ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక ప్రత్యేకమైన అత్యవసర స్థితి. ఇలాంటి సంక్షోభ స్థితిలో అందరిలా కాకుండా కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే గొప్ప నిర్ణయాలు తీసుకోగలరు. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకుని ఒడిస్సా ముఖ్యమంత్రి వార్తల్లో నిలిచారు.
ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డాక్టర్లకు,హెల్త్ వర్కర్స్ కు నాలుగు నెలల అడ్వాన్స్ శాలరీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒడిస్సా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు,హెల్త్ వర్కర్స్ చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు.. వారు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు నవీన్ పట్నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం ఉపకరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి డాక్టర్లు, హెల్త్ వర్కర్స్ రేయింబవళ్లు కష్టించి పని చేస్తున్నారు. వారి సేవలను గుర్తించి ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
మా డాక్టర్లు, పారామెడిక్స్, హెల్త్ కేర్ వర్కర్లు ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య సజావుగానే సేవలు అందిస్తూ రక్షణ రంగంలో మొదటి వరుసలో ఉన్నారని వారి సేవలను ప్రశంసిస్తూ ఒక వీడియో సందేశంలో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.
అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇదేవిధంగా డాక్టర్లకు హెల్త్ వర్కర్స్ కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.