iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్ తో ‘పండుగాడు’ చెడుగుడు

  • Published Apr 28, 2020 | 11:28 AM Updated Updated Apr 28, 2020 | 11:28 AM
బాక్సాఫీస్ తో ‘పండుగాడు’ చెడుగుడు

ప్రపంచంలో మేధావి అనిపించుకున్న ఎంత పెద్ద దర్శకుడికైనా అంత సులభంగా కొరుకుడుపడని పదార్థం ఒకటుంటుంది. దాన్నే సింపుల్ గా ఇంగ్లీష్ లో మాస్ పల్స్ అంటాం. గురి చూసి పట్టుకుంటే కనకవర్షం. కాదు తేడా కొట్టిందో అధఃపాతాళం. ఇది అందరికీ అనుభవమే. గొప్ప కమర్షియల్ హిట్లు తీసిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలు సైతం ఒకదశలో వీళ్లేంటి ఇలాంటి సినిమాలు తీశారని విమర్శలు అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఒకప్పుడు దళపతి, నాయకుడు తరహా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన మణిరత్నం ఇంటర్వెల్ కే లేచివెళ్లిపోయే కడలి లాంటి కళాఖండాలు తీశారు. ఇదంతా సహజమైన ప్రక్రియ. కానీ పడిపోవడం ఖాయమైనప్పుడు వీలైనంత వేగంగా ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో ఉన్నవాళ్లే మళ్ళీ తమ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు. వీళ్ళని అరుదైన కోవగా చెప్పుకోవచ్చు. అందులో ముందు వరసలో ఉండేందుకు తాపత్రయపడే పేరు పూరి జగన్నాధ్

ఒక నేపధ్యం

సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా వచ్చిన మహేష్ కెరీర్ లో అప్పటికే ఏడేళ్లు పూర్తయ్యాయి. మొదటి సినిమా రాజకుమారుడుతో కలుపుకుని అప్పటిదాకా గట్టిగా చెప్పుకోదగిన హిట్లు మూడే. మురారి బ్లాక్ బస్టర్ కాగా ఒక్కడు రికార్డు క్రియేటర్ అయ్యింది. కాని ఆ తర్వాత మాత్రం వరసగా చేదు అనుభవాలు. నిజం, నాని, అర్జున్ ఏవీ అంచనాలు అందుకోలేకపోయాయి. అతడు సినిమా పేరు తెచ్చినంతగా డబ్బులు ఇవ్వలేదు. అందుకే అభిమానుల ఆకలి, తన కసి తీరే కథ కోసం చూస్తున్నాడు ప్రిన్స్.

ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, శివమణి హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న పూరికి ఆంధ్రావాలా పెద్ద షాక్ ఇచ్చింది. తాను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసిన విషయం అర్థమయ్యింది. బద్రి హిందీ రీమేక్ శర్త్ ది ఛాలెంజ్ ఫలితం కూడా అంతంతే. తమ్ముడితో తీసిన 143, నాగ్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన ‘సూపర్’ అంచనాలు అందుకోలేకపోయాయి. ఈ సమయంలో వచ్చిన మహేష్ ఆఫర్. ఖచ్చితంగా కొట్టే తీరాలి. ఇప్పుడు మళ్ళి కిందపడితే లేవడానికి ఎవడూ చేయి ఇవ్వకపోవచ్చు.

ఒక నమ్మకం

మహేష్ పూరిని, అతని కథని పూర్తిగా నమ్మాడు. ముందు అనుకున్న టైటిల్ “ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ” తో పాటు హీరో బ్యాక్ గ్రౌండ్ లో చిన్న మార్పు తప్ప ప్రిన్స్ నుంచి ఇంకెలాంటి డిమాండ్ లేదు. ముందుకెళ్దాం అన్నాడు. మాస్ ఆడియన్స్ లో తన మార్కెట్ ఇంకా పెరగాలి. ఒక్కడుతో అది కొంత వరకు తీరింది కానీ ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. పోకిరితో వైకుంఠపాళి ఆటలో నిచ్చెన వేసుకుని పైకి ఎగబాకినట్టు దీంతో తనను పూరి ఎక్కడికో లిఫ్ట్ చేస్తాడన్న నమ్మకం గట్టిగా కుదిరింది. అటువైపు పూరి కూడా ఇంతే. పూరి సత్తా ఏంటో ప్రపంచానికి బాక్సు బద్దలయ్యేలా చాటాలి. ఇప్పుడీ పోకిరిని మిస్ చేసుకుంటే మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాలి. అందుకే పోకిరి విషయంలో చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వదలుచుకోలేదు.

