Swetha
కన్నుల పండుగగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో రామయ్య మందిరానికి కొన్ని వేల కానుకలు వస్తున్నాయి.
కన్నుల పండుగగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో రామయ్య మందిరానికి కొన్ని వేల కానుకలు వస్తున్నాయి.
Swetha
భారతదేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా ఆ రాముల వారి నామ స్మరణే జరుగుతుంది. ఎంతో మంది రామ భక్తులు ఈ మహత్తర తరుణం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ బాల రాముడు కొలువుతీరబోయే సమయం దగ్గరలోనే ఉంది. అందరి కలలు నెరవేర్చడానికి.. జనవరి 22 న బాల రాముని రూపంలో తన జన్మ భూమిలో ప్రతిష్టింపబడుతున్నాడు. ఇప్పుడు యావత్ భారతీయుల మనస్సు అయోధ్యలో కొలువుతీరబోయే రామ చంద్రుని మీదే ఉంది. ఈ క్రమంలో దేశ నలుమూలల నుంచి అయోధ్య రామ మందిరానికి.. వేల సంఖ్యలో కానుకలు తరలి వస్తున్నాయి. ఆ రామయ్య తండ్రికి తమ ప్రేమ కలబోసిన కానుకలను సమర్పించుకుంటున్నారు భక్తులు. ముఖ్యంగా కేవలం సీతమ్మ జన్మస్థలం నుంచి మాత్రమే.. మూడు వేలకు పైగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి.
జనకుని కుమార్తె , శ్రీ రాముని ధర్మ పత్ని అయిన.. సీతమ్మ వారి జన్మస్థలం నుంచి రాములవారికి వేల సంఖ్యలో కానుకలు అందుతున్నాయి. సీతమ్మ వారి జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్. సీతమ్మ వారి జన్మస్థలం నుంచి వచ్చిన 3 వేలకు పైగా బహుమతులలో .. వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు ఇలా ఎన్నో రకాల ఆభరణాలు అట్టహాసంగా అయోధ్య రామ మందిరానికి చేరుకున్నాయి. శ్రీలంకకు చెందిన బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను తీసుకొచ్చింది. ఇక గుజరాత్‌లోని వడోదర వాసి అయిన.. విహా భర్వాడ్ 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న అగర్‌బత్తీని తయారు చేశారు. దీని బరువు 3610 కిలోలు ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటికే ఇది రామ మందిరానికి చేరుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 44 అడుగుల పొడవైన కంచు ధ్వజ స్తంభం, మరో 6 చిన్న ధ్వజ స్తంభాలను తీసుకుని మరి కొంత మంది భక్తులు అయోధ్యకు బయలుదేరారు.
అంతే కాకుండా హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి అనే వ్యక్తి.. తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం బంగారు పూత పూసిన పాదుకలను రామయ్యకే సమర్పించాడు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన మరో వ్యక్తి అరవింద్ భాయ్ మంగళ్ భాయ్ పటేల్. ఇతను ఒక రైతు .. ఈయన ఏకంగా 1100 కిలోల భారీ దీపాన్ని తయారు చేసి అందించారు. ఈ భారీ దీపాన్ని బంగారు, వెండి, రాగి, జింక్, ఇనుముతో తయారుచేసినట్టు ఆయన తెలిపారు. ఇంకా ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ 400 కిలోల బరువైన తాళాన్ని రామ మందిరానికి పంపించారు. అలాగే జలేసార్‌లో 2100 కిలోల బరువున్న భారీ గంటను తయారు చేసి.. రామ మందిరానికి బహుకరించారు. ఈ గంటను మొత్తం ఎనిమిది లోహాలతో తయారు చేసినట్టు తెలిపారు.
మరోవైపు లక్నోలోని ఒక కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు.. ప్రత్యేకంగా ఓ గడియారాన్ని తయారు చేశారు. అందులో ఒకేసారి 8 దేశాల సమయం కనిపిస్తుందట. భారతీయ కాలమాన సమాయంతో పాటు.. జపాన్, రష్యా, దుబాయ్, చైనా, సింగపూర్, మెక్సికో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ ప్రాంతాల్లో ఉండే సమయాన్ని ఆ గడియారం చూపిస్తుందట. ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు.. ప్రసాదంగా పంపిణీ చేసేందుకు లక్ష లడ్డూలను పంపిస్తామని.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. వీటితో పాటు గుజరాత్‌లోని సూరత్‌లో ప్రత్యేకమైన చీరను తయారు చేసి అయోధ్యకు పంపిస్తున్నారు. ఆ చీర మీద శ్రీరాముడు, అయోధ్య రామాలయం బొమ్మలను ముద్రించారు. ఇలా దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్య రామయ్య మీద కానుకల వర్షం కురిపిస్తున్నారు. మరి, అయోధ్య రామ మందిరానికి చేరుకుంటున్న కానుకలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.