iDreamPost
iDreamPost
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలందరూ సక్సెస్ అయ్యారు కానీ మెగా డాటర్ నీహారికకు మాత్రం కాలం కలిసి రావడం లేదు. ఇప్పటిదాకా తను నటించిన సినిమాలు ఐదు. మొదటిది ‘ఒక మనసు’ పేరు తెచ్చింది కానీ మాములు ఫ్లాప్ గా నిలవలేదు. రెండోది విజయ్ సేతుపతితో కలిసి తమిళ్ లో ‘ఒరు నల్ల నాల్ పాత్రు సోలెన్’తో ఎంట్రీ ఇస్తే అదీ డిజాస్టర్. సరే అని ముచ్చటగా మూడోది హీరోని డామినేట్ చేసే పాత్రతో ‘హ్యాపీ వెడ్డింగ్’ చేస్తే యువి లాంటి పెద్ద బ్యానర్ కు సైతం అపజయం తప్పలేదు.
ఇక నాలుగోది టైటిల్ రోల్ లో చేసిన ‘సూర్యకాంతం’. ఇది వచ్చినంత వేగంగా రివర్స్ వెళ్ళిపోయినా సినిమా. చాలా మంచిది ఇది వచ్చిందన్న సంగతి కూడా గుర్తులేదు. ఇక లాభం లేదని పెదనాన్న చిరంజీవి ‘సైరా’లో ఓ రెండు మూడు సీన్లున్న చిన్న పాత్ర చేస్తే దానికీ స్పందన లేదు. వసూళ్లయితే వచ్చాయి కానీ దీన్నో హిట్ గా అభిమానులు సైతం చెప్పలేరు. ఇప్పుడు ఆరో పరీక్ష వచ్చిందని ఫిలిం నగర్ టాక్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ఆచార్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో స్పెషల్ రోల్ లో కనిపించే రామ్ చరణ్ చెల్లెలిగా కాసేపు కీలక పాత్రలో కనిపించనుందని వినికిడి.
ఇది యూనిట్ చెప్పింది కాకపోయినా లీకైన న్యూస్ గట్టిగానే వినిపిస్తోంది. పరిమితంగా కనిపించినా ప్రభావం చూపే విధంగా సదరు రోల్ ని డిజైన్ చేశారట. ఇప్పుడు ఆచార్య అయినా తనకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ మధ్య ఫోటో షూట్స్ లో కాస్త పట్టువిడుపుగా ఉంటూ స్టిల్స్ ఇస్తున్న నీహారికకు రెగ్యులర్ హీరోయిన్ అవకాశాలు రావడం అంత సులభం కాదు. ఒకవేళ ఆచార్య హిట్ అయినా అందులో సిస్టర్ పాత్ర కాబట్టి అలాంటి ఆఫర్సే రావొచ్చు. కరోనా లాక్ డౌన్ అయ్యాక దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావొచ్చు. మే చివరి దాకా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తుండటంతో షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు