iDreamPost
android-app
ios-app

బస్సు యాత్ర జరుగుతుందా ?

బస్సు యాత్ర జరుగుతుందా ?

అమరావతి పరిరక్షణ సమితికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాకిచ్చారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ జేఏసీ తలపెట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీఏతో పాటు పోలీసుల నుంచి అనుమతి లేకపోవటంతో బస్సులను కదలనివ్వబోమని తేల్చి చెప్పారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఈయాత్ర తలపెట్టింది జేఏసీ. అమరావతి రాజధాని ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 5 బస్సులతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు.

గత రాత్రి బెంజి సర్కిల్ నుంచి ఈ బస్సుయాత్రను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. ఐతే అనుమతులు లేకపోవడంతో అడ్డుకున్నారు.. దీనికి నిరసనగా పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించిన చంద్రబాబు, ఇతర నేతలు, జేఏసీ ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు రెండుగంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం రాత్రి జరిగిన ఈ పరిణామాలతో విజయవాడలో
హైటెన్షన్‌ నెలకొంది. JAC కార్యాలయాన్ని బెంజ్‌ సర్కిల్‌లో బుధవారం చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన బస్సుయాత్ర ప్రారంభించాల్సి ఉంది.
రాత్రి 7.30 గంటలకు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, అమరాతి జేఏసీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. అరగంటకుపైగా అందరూ రోడ్డుపైనే కూర్చుండిపోయారు. వెంటనే సమాచారం తెలుసుకుని లోకేశ్‌, టీడీపీ కార్యకర్తలు, అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీపీఐ నేత రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ జెడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, అమరాతి జేఏసీ నేతలు ఉన్నారు.

బస్సులను కావాలని అడ్డుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబును ఆసుపులోకి తీసుకోవటాన్ని నిరసిస్తూ
మందడం గ్రామాల్లో టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు.
JAC నేత తిరుపతి రావు మాట్లాడుతూ
రేపు నిర్వహించదలిచిన ప్రతి కార్యక్రమం జరుగుతుందని, వాటిని అడ్డుకోవటానికి పోలీసులు అప్రజా స్వామికంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు .సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ
అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని,ఎంత అణచాలంటే అంత ఉవ్వెత్తున పోరాటాలు చేస్తామన్నారు.అరెస్టులు చేసినా , జైళ్ళలో పెట్టినా ఉద్యమాలను ఆపమన్నారు. మొత్తం మీద పోలీసులు బస్సు యాత్రను అడ్డుకొని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయినా సరే వారంతా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తామని చెప్తున్నారు. ఒకవైపు ఈ బస్సు యాత్ర కోసం సిద్ధం చేసిన బస్సులను పోలీసులు కూడా సీజ్ చేశారు ఈ పరిణామాల్లో బస్సు యాత్ర జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.