‘ఘరానా’ సంచలనానికి 29 ఏళ్ళు – Nostalgia

అసలు మాస్ సినిమా అంటే ఎలా ఉండాలి ?
దానికి కొలమానం ఏమిటి ?
ఏవి ఏ పాళ్ళలో ఉంటే జనం ఆదరిస్తారు ?
ఒక పెద్ద స్టార్ హీరోతో కమర్షియల్ ప్యాకేజీని ఎలా అందించాలి ?

ఇలాంటి ప్రశ్నలు ఎదుగుతున్న దర్శకులకే కాదు స్టార్ డైరెక్టర్లకు సైతం నిత్యం సవాల్ విసురుతూ ఉంటాయి. ఎందుకంటే వీటికి సమాధానం దొరకడం అంత సులభం కాదు. మాస్ నాడిని పట్టుకుని వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని అంశాలు జోడించి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించుకోవడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. అందుకే కథ కూర్చే క్రమం దగ్గర నుంచి సంగీతాన్ని చేయించుకోవడం దాకా ఇక్కడ ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. వీటిని సరిగా ఔపసోన పట్టారు కాబట్టి రాఘవేంద్రరావు గారిని దర్శకేంద్రులు అన్నారు. ఎన్టీఆర్ లాంటి దిగ్గజంతో అడవిరాముడుతో ఒక చరిత్రకు శ్రీకారం చుడితే, మెగాస్టార్ చిరంజీవితో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆ చిత్రం పేరే ‘ఘరానా మొగుడు’

పునాదిపడిన వేళ

1991లో విజయశాంతి తమిళ్ లో సూపర్ స్టార్ రజనికాంత్ తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు. ఖుష్బూ సెకండ్ హీరొయిన్. ఇళయరాజా సంగీతం. నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. పి వాసు దర్శకుడు. సెట్స్ లో ఉండగానే సబ్జెక్టులోని దమ్ము గుర్తించిన ఆవిడ వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి చెప్పి తెలుగు రీమేక్ హక్కులకు దేవివరప్రసాద్ గారికి రికమండ్ చేయించింది. ఆయనా మరో ఆలోచన చేయకుండా వెంటనే కొనేశారు. ఇతర బాషలో ఇలా అండర్ ప్రొడక్షన్ లో ఉన్న మూవీ రైట్స్ ని కొనడం చాలా అరుదు. హీరొయిన్ గా విజయశాంతినే అనుకున్నారు కాని కాల్ షీట్స్ సమస్య వల్ల అవకాశం నగ్మాకు వెళ్ళింది. అప్పటికే తనకు సుమన్ పెద్దింటల్లుడు, నాగార్జున కిల్లర్ మాత్రమే ఖాతాలో ఉన్నాయి. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నగ్మాకు ఏకంగా జాక్ పాట్ తగిలింది. రెండో కథానాయికగా వాణి విశ్వనాథ్ ను ఫిక్స్ చేశారు. నిర్మాత ఇష్టం మేరకు కీరవాణికి మెగా ఛాన్స్ దక్కింది. ఇలా టీం మొత్తం సెట్ అయ్యాక అప్పటికే తెరవెనుక స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న పరుచూరి సోదరులు ఫైనల్ వెర్షన్ ను రెడీ చేశారు.

మార్పులు కూర్పులు

నిజానికి ఇలాంటి లైన్ తో 1980లోనే కృష్ణంరాజు జయప్రదల ‘సీతారాములు’ వచ్చింది. కాకపోతే ట్రీట్మెంట్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికీ కన్నడ రాజ్ కుమార్ సినిమా ‘అనురాగ అరలితు’ స్ఫూర్తి. ఇవన్నీ పక్కన పెడితే మన్నన్ ని బేస్ చేసుకున్నారు కాబట్టి ఆ యాంగిల్ లోనే కథనం రాసుకున్నారు పరుచూరి వారు. అయితే తమిళ్ వెర్షన్ లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. హీరో తల్లికి పక్షవాతం వచ్చాక ఓ పాథోస్ సాంగ్ ని పెట్టారు. దాన్ని తెలుగులో లేపేశారు. తమిళ్ లో హీరోయిజం కొంచెం తక్కువ స్థాయిలో ఉండి ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ డామినేషన్ తో సాగుతుంది. దాన్ని బాలన్స్ చేస్తూ చిరు ఫ్యాన్స్ కి నచ్చేలా బ్రహ్మాండమైన సన్నివేశాలను సెట్ చేసుకున్నారు. 

