస్ వంటి వ్యాధులు వస్తాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో వీటి కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వెళుతున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతుంది. ఓ వ్యక్తి ఈ విషయంపై భయాందోళనకు గురై.. తన కుట్టిన దోమలతో ఆసుపత్రికి వెళ్లాడు. తనకు ఈ దోమలు కుట్టాయని, ముందస్తు పరీక్షలు చేయాలని కోరడంతో డాక్టర్ తో సహా అందరు అవాక్కయ్యారు. ఈ వింత ఘటన పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్దామన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల బెంగాల్‌లో డెంగ్యూ కేసులు ఎక్కువ కావడంతో భయపడ్డ మంగళకోట్‌కు చెందిన చిరు వ్యాపారి మన్సూర్ అలీ షేక్.. తనను కుట్టిన దోమల్ని చంపి.. వాటిని ప్లాస్టిక్ కవర్‌లో వేసుకుని వాటిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి.. పాలిథిన్ సంచిలో వేసుకుని వెళ్లాడు. వైద్యుడి చూపి.. ఈ దోమలు తనను కుట్టాయని, ఈ దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. తన దుకాణం చుట్టూ నీరు నిలిచిపోయిందని, అక్కడ దోమలు పెరుగుతున్నాయని, అవి తనను కుట్టాయని, భయమేసి.. వాటిని కవర్లో వేసుకుని తీసుకువచ్చానని చెప్పడంతో వైద్యుడితో సహా ఆసుపత్రి సిబ్బంది మంది ఆశ్చర్యపోయారు. అలాగే తన ప్రాంతంలోని డ్రెయిన్‌ను వెంటనే శుభ్రం చేయాలని కోరారు. ఈ ఘటనపై మంగళ కోట్ పంచాయతీ సమితి మత్స్య అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.