Idream media
Idream media
అనూహ్యమైన సంఘటనల వల్ల నష్టం వస్తుందని అనుకున్నా.. కాలం గడిచే కొద్దీ సదరు సంఘటన వల్ల మంచి జరుగుతుందని అందరూ చెప్పే మాట. ముమ్మరంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అనూహ్యంగా ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ వాయిదా వేయడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి. ఎన్నికలు పూర్తయితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవుల్లో ఆశీనులు కావచ్చనుకున్న వారికి ఆశాభంగమే జరిగింది. అయితే ఇలా జరగడం వల్ల వైసీపీ శ్రేణులకు తాత్కాలికంగా నష్టం జరిగినా.. అంతకు మించి మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదు. జనవరి మొదటి వారం వరకూ ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ లోపు కరోనా సద్దుమణిగినా మార్చి, ఏప్రిల్‌లో పాఠశాలలు ఉంటాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదు. మార్చి 31వ తేదీ నాటికి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఏప్రిల్ 1న పదవీ బాధ్యతలు చేపట్టబోయే నూతన ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
జనవరి వరకూ ప్రత్యేక అధికారుల పాలన, ఆ తర్వాత ఏప్రిల్ వరకూ పాఠశాలలు.. మొత్తం మీద మరో 8 ఎనిమిది నెలల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితి ఉంది. ఈ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చక్కగా సద్వినియోగం చేసుకునేందుకు వేగంగా చర్యలు ప్రారంభించింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25కు పెంచుతామని ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకునేందుకు సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే కేబినెట్‌లో 25 జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు కొనసాగింపుగా నాలుగు ఉప సంఘాలు, జిల్లా కమిటీలు, సచివాలయం ఏర్పాటు చేశారు. ఆరు నెలల పాటు ఈ సచివాలయం కొనసాగుతుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల ఏర్పాటుకు అవసరమైన సహాయాన్ని ఈ సచివాలయం, ఉప సంఘాలు, జిల్లా కమిటీలు అందించనున్నాయి.
సచివాలయం కాలపరిమితి 6 నెలలు పెట్టడం వల్ల ఇది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అంటే ఆ లోపు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలు చేయాలని సూచాయగా నిర్ణయించారు. అంటే మొత్తం 26 జిల్లాల ఏర్పాటు మార్చి లేదా ఏప్రిల్ లోపు పూర్తికానుంది. ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటు వల్ల ఇతర పదవుల్లో ఏ మార్పు లేనప్పటికీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు 26కు పెరుగుతాయి. ఎమ్మెల్యే సీటు ఆశించిరాని వారు, పోటీ చేసి ఓడిపోయిన వారు, వైసీపీలో ఆది నుంచీ ఉండి పార్టీ కోసం పని చేసిన వారికి చైర్మన్ పీఠాలు దక్కనున్నాయి. నూతన జిల్లాల ఏర్పాటు వ్యవహారం వైసీపీ నేతలకు డబుల్ బొనాంజాగా మారనుంది. ఈ లెక్కలే వేసుకుంటున్న వైసీపీ నేతలు… ఎవరికి వారు జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందోననే సమాలోచనలు జరుపుతున్నారు.