ఒక పరుగు

షూటింగ్ అడ్డంకులు లేకుండా శరవేగంగా సాగిపోయింది. దేవదాస్ తో కుర్రకారు హృదయాలను గెలిచిన ఇలియానాను హీరోయిన్ గా తీసుకుని పూరి ఎంత తెలివైన పని చేశాడో రిలీజయ్యాక అర్థమయ్యింది. మణిశర్మ ట్యూన్స్ విన్నాక యూనిట్ లో రెండో అభిప్రాయం రాలేదు. తాను అప్పటిదాకా చేయని ఒక సరికొత్త పాత్రలో, మ్యానరిజంలో మహేష్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ స్థాయిలో ఇది చరిత్ర సృష్టించబోతోందో బహుశా అప్పుడైనా ఊహించాడో లేదో. టైటిల్ విన్నప్పుడు అందరిలోనూ ఆశ్చర్యం. రవితేజ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇడియట్ అని పెట్టడం ఓకే కాని మహేష్ లాంటి స్టార్ కు పోకిరి అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎవరు ఏమనుకున్నా పూరి మహేష్ తాము అనుకున్న దారిలోనే వెళ్లారు.

ఏప్రిల్ 28వ తేది, 2006

అంచనాలు ఉన్నాయి. కానీ సునామి స్థాయి ఎవరూ ఊహించలేదు.

మొదటి రోజు టికెట్లు దొరకవని తెలుసు. కానీ ఇంకో వంద రోజుల దాకా వాటి మీద ఆశలు వదులుకోవాలని ఎవరికీ తెలియదు

పూరి హీరోలను కొత్తగా చూపిస్తాడని తెలుసు . కానీ మహేష్ ఫ్యాన్స్ కాలర్లు చిరిగిపోయే లెవెల్ లో జరిగిన భీభత్సం గురించి మాటల్లో చెప్పేది కాదు

మణిశర్మ పాటలు ఆడియోలో హిట్టయ్యాయని తెలుసు. కానీ తెరమీద చూశాక మళ్ళి మళ్ళి జనాన్ని రప్పిస్తాయని ట్రేడ్ అంచనా వేయలేదు

ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అన్న డైలాగ్ పండుగాడు విలన్ ని చూసి అన్నాడు. కాని ఆ తర్వాత అర్థమయ్యింది ఆ మాటలు ఉద్దేశించింది ఇతర హీరోల పాత రికార్డుల గురించని

ఒకే ఒక్కడు

మహేష్ లో ఇంత స్టామినాని పూరి చూపించిన తీరుకు టికెట్ కౌంటర్లు నివ్వెరబోయాయి. వస్తున్న కలెక్షన్లు మొదటివారం మాములే అనుకున్నారు. కాని అవి ఎంతకీ తగ్గకపోగా ఏకంగా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే స్థాయిలో దుమ్ము దులిపేయడం చూసి ఏంటీ పోకిరిలో మేజిక్ అని మళ్ళీ చూసినవాళ్లు ఉన్నారు. అభిమానుల పూనకాలకు అడ్డే లేదు. ఒక్కడుని మర్చిపోయే స్థాయిలో మహేష్ విశ్వరూపం చూసి వసూళ్ల కనకాభిషేకం చేశారు. ఇక్కడ ఒకే ఒక్కడు అంటే పూరి. ఒకే ఒక్కడు అంటే మహేష్. ఇద్దరూ ఇద్దరే.

ఇందులో నటీనటుల గురించి, కీలకమైన సన్నివేశాల గురించి ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. ఆగేది కాదు. మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసినా ఊరమాస్ అవతారంలో పండుగాడితో బాక్సాఫీస్ తో ఆడిన చెడుగుడు మాత్రం 14 సంవత్సరాలు దాటినా ఇంకా వెంటాడుతూనే ఉంది.