iDreamPost
android-app
ios-app

పర్సులో భారీ అమౌంట్.. నిజాయితీ చాటుకున్న విద్యార్థి

పర్సులో భారీ అమౌంట్.. నిజాయితీ చాటుకున్న విద్యార్థి

నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అందుకే చిన్నప్పుడే వారిని సన్మార్గంలో నడిపించేలా కృషి చేయాలి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. విద్యాబుద్దులు నేర్పడమే కాకుండా.. ఇతరులకు సాయం చేయడం, సేవా గుణం పిల్లల్లో అలవర్చుకునేలా చేయాలి. బాలలుగా ఉన్నప్పుడే మంచి, చెడు ఏంటనేది ఆలోచించేలా పిల్లల్ని సంసిద్దులను చేయాలి. అప్పుడే భవిష్యత్తులో మంచి పౌరులు తయారు అవుతారు. అలాంటి పౌరుల వల్ల దేశం కూడా బాగుపడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ రోజుల్లో ఏదైనా దొరికితే.. తిరిగి ఇవ్వాలన్న మనస్సు రాదు. కానీ ఆ చిన్నారి మాత్రం అందరిలా ఆలోచించకుండా.. తన నిజాయితీ ప్రదర్శించి.. అభినందనలు పొందాడు. ఇంతకు ఏం జరిగిందంటే..?

శ్రీకాకుళం జిల్లాలోని తాలాడ వెంకటేష్ 8వ తరగతి చదువుతున్నాడు. ఎల్ఎన్ పేట మండలం కొమ్మువలస ప్రభుత్వ పాఠశాలకు తన స్వగ్రామం చిన్న కొల్లివలస నుండి రోజూ నడుచుకుంటూ వెళతాడు. రోజు లాగే స్కూల్‌కు వెళుతుండగా.. రోడ్డుపై పర్సు దొరికింది. దాన్ని తీసి చూడగా.. రూ. 10వేలు, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం కార్డు ఉన్నాయి. పర్సును తీసుకుని అక్కడి నుండి స్కూలుకు వచ్చి.. హెచ్ఎం లలితకుమారికి అందించాడు. వెంటనే ఆ పర్సులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించిన హెచ్ఎం.. ఆ పర్సు గొట్టిపల్లి గ్రామానికి చెందిన కె అప్పన్నదిగా గుర్తించి.. అతడికి సమాచారం అందించారు. అతడికి ఆ పర్సును అందజేశారు. డబ్బుతో ఉన్న పర్సును చూసి కూడా.. నిజాయితీగా తీసుకువచ్చిన వెంకటేష్‌ను స్కూల్ సిబ్బంది అభినందించారు. అలాగే చిన్న బహుమతి కూడా అందించారు.