iDreamPost
android-app
ios-app

టీడీపీలో ఉలికిపాటు ఎందుకు..?

టీడీపీలో ఉలికిపాటు ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. మంత్రివర్గ కూర్పులో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనుసరించిన విధానం.. టీడీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే విషయంలో వైఎస్‌ జగన్‌ అనుసరించిన చారిత్రాత్మక విధానం ఏపీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకడం టీడీపీ నేతల ఆందోళనకు ప్రధాన కారణం అయింది.మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన సీఎం వైఎస్‌ జగన్‌.. కేబినెట్‌లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల వారే ఉన్నారు. ఇందులో బీసీ సామాజికవర్గానికి చెందిన వారు 11 మంది మంత్రులు కాగా, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీలు ఒకరు మంత్రులుగా నియమితులయ్యారు. మిగతా 8 మంది ఓసీలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం మంత్రి పదవులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో.. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజికవర్గానికి చెందిన 11 మందిని మంత్రులుగా చేయడంతో ప్రతిపక్ష టీడీపీ ఉలిక్కిపడుతోంది.

బీసీల పార్టీగా మొన్నటి వరకు చెప్పుకున్న టీడీపీ.. ఆ సామాజికవర్గాన్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలు నామమాత్రమే. ఎన్టీ రామారావు తర్వాత టీడీపీలో బీసీలకు ప్రాధాన్యత కరువైంది. యనమల రామకృష్ణుడు, కింజారపు కుటుంబం, అయ్యన్నపాత్రుడు వంటి వారు ఆది నుంచి ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారే తప్పా.. కొత్త నేతలకు అవకాశం దక్కలేదు. అందులోనూ బీసీల్లో అత్యంత వెనుకబడిన వారికి రాజ్యాధికారం దక్కలేదు.

ఈ పరిస్థితిని మారుస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారి ముదిరాజ్, కొప్పుల వెలమ వంటి సామాజికవర్గాల వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో టీడీపీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా పరిస్థితి నెలకొంది. అందుకే వెంటనే మీడియా ముందుకు వచ్చిన అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడు బీసీలకు తామే ఎక్కువ చేశామని, బీసీ నేతలను తయారు చేశామంటూ పాత పాటే పాడారు. మూడేళ్లలో బీసీలకు జగన్‌ ఏమి చేశారో శ్వేతపత్రం ఇవ్వాలంటూ హాస్యాస్పదమైన డిమాండ్‌ను వినిపించారు. టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న ఈ తీరు.. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ ఆ పార్టీ నేతల్లో ఎంతటి అలజడిని రేపిందో తెలియజేస్తోంది.