iDreamPost
android-app
ios-app

బేగంబజార్ పరువు హత్య కేసులో నిందితులు పట్టివేత..

  • Published May 21, 2022 | 11:35 AM Updated Updated May 21, 2022 | 11:35 AM
బేగంబజార్ పరువు హత్య కేసులో నిందితులు పట్టివేత..

ఇటీవల వరుస పరువు హత్యలు అందర్నీ హడలెత్తిస్తున్నాయి. ఒకటి మరవకముందే మరొకటి పోలీసులకి సవాలుగా మారుతున్నాయి ఈ పరువు హత్యలు. తాజాగా బేగంబజార్‌ లో కోల్సావాడికి చెందిన నీరజ్‌కుమార్‌ పన్వర్‌ (22) ని పరువు హత్య చేసిన సంగతి తెలిసిందే. నీరజ్ కుమార్ అనే పల్లీల వ్యాపారి అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెలన్నర క్రితం ఓ బాబు కూడా పుట్టాడు.

అయితే సంజన ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు నీరజ్ పై పగబట్టి చంపాలనుకున్నారు. నీరజ్‌ను సంజన సోదరుడు గత ఆరునెలలుగా చంపాలని ట్రై చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సంజన సోదరుడు, అతని స్నేహితులు కొంతమంది నీరజ్‌ ని వెంబడించి రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి గ్రానైట్‌ రాయితో తలపై కొట్టారు, అయినా వదలకొండా కొబ్బరిబొండాల కత్తితో పొడిచి పరారయ్యారు.

బేగంబజార్‌లో పరువు హత్య జరగడంతో హత్యకు నిరసనగా అక్కడి వ్యాపారులు బంద్ కి పిలుపు ఇచ్చారు. దీంతో నిన్న రాత్రి ఆందోళనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయి బేగంబజార్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులని మోహరించారు. అయితే ఈ హత్యకేసులో పోలీసులు త్వరగా నిందితులని పట్టుకున్నారు.

హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలతో నిందితులని కనుక్కొని వారి కోసం గాలించారు. హత్య చేసిన తర్వాత నిందితులు కర్ణాటక వైపు వెళ్లినట్లు గుర్తించి హైదరాబాద్‌కు 150 కి.మీ.దూరంలో ఉన్న కర్ణాటక గుడిమిత్కల్‌లో నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనుమానంగా ఉన్న మరో 10 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగంగా చేస్తామని పోలీసులు చెప్పారు.

నీరజ్ సతీమణి సంజన మీడియాతో మాట్లాడుతూ.. నా భర్తని మా కజిన్ బ్రదర్ చంపారు. నీరజ్ ను హత్య చేసిన వారిని ఉరి తీయాలి. అప్పుడే నా భర్త ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇప్పుడు నా భర్తను చంపారు, రేపు నా రెండు నెలల బాబును చంపుతారు, నా అత్తా మమ్మల్ని కూడా చంపడానికి ట్రై చేస్తారు. ఇలా ఎన్ని రోజులు భయపడుతూ బ్రతకాలి. నాకు న్యాయం జరగాలి, నా పేరెంట్స్, కజిన్ బ్రదర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని భోరున విలపించింది.

నీరజ్ తల్లి మాట్లాడుతూ.. నా కళ్ళ ముందే కిరాతకంగా నీరజ్ ను చంపారు. మమ్మల్ని వెంబడించిన 5గురు దుండగులు మా దగ్గరికి రాగానే మా కళల్లో ఏదో చల్లారు దాంతో మాకు ఏం కనపడలేదు. కొబ్బరి బొండాల కత్తితో, పక్కనే ఉన్న రాయితో నా కొడుకుని చంపారు. నేను అడ్డుకోవడానికి ట్రై చేశాను. నన్ను పక్కకి తోసేశారు. ఆ హత్యని ఆపేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నా కొడుకుని చంపిన వారికి శిక్ష పడే వరకు నేను పోరాడతాను అని మీడియా ముందు బాధపడింది.