ఎక్కడా లోపాలు లేకుండా అంతా పర్ఫెక్ట్ అనుకున్నాకే సెట్స్ పైకి వెళ్లాలని ముందే డిసైడ్ అయ్యారు. ఓ సీన్ లో నగ్మా చిరంజీవిని చాచి లెంపకాయ కొడుతుంది. దీన్ని అభిమానులు ఒప్పుకోరేమోనని అందరికి టెన్షన్. అలా చేయకపోతే ఆ దృశ్యం పండదు. మ్యాటర్ చిరు దాకా వెళ్ళింది. పర్లేదు ఉంచండి నాకన్నా కథాబలం ముఖ్యం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ బెంగా తీరిపోయింది. ట్యూన్లు ఒక్కొక్కటిగా ఓకే అయ్యాయి. కీరవాణి తన ప్రాణం పెట్టేశారు. గూస్ బంప్స్ ఇచ్చే మాస్ ఆల్బమ్ కు ముందే ఫిక్స్ అయ్యారేమో అనుకున్న దాని కన్నా అద్భుతంగా వచ్చాయి పాటలు. ఇంకేముంది షూటింగ్ ప్రారంభమైపోయింది. మరోపక్క మన్నన్ కూడా కొనసాగి ఘరానా మొగుడు కంటే ముందు రిలీజై అక్కడ సూపర్ హిట్ అయిపోయింది.

కథగా గొప్పదా

ఇందులో గొప్పదనం నిజంగా కథలోనే ఉంది. పొగరుబోతైన డబ్బున్న భార్యకు మంచితనం దుడుకుతనం మగతనం కలగలిసిన భర్తకు మధ్య జరిగిన సంఘర్షణే ఘరానా మొగుడు. రాజు(చిరంజీవి)అమ్మ ఆరోగ్యం కోసం వైజాగ్ పోర్ట్ లో చేస్తున్న ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చి ఓ అనూహ్యమైన పరిస్థితి వల్ల ఉమాదేవి(నగ్మా)ఫ్యాక్టరీలో చేరతాడు. స్వతహాగా పొగరుబోతైన ఉమాదేవికి రాజు వల్ల ఈగో సమస్య వస్తుంది. దీంతో మొండిపట్టు పట్టి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అలా చేస్తే తన చెప్పుచేతల్లో పడిఉంటాడన్న అంచనా తప్పి రాజు కార్మిక నాయకుడిగా బలంగా ఎదుగుతాడు. ఆఖరికి ఉమాదేవిని స్వంత తండ్రి బాపినీడు(రావు గోపాల్ రావు)తోనే ఛీ కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకుంటుంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న రంగనాయకులు(సత్యనారాయణ), అతని కొడుకు(శరత్ సక్సేనా) ఆమెను, లేబర్స్ ని ప్రమాదంలోకి నెడతాడు. భార్యను, సాటి ఉద్యోగులను రాజు కాపాడుకోవడమే క్లైమాక్స్

దర్శకేంద్రుల మాయాజాలం

ఘరానా మొగుడుకు ప్రాణం రాజు, ఉమాదేవి పాత్రలే. చెప్పుకోవడానికి ఇద్దరు విలన్లు ఉన్నప్పటికీ కథ లీడ్ పెయిర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. రాజు ఉమాదేవి మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ళ వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయడం పరుచూరి వారి తెలివికి మచ్చుతునక. డబ్బున్న మదం నిలువెల్లా నిండిన ఉమాదేవి పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన తీరు, రాజుకి తనకు మధ్య బాండింగ్ ని ఒక క్రమపద్ధతిలో పేర్చిన తీరు మాస్ కి బాగా ఎక్కేసింది. విలన్ పన్నిన కుట్ర వల్ల ఉమాదేవి మీద మెషీన్ పడబోతూ ఉండగా రాజు ఆమెను కిందకు లాగి అనుకోకుండా కౌగలించుకోవాల్సి వచ్చి కాపాడతాడు. వెంటనే రాజు చెంప చెళ్ళుమంటుంది. అక్కడ మౌనంగా ఉన్న రాజు దూసుకొస్తున్న కార్మికులను ఆపి ఒంటరిగా ఉమాదేవి చాంబర్ లోకి వెళ్లి ఒకటికి రెండు దెబ్బలు వేసి లెక్క సరిచేస్తాడు. దానికి సహేతుకమైన కారణం చెప్పిన తీరు అప్పటిదాకా ఆ సీన్ ని తలుచుకుని రగిలిపోతున్న అభిమానుల ఆవేశాగ్నిని భళ్ళున చల్లర్చింది. ఇలాంటి కూర్పు ఘరానా మొగుడులో ఆద్యంతం తారసపడుతుంది.

