iDreamPost
android-app
ios-app

కళ్ళు బ్రతికించిన ప్రేమ – Nostalgia

  • Published Sep 14, 2020 | 1:01 PM Updated Updated Sep 14, 2020 | 1:01 PM
కళ్ళు బ్రతికించిన ప్రేమ – Nostalgia

వెండితెర మీద ఎప్పటికీ ఫేడ్ అవుట్ కాని ఫార్ములా ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. కాకపోతే ఎప్పుడూ ఒకేలా చెప్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మన దర్శకులు వినూత్నంగా చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఆలాంటి వాటిలో ఒక విలక్షణ ప్రయత్నంగా ‘నిన్నే ప్రేమిస్తా’ను చెప్పుకోవచ్చు. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక క్యామియో చేయడం అప్పట్లో సెన్సేషన్. ఇది రీమేక్ చిత్రం. 1999లో తమిళ్ లో రాజకుమారన్ దర్శకత్వంలో ‘నీ వరువాయ్ ఎన’ వచ్చింది. పార్తీబన్, దేవయాని(సుస్వాగతం ఫేమ్)ప్రధాన పాత్రల్లో, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలకమైన ఎపిసోడ్ లో ఆర్మీ ఆఫీసర్ గా అజిత్ నటించాడు. అప్పుడది పెద్ద హిట్టు.

ఇందులో ఆర్టిస్టులు మన ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారు కావడంతో డబ్బింగ్ చేయకుండా ఆర్ బి చౌదరి పునఃనిర్మించాలని డిసైడ్ అయ్యారు. శ్రీకాంత్, సౌందర్య, రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్స్ లో సెట్ కాగా అజిత్ పోషించిన పాత్రకు నాగార్జున ముందుకు వచ్చారు. అప్పటికే ఈ బ్యానర్ లో ఆయనకు నువ్వు వస్తావని ఇండస్ట్రీ హిట్ ఉంది. ఈ కథ కూడా బాగా నచ్చడంతో ఒప్పుకున్నారు. ఆర్మీ ఆఫీసరైన తన ప్రియుడి ప్రాణం యాక్సిడెంట్లో పోయినా అతని కళ్ళను పొందిన మరో యువకుడిని ఆరాధిస్తున్న అమాయకురాలైన ఓ అమ్మయి కథే ఈ నిన్నే ప్రేమిస్తా. అలా అని తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండదు. కేవలం ఆ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలన్న తపన తప్ప. ఎవరూ ఊహించని కథాంశంతో రూపొందిన నిన్నే ప్రేమిస్తా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ముఖ్యంగా ఈ లోకంలో లేని వ్యక్తి కళ్ళను కాపాడుకోవడం కోసం నిత్యం తపించే సౌందర్య పాత్రను జనం బాగా ప్రేమించారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం దీనికి సొబగులు అద్దింది. ఒక దేవత వెలసింది, కోయిల పాట బాగుందా, ప్రేమలేఖ రాసెను నా మనసే పాటలు మారుమ్రోగిపోయాయి. వెంకటేశ్వర సుప్రభాతం ట్యూన్ లో కంపోజ్ చేసిన గుడి గంటలు మ్రోగే వేళా సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్ళు పరిశ్రమలో ఉన్నా చాలా లేట్ ఏజ్ లో దర్శకుడిగా మారిన ఆర్ఆర్ షిండే దర్శకుడిగా నిన్నే ప్రేమిస్తా రూపంలో డెబ్యుతోనే సూపర్ హిట్ కొట్టారు.

ఆ తర్వాత శ్రీకాంత్, సౌందర్య కాంబోలో ‘నా మానసిస్తారా’ అనే మరో సినిమా చేశారు కాని అది ఫ్లాప్ అయ్యింది. ఇంకొంత కాలానికే ఆయన కన్నుమూయడం సినీ అభిమానులను కలవరపరిచింది. నాగార్జున కనిపించేది కాసేపే అయినా చాలా కీలకమైనది కావడంతో ఆ పాత్ర చనిపోయినా ఫ్యాన్స్ బాధ పడలేదు. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ల బ్యాంక్ కామెడీ కూడా బాగా పేలింది. పాత తరం సంగీత దర్శకులు చక్రవర్తి ఇందులో నటించడం విశేషం. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఒక స్వచ్చమైన ప్రేమకథగా మిగిలిపోయిన నిన్నే ప్రేమిస్తా విడుదలై ఈ రోజులు 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ చూసిన ప్రతిసారి తాజాగా విరబూస్తూ మన గుండెలను తడుతూనే ఉంటుంది