iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ నడిబొడ్డున భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

హైదరాబాద్ నడిబొడ్డున భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధి బోయ గూడలో ఉన్న టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఘటనలో 11 మంది సజీవదహనం అయ్యారు. టింబర్ డిపోలో ఉన్న చెక్కలు మంటలు అంటుకుని తగలబడడంతో కార్మికులు అదుపు చేయలేకపోయారు. క్రమంగా మంటలు అక్కడే ఉన్న అన్ని దుంగలకు విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే సెంట్రల్ జోన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. 8 ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో టింబర్‌ డిపోలో మొత్తం 15 మందికి పైగా కార్మికులున్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో 11 మంది సజీవదహనం కాగా పొగతో ఊపిరాడక మరికొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మంటల నుంచి సురక్షితంగా ఇద్దరు కార్మికులు బయటపడ్డారు. మృతులంతా బీహార్​కు చెందిన కూలీలుగా గుర్తించారు.

ఇక గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తలసాని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.