ఇంత నేర్పైన అల్లిక మన్నన్ లో కనిపించదు. ఒకే టోన్ లో సాగుతుంది. రజని ఇమేజ్ తో పాటు సీనియర్ నటిగా విజయశాంతి పెర్ఫార్మన్స్ చాలా బలహీనతలను కాపాడింది. అందులోనూ పెద్ద హీరోల సినిమాల్లో మెలోడ్రామా ఎక్కువగా ఉన్నా అరవ ప్రేక్షకులు ఆదరిస్తారు. మన దగ్గర అలా కాదు. ఇక్కడి అంచనాలు వేరు. ఆలోచనలు వేరు. వాటికి తగ్గట్టే సాగాలి. వీటిని పట్టించుకోకుండా చిరు చేసిన రుద్రవీణ, ఆరాధన, చక్రవర్తి లాంటి ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అందుకే ఘరానా మొగుడులో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వలేదు. ఈ విషయంలో రాఘవేంద్రరావు గారితో పాటు పరుచూరి సోదరులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధని గమనించవచ్చు. ఒకవేళ మక్కికి మక్కి మన్నన్ ని తీసివుంటే ఈ స్థాయి విజయం సాధించకపోయి ఉండేదన్నది కాదనలేని వాస్తవం. చిరంజీవిలోనే ఎనర్జీని పూర్తిస్థాయిలో వాడుకున్న చిత్రాల్లో ఘరానా మొగుడుది చాలా ప్రత్యేకమైన స్థానం.

ఎవరికెవరు తీసిపోరు

ఇది ఒకరకంగా వన్ మ్యాన్ షో అయినప్పటికీ చిరుకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి. చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతిదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. డాన్సుల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణేలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో అది కిక్ ఇచ్చిందో. శరీరాన్ని స్ప్రింగ్ లా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్ లో నృత్యంతో మైమరిపింపజేయడం ఆయనకే చెల్లింది. ఆ గ్రేస్ ఇప్పటికీ ఇంకొకరిలో తాను చూడలేకపోయానని ప్రభుదేవా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ‘పండు పండు’ పాట క్యాసెట్లు అరిగిపోయేదాకా ప్రతి చోట మోతమ్రోగిపోయింది. ‘ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు’ గురించి చెప్పాలంటే పూనకాలు అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఇలా అన్ని కోణాల్లో చిరు నుంచి బెస్ట్ రాబట్టుకున్న ఘరానా మొగుడు మాస్ సినిమాల రిఫరెన్స్ లో తనకంటూ ఒక పేజీని ప్రత్యేకంగా లిఖించుకుంది.

మూడో తెలుగు సినిమానే అయినప్పటికీ ఈ సినిమాలో నగ్మా చూపించిన పరిణితి తనను ఓవర్ నైట్ స్టార్ ని చేసిందనడంలో అబద్దం లేదు. పొగరుతో మిడిసిపడే సీన్ లోనైనా, కన్నీటితో రాజు తల్లిని మెప్పించే సన్నివేశామైనా, ఇంటర్వెల్ సీన్ లో రాజుని ఛాలెంజ్ చేసే ఎపిసోడ్ లో అయినా చెలరేగిపోయింది. చిరు లాంటి శిఖరం ముందు రాధ, రాధిక, విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ఫైర్ ని తట్టుకుని ధీటుగా నటించేవారు. కాని నగ్మా ఇంత తక్కువ టైంలో అది అందుకోవడంతో ఇంటి బయట నిర్మాతలు క్యు కట్టేలా చేసింది. నగ్మా పాత్ర గొప్పగా పండటంలో సరిత గారి డబ్బింగ్ ని విస్మరించకూడదు. సెకండ్ హీరొయిన్ గా వాణి విశ్వనాథ్ గ్లామర్, పాజిటివ్ పాత్రలో రావుగోపాల్ రావు, రిక్షావాడిగా బ్రహ్మానందం, లేబర్ బ్యాచ్ లో పిఎల్ నారాయణ, చలపతిరావు తదితరులు తలో చేయి తమ నటనతో ఘరానా మొగుడుకి అండగా నిలబడ్డారు.

ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఎక్కడ చూసినా బంగారు కోడి పెట్ట, ఏందిబే పాటలు హోరెత్తిపోయాయి. నేపధ్య సంగీతంలోనూ కీరవాణి తన మార్కు చూపించారు. హీరో ఇంట్రోలో వచ్చే సిగ్నేచర్ బీజీఎమ్ ని రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో కంపోజ్ చేశారు. అది పలు సందర్భాల్లో వచ్చినప్పుడంతా ఒకరకమైన కరెంట్ ఒంట్లోకి వచ్చేదని అభిమానులు చెప్పుకునేవారు. దెబ్బకు కీరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. విన్సెన్ట్ ఛాయాగ్రహణం, విజయన్ మాస్టర్ ఫైట్స్ ఒకదానితో మరొకటి పోటీ పడి ఘరానా అవుట్ ఫుట్ ఇచ్చేసి సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి.

