iDreamPost
android-app
ios-app

బాబుకి అమ‌రావ‌తి బూమ‌రాంగ్, యూట‌ర్న్ కి సిద్ధం..!

  • Published Dec 22, 2019 | 2:38 AM Updated Updated Dec 22, 2019 | 2:38 AM
బాబుకి అమ‌రావ‌తి బూమ‌రాంగ్, యూట‌ర్న్ కి సిద్ధం..!

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాలుక మ‌రోసారి మ‌డ‌త పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఆయ‌న క‌ల‌ల రాజ‌ధాని విష‌యంలోనే ఖంగుతిన‌క త‌ప్ప‌ని స్థితి దాపురిస్తోంది. దాదాపుగా ఆయ‌న స్వ‌రంలో వ‌స్తున్న మార్పులే అందుకు సంకేతాలుగా ఉన్నాయి. అదే స‌మ‌యంలో తెలుగుత‌మ్ముళ్ళు తీవ్రంగా ఒత్తిడి పెంచ‌డంతో త‌లొగ్గ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఉన్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దాంతో యూట‌ర్న్ బాబుగా పార్ల‌మెంట్ లో మోడీ నుంచి ప‌లువురు నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్టుగా చంద్ర‌బాబు మ‌రోసారి వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి.

ఏపీకి మూడు రాజ‌ధానులు అవ‌స‌రం అవుతాయేమో అంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అసెంబ్లీలో గ‌త మంగ‌ళ‌వారం నాడు చేసిన ప్ర‌క‌ట‌న తాలూకా ప్ర‌కంప‌న‌లు ఇంకా చ‌ల్లార‌డం లేదు. తాజాగా జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్ తో ఈ వ్య‌వ‌హారం మ‌రింత వేడెక్కింది. సీఎం ప్ర‌క‌ట‌న‌, క‌మిటీ రిపోర్ట్ పై అమ‌రావ‌తి వాసులు మండిప‌డుతున్నారు. ఐదు రోజులుగా ఆందోళ‌న‌లు సాగుతున్నాయి. రాజ‌ధాని గ్రామాల్లో ప‌లు చోట్ల నిర‌స‌న‌లు ఎగిసిప‌డుతున్నాయి. 8 గ్రామాల్లో ఉద్య‌మం సాగుతున్న‌ట్టు చెబుతున్నారు. చంద్ర‌బాబు త‌న‌ను న‌మ్మి, భూములు ఇచ్చార‌ని చెబుతున్న రైతులు ఆందోళ‌న చేస్తుంటే క‌నీసం వారికి మ‌ద్ధ‌తుగా నిల‌వడానికి కూడా సిద్ధ‌ప‌డ‌డం లేదు. త‌న నివాసం లింగ‌మ‌నేని ఎస్టేట్స్ కి చేరువ‌లో ధ‌ర్నాలు, దీక్ష‌ల‌కు దిగిన రైతుల‌ను ప‌రామ‌ర్శించిన పాపాన పోవ‌డం లేదు.

చంద్ర‌బాబు అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా వెళ్లాలా లేదా అనే అంశంలోనే టీడీపీ నేత‌ల్లో చీలిక వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నేత‌లంతా టీడీపీ, చంద్ర‌బాబు స‌హా అంద‌రూ ఉద్య‌మంలో భాగ‌స్వాముల‌వుదామ‌ని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఉత్త‌రాంద్ర‌, రాయ‌ల‌సీమ స‌హా మిగిలిన జిల్లాల నేత‌లు మాత్రం స‌సేమీరా అన‌డంతో చివ‌ర‌కు చంద్ర‌బాబుకి ఎటూ పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ సందిగ్ధంలో ఆయ‌న అటు అమ‌రావ‌తిలో కాలుపెట్ట‌లేక‌, ఇటు ఇత‌ర నేత‌ల‌ను కాద‌న‌లేక స‌త‌మ‌తం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో ఉత్త‌రాంద్ర‌కు చెందిన సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావు తో పాటు మ‌రో మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీ మోహ‌న్ వంటి వారు కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు. అధినేత తీరుకి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. వారిద్ద‌రూ బహిరంగంగా ముందుకొచ్చిన‌ప్ప‌టికీ అచ్చెన్నాయుడు వంటి అతి స‌న్నిహితులు, య‌న‌మ‌ల వంటి సీనియ‌ర్లు కూడా విశాఖ రాజ‌ధాని విష‌యంలో వ్య‌తిరేకిస్తే న‌ష్టం త‌ప్ప‌ద‌ని చెబుతున్న‌ట్టు స‌మాచారం. ఇక రాయల‌సీమ విష‌యంలో ఇప్ప‌టికే కేఈ కుటుంబం బాబు తీరుకి భిన్నంగా సాగుతోంది. మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు కూడా అదే బాట‌లో క‌ర్నూలు హైకోర్ట్ ని స్వాగ‌తిస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడా యూట‌ర్న్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. పార్టీలో మెజార్టీ నేత‌లు జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తుంటే చంద్ర‌బాబు కూడా మాట మార్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా అనంత‌పురంలో మీడియా స‌మావేశంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అందుకు అద్దంప‌డుతున్నాయి. ప్ర‌జ‌లంతా ఆలోచించాల‌ని, నాకేమీ ప‌ట్టుద‌ల లేద‌ని, రాజ‌ధాని త‌న‌కోసం కాద‌ని, ప్ర‌జ‌లు ఏది కోరుకుంటే దానిని అంగీక‌రించ‌డానికి తాను ముందుంటాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. త‌ద్వారా మెజార్టీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాజ‌ధాని విష‌యంలో మ‌ళ్లీ మాట మార్చేందుకు ముందుకొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వ ఎత్తుల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు సైతం జ‌గ‌న్ వ్యూహానికి దాసోహం అవుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఇన్నాళ్లుగా బాబుని న‌మ్ముకున్న అమ‌రావ‌తి రైతులు, సొంత సామాజిక‌వ‌ర్గం నేత‌లకు మాత్రం ఈ ప‌రిస్థితి మింగుడుప‌డే అవ‌కాశం లేదు.