iDreamPost
android-app
ios-app

Konaseema Cyclone – కోనసీమ విషాదానికి పాతికేళ్లు

  • Published Nov 06, 2021 | 5:02 AM Updated Updated Nov 06, 2021 | 5:02 AM
Konaseema Cyclone – కోనసీమ విషాదానికి పాతికేళ్లు

ఒక పెను విపత్తు వల్ల కలిగిన విషాదం పాతికేళ్లుగా వెన్నాడుతుందంటే అది ఎంత విధ్వంసం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు. కోరంగి తుఫాను తరువాత తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిన మరో అతి పెద్ద తుఫాను కోనసీమ (ఆంధ్రా తుఫాను). వందల మందిని పొట్టనపెట్టుకుని.. లక్షల మందిని నిరాశ్రయులను చేసి.. కోట్ల రూపాయిల మేర ఆస్తి నష్టానికి కారణమైన ఈ పెను తుఫాను 1996 నవంబరు 6వ తేదీ రాత్రి కోనసీమలో తీరం దాటింది. అంటే సరిగ్గా నేటికి పాతికేళ్లు.

రెండున్నర దశాబ్ధాల కాలంలో ఎన్నో మరిచిపోతాం. కొన్ని విషయాలు.. సంఘటనలు మాత్రమే గుర్తుకు వస్తాయి. మనకు బాధ కలిగించే ఘటనలు చాలా వరకు మరిచిపోవాలని అనుకుంటాం. అయినా కొన్ని విషాదజ్ఞాపకాలు నీడలా వెన్నాడుతూనే ఉంటాయి. అటువంటి విషాద జ్ఞాపకం ఒకటి కోనసీమ వాసులను పాతికేళ్లుగా వెన్నాడుతూనే ఉంది. అదే ఆంధ్రా తుఫాను. దీని వల్ల కోనసీమ ఒక్కటే కాదు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇది ఎంత విషాదాన్ని కలిగించిందంటే ప్రపంచ దేశాలనే కదలించేంతగా. వారు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించేంతగా.

1996 నవంబరు 4న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫానుగా మారి కాకినాడకు దక్షణంగా 53 కిమీల దూరంలో కోనసీమ వద్ద తీరాన్ని దాటింది. ఈ సమయంలో తుఫాను గన్ను 64 కిమీలు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ఆంధ్రా తుఫానుగా పేరు పెట్టారు. తుఫాను కారణంగా 215 కిమీల ప్రచండ వేగంతో పెను గాలులు వీచాయి. 35 సెం.మీటర్ల వర్షం కురిసింది. 12 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. కోనసీమలో 250 గ్రామాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపగా, మరో 1,380 గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సముద్రంలో రాకాసి అలలు ఏర్పడి ఉప్పెన ముంచెత్తింది. దీని వల్లే తూర్పు తీరాన్ని ఆనుకుని ఉన్న ఐ.పోలవరం మండలం భైరవపాలెం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మత్స్యకార గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

Also Read : P Gannavaram Aqueduct – 1851 లో నిర్మించిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?

ఎక్కువగా సముద్రంలో వేటకు వెళ్లినవారు.. రొయ్య పిల్లల సేకరణ కోసం తీరంలో ఉన్న మత్స్యకారులు చనిపోయారు. ఈ కారణంగానే తుఫాను తరువాత సముద్రతీరంలో పదుల సంఖ్యలో శవాలు పడి ఉన్నాయి. ఈ విపత్తులో అధికారుల లెక్కల ప్రకారం 1,077 మంది, అనధికారికంగా మరో 2,760 మంది చనిపోయి ఉంటారని అంచనా. పెనుగాలులకు, భారీ వర్షం తోడుకావడంతో 6.47 లక్షల గృహాలు దెబ్బతినగా, పదివేలకు పైగా ఇల్లు నేలమట్టం అయ్యాయి. వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. పెనుగాలులకు వందల సంవత్సరాల మహావృక్షాలు సైతం కూకటివేళ్లతో సహా నెలకొరిగాయి. జాతీయ రహదారి కోల్‌కత్తా టు చెన్నై ఎన్‌హెచ్‌ నెం.5తోపాటు పలు రహదారులు ధ్వంసమయ్యాయి. సినిమా హాళ్లు, గోడౌన్లు, రేకుషెడ్లు, పూరిపాకల్లో దుకాణాలు ఆనవాళ్లు లేకుండా గాలుల్లో కొట్టుకుపోయాయి.

మత్స్యకారుల తరువాత అధికంగా నష్టపోయింది ఆన్నదాతలే. భారీ వర్షానికి కాలువ గట్లు తెగిపడడంతో పంటచేలు నీట మునిగాయి. 4.3 లక్షల ఎకరాల్లో వరి, 1.67 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 80 లక్షల చెట్లు నేలకొరగగా, మరో 50 లక్షల చెట్లు మొవ్వు విరిగి దిగుబడికి పనికిరాకుండా పోయాయి. వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. వేలాది పశువులు, లక్షలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. అమెరికా సంస్థ అంచనా ప్రకారం 4,490 కోట్లు ఆస్తినష్టం వాటిల్లింది. నాటి నుంచి  నేటి వరకు బంగాళాఖాతంలో తుఫాను అంటేనే రాష్ట్రం ఉలిక్కిపడుతోంది. ముందు జాగ్రత్త చర్యలకు దిగుతుంది. తీరం వెంబడి పలు తుఫాను షెల్టర్లను ఏర్పాటు చేశారు. చిన్నపాటి తుఫానుకు సైతం అధికారయంత్రాంగం పరుగులు తీస్తోంది. తీరాన్ని ఖాళీ చేయిస్తుంది. వీటన్నింటికీ కారణం కోనసీమ తుఫాను నుంచి నేర్చుకున్న గుణపాఠమే.

Also Read : Korangi City – కడలి గర్భంలో కలిసిపోయిన కోరంగి నగరం గురించి తెలుసా..?