బాక్స్ ఆఫీస్ సునామి

1992 ఏప్రిల్ 9ఏప్రిల్ ….

గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మాసివ్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకుని ఘరానా మొగుడు భారీ ఎత్తున విడుదలైంది. కర్ణాటకలో బెంగుళూరు, బళ్లారిలతో మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో బాపట్ల హైదరాబాద్ దాకా రికార్డుల ఊచకోత మొదలైంది. ఎక్కడ చూసినా కిక్కిరిపోతున్న రద్దీతో పోలీస్ బందోబస్తుతో టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. బ్లాకు టికెట్ రాయుళ్ళ జేబులు గ్యాప్ లేకుండా నిండుతున్నాయి. చూసిన ఫ్యాన్స్ పదే పదే చూస్తూ సామాన్య ప్రేక్షకులు ఘరానా మొగుడు చూడటాన్ని ఆలస్యం చేస్తున్నారు.

ప్రతి షోలో ఈలలు గోలలు. పాటలు వినిపిస్తే ఒట్టు.చిరు డాన్సులకు అభిమాని కానివాడు సైతం మైమరిచిపోయి అలా తెరవైపు నోరు తెరచుకుని చూస్తున్నాడు. ఇక ఫ్యామిలీస్ 50 రోజులు దాటితే కాని చూడలేమనే నిర్ణయానికి వచ్చేశారు. పబ్లిసిటీ యాడ్స్ లో కలెక్షన్ ఫిగర్స్ చూసి ట్రేడ్ మతులు పోయాయి. రెట్టింపు కాదు ఐదింతలు లాభం ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారు. వసూళ్ళ ఉధృతి అంతకంతా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ ప్రభంజనమే మొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో 10 కోట్ల షేర్ ఒక సినిమాకు నమోదు కావడానికి కారణమయ్యింది. అప్పటిదాకా ఏ సౌత్ సినిమాకు అది సాధ్యపడలేదు. ఫిలిం ఫేర్ లాంటి జాతీయ పత్రికలు బిగ్గర్ థాన్ బచ్చన్ అని కవర్ పేజీ హెడ్డింగులు పెట్టి మరీ కవర్ చేశాయి.

రికార్డుల ఊచకోత

ఘరానా మొగుడు 105 ప్రింట్లతో రిలీజ్ చేస్తే 62 కేంద్రాల్లో 50 రోజులు, 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నైజామ్ లో 50 థియేటర్లలో రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇదే. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో రోజూ 4 ఆటలతో 175 రోజులు ఆడింది. గుంటూరులో అనిల్ కపూర్, దాసరి నారాయణరావు ముఖ్య అతిథులుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 4 లక్షల అభిమానుల సమక్షంలో కళ్ళు చెదిరే రీతిలో శతదినోత్సవ వేడుకలు చేశారు. మలయాళంలో హే హీరో పేరుతో లక్ష రూపాయలకు డబ్బింగ్ హక్కులు అమ్మితే ఫుల్ రన్ లో కోటి రూపాయలు వసూలు చేసింది. 4 సెంటర్లలో హండ్రెడ్ డేస్ కూడా ఆడింది.

తమిళ్ లో ఇదే సినిమా నేను మళ్ళీ చేస్తే మన్నన్ కంటే పెద్ద హిట్ అవుతుందని రజనీకాంత్ కామెంట్ చేయడం ఘరానా మొగుడు స్టామినాని చెప్పకనే చెబుతుంది. ఇంతా చేసి ఘరానా మొగుడు తమిళ డబ్బింగ్ హక్కులు కూడా 45 లక్షలకు అమ్ముడుపోయి అక్కడా సూపర్ హిట్ అయ్యింది. అదే మన్నన్ ని తెలుగులో ‘మహారాణి’ పేరుతో అనువదిస్తే ఇక్కడ ఆడలేదు. ఘరానా మొగుడు రేంజ్ ఏంటో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా

అందుకే 29 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఘరానా మొగుడు ఇంకో వంద ఏళ్ళు దాటినా తెలుగు సినిమా ప్రస్థానంలో మాస్ మూవీస్ చాప్టర్ లో సువర్ణాక్షరాలతో తన పేజీని భద్రంగా కాపాడుకుంటూనే ఉంటుంది.

Show comments