iDreamPost
iDreamPost
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన కార్మికచట్టాలు జులైన1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉద్యోగి శ్రేయస్సు కోసం సవరించిన కార్మిక చట్టం ప్రకారం, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయనుంది.
కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చిదంటే, ఉద్యోగులు, వారు పనిచేస్తున్న సంస్థల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఉద్యోగోలకు మంచి పనివేళలు, భద్రత రానున్నాయి. అంతేకాదు, ఉద్యోగి జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఒకవేళ ఉద్యోగి కంపెనీని విడిచిపెట్టాలనుకొంటే, తుది సెటిల్‌మెంట్ పరంగానూ చాలామార్పులు రానున్నాయి.
జీతం తగ్గుతుందా?
కొత్త లేబర్ కోడ్ జీతానికి కొత్త నిర్వచనం ఇవ్వనుంది. ఇక మీదట జీతం తగ్గుతుంది. అన్ని కటింగ్స్ పోను వచ్చే జీతం, పీఎఫ్ కు మీరు కట్టే మొత్తం కూడా మారనుంది. కొత్త రూల్స్ ప్రకారం, మొత్తం శాలరీలో బేసిక్ శాలరీ సగం ఉండాలి. అంటే అలెవెన్సులు 50శాతానికి మించకూడదు. ఇప్పటిదాకా బేసిక్ శాలరీ తక్కువ, అలవెన్స్ లు ఎక్కువ. అందువల్ల సంస్థలు పిఎఫ్ కట్టేది చాలా తక్కువగా ఉండేది. ఇక మీదట ఈ మొత్తం పెరగబోతోంది. అంటే చేతికొచ్చే మొత్తం తగ్గుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవాళ్ల జీతం, ఆమేరకు తగ్గుతుంది. కాని, రిటైర్మెంట్ కి పెద్ద మొత్తంలో పిఎఫ్, గ్రాట్యూటీ చేతికి వస్తుంది.
నాలుగురోజులే పని
వారానికి 48 గంటలకు మించి పనిచేయకూడదు. మీరు రోజుకు 12 గంటలు పనిచేస్తామని ఒప్పుకుంటే మీరు నాలుగు రోజులు పనిచేస్తే సరిపోతుంది. అప్పుడు మీకు వారానికి మూడు సెలవులు వస్తాయి. లేదు ఎనిమిది గంటలే పని చేద్దామనుకొంటే వారానికి ఒక్కరోజే ఆఫ్.
యేటా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
వేతనాలతో పాటు, ఉద్యోగుల సెలవు విధానాన్ని కేంద్రం మార్చింది. సంస్థలో ఒక ఉద్యోగి ఉపయోగించని సెలవులను ఏటా ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కంపెనీ నుండి బైటకెళ్లిన తర్వాతే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేసేవారు. ఇప్పుడు యేటా ఆదాయం రానుంది.
రెండురోజుల్లోనే ఫైనల్ సెటిల్మెంట్
ఒక ఉద్యోగి రాజీనామా చేశాడు. లేదంటే సంస్థే అతన్ని వద్దనుకుంది. అప్పుడు కంపెనీ నుంచి బైటకెళ్లిన రెండు పనిదినాలులోపు, జీతం చెల్లించాలని కొత్త లేబర్ కోడ్ ఆదేశించింది. ఇప్పటిదాకా, చివరి సెటిల్‌మెంట్‌కు కొన్ని సంస్థల్లో నెలల సమయం పడుతోంది. కొత్త కార్మిక చట్టం ఇక రెండురోజుల్లో ఉద్యగికి ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సిందే.