Idream media
Idream media
సోషల్ స్టడీస్ సబ్జెక్టు కోసమో, పోటీ పరీక్షల కోసమో రాష్ట్రాలు వాటి రాజధానులు, దేశాలు వాటి రాజధానులు అని విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. ఒక రాష్ట్రానికి లేదా దేశానికి ఒక రాజధాని నగరం ఉంటుందని చట్ట సభలు అత్యున్నత న్యాయస్థానం, సచివాలయం అన్నీ అక్కడే ఉంటాయని భావించడం సహజం. అందుకే మొన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ అమరావతిలో, సచివాలయం విశాఖలో, హైకోర్టు కర్నూలులో అంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగింది.
అయితే మనదేశంలోనో 14 రాష్ట్రాల హైకోర్టులు ఆయా రాష్ట్రాల రాజధాని నగరాలలో కాకుండా మరో చోట ఉన్నాయి.
రెండు లేదా ఎక్కువ రాజధానులు ఉన్న దేశాలు
ప్రపంచంలో ఒకటికన్నా ఎక్కువ రాజధాని నగరాలున్న దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవలసింది నెదర్లాండ్స్. రాజ్యాంగం ప్రకారం ఆమ్ స్టర్ డామ్ రాజధాని అయినా కొన్ని వందల సంవత్సరాల నుంచి పార్లమెంటు హేగ్ నగరంలో ఉంది.
ఆఫ్రికాలోని చిన్న దేశాలైన ఐవరీకోస్ట్, బెనిన్ దేశాలకు కూడా రెండు రాజధానులు ఉన్నాయి. ఈ దేశాలలో పెద్ద నగరాలైన యామోసోక్రో, పోర్టో నోవోలు అధికారిక రాజధానులు అయినా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఐవరీ కోస్టులో అబిజాన్ నగరంలో, బెనిన్ దేశంలో కోటోనౌ నగరాల నుంచి నడుస్తాయి.
దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ దేశం ఆవిర్భావం నుంచి రాజధాని నగరంగా శాంటియాగో ఉండేది. అయితే అధికార వికేంద్రీకరణ కోసం 1990లో వాల్పరైసో నగరాన్ని రెండవ రాజధానిగా ప్రకటించారు. యూరోప్ దేశమైన జార్జియాలో ఎగ్జిక్యూటివ్ రాజధాని తిబిలిసి అయితే, లెజిస్లేటివ్ రాజధాని కుటైసి.
మలేషియా దేశానికి మొదటి నుంచి కౌలాంలంపూర్ రాజధాని నగరంగా ఉంటే, అది బాగా రద్దీగా అయిందని 1999లో పుత్రజయ అని రెండవ రాజధాని నగరం నిర్మించి కొన్ని కార్యాలయాలు న్యాయస్థానాలు అక్కడికి తరలించారు. ఆసియాలోని మరో దేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి అధికార వికేంద్రీకరణ కోసం కొత్తగా సెజోంగ్ అనే రాజధాని నగరం నిర్మించి పాలనా యంత్రాంగం అక్కడికి 2012లో తరలించారు. మన పొరుగున ఉన్న శ్రీలంకలో కూడా రాజధాని కొలంబో నగరం ఇరుకైపోయినందున గత నాలుగు దశాబ్దాలుగా చట్టసభలు సమీపంలోని జయవర్ధన పురంలో నడుపుతున్నారు.
ఆఫ్రికాలోని స్వాజిలాండ్ 1968లో స్వాతంత్య్రం పొందినప్పటినుంచీ రెండు రాజధానులు కలిగి ఉంది. చట్టసభలు లొబాంబే నగరంలో, సచివాలయం ఎంబాబ్నే నగరంలో ఉన్నాయి. మరో అఫ్రికా దేశమైన టాంజానియాకి మొదటి నుంచి దారూసలామ్ రాజధానిగా ఉంటే, అది ఒక మూలగా ఉందని 1973లో దేశం మధ్యలో ఉన్న దోదోమా నగరానికి ప్రభుత్వాన్ని తరలించారు. అయితే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు దారూసలామ్ లోనే ఉండిపోయి అది రెండవ రాజధానిగా నడుస్తోంది.
ఇక దక్షిణాఫ్రికా అయితే మూడు రాజధానులతో ఉంది. చట్టసభలు కేప్ టౌన్ నగరంలో, సుప్రీంకోర్టు బ్లూమ్ ఫోంటైన్ నగరంలో, సచివాలయం ప్రిటోరియాలో ఉన్నాయి. దేశంలో ఉన్న వివిధ వర్గాలకు సమన్యాయం చేయాలని ఈ అరేంజ్ మెంట్ చేశారు.
ఈ ఉదాహరణలు గమనిస్తే రాజధాని వికేంద్రీకరణ అన్నది అసాధారణమైన విషయం కాదని అర్ధమౌతుంది. అందులోనూ ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత, సమాచార సాధనాలు, ఈ-గవర్నెన్స్ లాంటి సదుపాయాలతో అధికార వికేంద్రీకరణ అన్నది ఒక సమస్య కాబోదు.