iDreamPost
android-app
ios-app

విజృంభిస్తున్న కరోనా.. 678 కొత్త కేసులు నమోదు..

విజృంభిస్తున్న కరోనా.. 678 కొత్త కేసులు నమోదు..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ రోజు శుక్రవారం 678 కేసులో నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,412 కు చేరింది. ఈ ఒక్క రోజే 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద మృతుల సంఖ్య 199 చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా పై బులెటిన్ విడుదల చేసింది.

కరోనా వైరస్ పై ప్రజలు భయపడాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. తద్వారా వారు, వారి కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేస్తే చాలని, అధికారులే వచ్చి ఆస్పత్రికి తీసుకెళతారని భరోసా ఇచ్చారు.

దేశంలో కరోనా పరీక్ష నిర్ధారణ కేంద్రాలు గణనీయంగా పెంచామని లవ్ అగర్వాల్ తెలిపారు. జనవరిలో దేశంలో ఒక ల్యాబ్ ఉండగా.. ప్రస్తుతం 213 ల్యాబులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 146, ప్రైవేటు ల్యాబులు 67 ఉన్నాయని తెలిపారు. నిన్న ఒక్క రోజే 15 వేల శాంపిల్స్ ను పరీక్షించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.40 లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపారు. కరోనా హాట్ స్పాట్ లో ప్రతి ఒక్కరి నుంచి శాంపిల్ తీసుకుని పరీక్ష చేస్తున్నామని లవ్ అగర్వాల్ చెప్పారు.