iDreamPost
android-app
ios-app

సీతారామం విజయానికి 5 కారణాలు

  • Published Aug 09, 2022 | 12:15 PM Updated Updated Aug 09, 2022 | 12:15 PM
సీతారామం విజయానికి 5 కారణాలు

మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఆదరణలో ఏ మాత్రం మార్పు ఉండదని సీతారామం మరోసారి నిరూపించింది. కమర్షియల్ అంశాలు లేకుండా ఒక క్లాసీ లవ్ స్టోరీకి సోమవారం రోజు కూడా హౌస్ ఫుల్స్ పడటం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో సెకండ్ షోలు కూడా జనంతో నిండిపోతున్నాయంటే ఈ చిత్రానికి ఏ స్థాయిలో రీచ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాల్లోనూ కలెక్షన్లు బాగున్నాయి. అసలింతకీ ఇంతటి విజయానికి కారణమైన అయిదు అంశాలేంటో చూద్దాం

1. స్వచ్ఛమైన ప్రేమ

లవ్ స్టోరీ అంటే చాలు ఖచ్చితంగా ముద్దు సీన్లు ఉండాలి, పిల్లలు ఇబ్బంది పడే ఇంటిమసీ ఎపిసోడ్స్ ఉండాలని భావించే న్యూ జనరేషన్ డైరెక్టర్స్ కు చెంపపెట్టులా అందమైన ప్రేమకథను ఎంత హృద్యంగా చూపించవచ్చో దర్శకుడు హను రాఘవపూడి చూపించిన తీరు దీన్ని మాడర్న్ క్లాసిక్ గా మార్చింది. సీతా రామంల మధ్య కనిపించకుండా మొదలైన సున్నితమైన ప్రేమ కఠిన పరీక్షలకు ఎదురీది విధితో పోరాటం చేసే తీరు యువతనే కాదు పెద్దవాళ్లను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

2. ప్రాణం పోసిన తారాగణం

ఒక మలయాళం హీరో అందులోనూ తెలుగు స్వంతంగా డబ్బింగ్ చెప్పకోవడానికి సిద్దపడే వాడితో ఇలాంటి సబ్జెక్టు చేయడమే రిస్క్. అందులోనూ హీరోయిన్ తెలుగమ్మాయి కాదు. అయినా కూడా అసలా ఫీలింగే రాకుండా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తమ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. ముస్లిం యువతిగా రష్మిక మందన్న, ఊహించని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సుమంత్, చిన్న వేషానికి సైతం ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లను తీసుకోవడం దీని స్థాయిని పెంచింది.

3. సాంకేతిక బలం

ఏ దర్శకుడికైనా గొప్ప ఆలోచన రావడం విశేషం కాదు. దాని తెరమీద అదే స్థాయిలో మద్దతు ఇవ్వగల టెక్నికల్ టీమ్ కూడా అంతే అవసరం. దాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. నేపధ్య సంగీతం, పాటలు వేటికవే పోటీ పడటంతో ఫీల్ గుడ్ అనే పదానికి సార్థకత చేకూరింది. విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన వినోద్, శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం ఎన్ని అవార్డులకు అర్హమయ్యిందో చెప్పడం కష్టం. ఆర్ట్ డిపార్ట్ మెంట్ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే.

4. హను మాయాజాలం

ఒక డిజాస్టర్ తర్వాత ఎంతటి డైరెక్టరైనా కథ విషయంలో కొంత తడబాటుకు గురి కావడం సహజం. కాని హను రాఘవపూడి తాను ఈ శైలిని భిన్నమని ఋజువు చేశారు. సబ్జెక్టుని నమ్మి దాన్ని నిజాయితీగా తెరకెక్కించేందుకు మాత్రమే కట్టుబడ్డారు. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం నేపధ్యాన్ని తీసుకుని దానికి మరో ముప్పై ఏళ్ళ పూర్వపు ఫ్లాష్ బ్యాక్ ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించిన తీరు స్మార్ట్ ఫోన్ జెనరేషన్ ని మెప్పించిందంటే ఆయన ప్రతిభ గురించి చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?

5. వైజయంతీ విజయం

ఒకప్పుడు విజువుల్ గ్రాండియర్స్ గా పేరుపొందిన వైజయంతి బ్యానర్ వారసత్వాన్ని అందుకున్న స్వప్న ప్రియాంకలు దాన్ని తమ కొత్త తరం ఆలోచనలతో నడిపిస్తున్న తీరు అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు ఇప్పుడీ సీతారామంలు ఏవీ వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోలతో తీసినవి కాదు. అయినా ప్రేక్షకుల బ్రహ్మరథం అందుకున్నాయి. ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాణ సంస్థగా తమ రెండో ప్రస్థానాన్ని స్వప్న సినిమా కొనసాగిస్తున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకం.